విస్తృత ఏర్పాట్లు చేయండి : సీఎస్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఈనెల 17వ తేదీన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె రామకృష్ణారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, డీజీపీ జితేందర్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజరు కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, జీఏడీ కార్యదర్శి రఘునందన్‌రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ ఈనెల 17న ఉదయం హైదరాబాద్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులర్పిస్తారని చెప్పారు.అనంతరం పబ్లిక్ గార్డెన్‌లో జరిగే ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొంటారని వివరించారు. గన్‌పార్క్ వద్ద జరిగే కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్ నోడల్ అధికారిగా ఉంటారనీ, గన్‌పార్క్‌కు ఫ్లోరల్ డెకరేషన్‌తోపాటు, షామియానా తదితర ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ సందర్భంగా నగరంలోని అన్ని ప్రధాన కార్యాలయాలు, విగ్రహాలు, పర్యాటక ప్రదేశాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని అన్నారు. పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించే సమావేశానికి తగు ఏర్పాట్లను చేయాలని రోడ్లు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిదాయకంగా జరిగేలా చూడాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పించడంతోపాటు తగు తాగునీరు, శానిటేషన్ ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి వీవీఐపీలతోపాటు ప్రజాప్రతిధులందరికీ ఆహ్వాన పత్రికలను అందచేయాలని ఆదేశించారు. ఈ సమావేశానికి ఫైర్ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, మున్సిపల్ శాఖ కార్యదర్శి ఇలంబర్తి, ప్రొటోకాల్ శాఖ డైరెక్టర్ శివలింగయ్య, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక, ఎస్‌పీడీసీఎల్ ఎండి ముషారఫ్, జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.
17న ప్రజాపాలన దినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES