– వినతిపత్రం సిద్ధం చేసి ఇన్స్పెక్టర్‌కు వాట్సాప్ ద్వారా పంపిన గ్రామ యువత
నవతెలంగాణ – ఉప్పునుంతల : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట, ఉప్పునుంతల మండలం గ్రామీణ ప్రాంతాల్లో పోస్ట్ బ్రాంచ్ సేవలపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. ఉప్పునుంతల మండలంలోని కొన్ని గ్రామాల్లో సకాలంలో ఉత్తరాలు అందకపోవడం, కొందరికి చెందాల్సిన పోస్టులు ఇతరులకు చేరడం వంటి విషయాలు ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. ఈ విషయంలో గ్రామ యువత ముందుకొచ్చి, పోస్ట్ బ్రాంచ్ లో కొనసాగుతున్న పనిచర్యలపై రాతపూర్వకంగా వినతిపత్రం సిద్ధం చేశారు. గ్రామస్థుల సంతకాలతో కూడిన ఈ వినతిపత్రాన్ని వారు జిల్లా పోస్టల్ ఇన్స్పెక్టర్‌కు వాట్సాప్ ద్వారా పంపించారు.
వినతిపత్రంలో చందాపూర్ పోస్ట్ బ్రాంచ్ ఆఫీసర్ ఉద్యోగుల పనితీరుపై పూర్తిస్థాయి విచారణ జరిపి, నిర్లక్ష్యానికి కారణమైనవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకొని, పోస్టల్ సేవలు నాణ్యంగా అందేలా పర్యవేక్షణ మరింత కఠినంగా చేయాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ ఈ రకమైన నిర్లక్ష్యం సరి కాదని, తమకు వచ్చే ముఖ్యమైన సమాచారం ఆలస్యం కావడం వల్ల నష్టాలు కలుగుతున్నాయని వాపోయారు. ఇది ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు.
ప్రజల ఈ ఆవేదనను అధికారులు గుర్తించి వెంటనే స్పందించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ప్రజా సేవలపై భరోసా కోల్పోకూడదని, పాలనా వ్యవస్థ ఆ సమస్యలపై తక్షణమే జిల్లా పోస్ట్ ఇన్స్పెక్టర్ వెంటనే స్పందించాలనీ వారు డిమాండ్ చేశారు.
గ్రామాల్లోకి వస్తున్న ఉత్తరాలు చందాపూర్ పోస్ట్ ఆఫీస్ అధికారి ఒకరి ఉత్తరాలు మరొకరికి ఇస్తూ గ్రామంలో ప్రజలకు ఇబ్బందులు కలిగేలా వ్యవహరిస్తున్నారు. జిల్లా పై అధికారుల స్పందించి పూర్తి విచారణ జరిపించి ఉత్తరాలు ఆలస్యం కాకుండా ఎవరి ఉత్తరాలు వాళ్లకే అందే విధంగా చర్యలు తీసుకొని పోస్ట్ ఉత్తరాలు పక్క తోవ పట్టకుండా చర్యలు తీసుకొని పూర్తి విచారణ చేపట్టి నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై చట్టరిస్తే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. – ఎత్తపు మధు, రాయిచేడు గ్రామం, పోస్ట్ చందాపూర్, ఉప్పునుంతల.