నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణంలో జరిగిన చేనేత పారిశ్రామిక సహకార సంఘం ఉత్పత్తి & వినియోగదారుల సంఘం లిమిటెడ్ 78వ వార్షిక, 93వ సర్వసభ్య సమావేశంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. చేనేత అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు.
నేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. గడచిన దశాబ్దం నుండి పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేస్తున్నామని, నేత కార్మికుల కోరిక మేరకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనున్నట్లు వెల్లడించారు. నేతన్న చేయూత, నేతన్న బీమా వంటి పథకాల బకాయిలను కూడా జమ చేస్తున్నామని ఆయన తెలిపారు.
వేములవాడలో ఏర్పాటు చేసిన నూలు డిపో ద్వారా ఇప్పటివరకు వంద సొసైటీలకు 2,500 మెట్రిక్ టన్నుల నూలుదారాన్ని అందజేశామని అన్నారు. వస్త్ర పరిశ్రమలో ఆధునిక సాంకేతికత పెంపు కోసం హ్యాండ్లూమ్ యూనివర్సిటీ, ఐఐహెచ్‌టి స్థాపనకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.రైతుల మాదిరిగానే నేత కార్మిక కుటుంబాలకు భరోసా కల్పించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతన్న భీమా పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు.
ఈ పథకం కింద నమోదు అయిన నేత కార్మికుల కుటుంబాలకు ఐదు లక్షల ప్రమాద బీమా సదుపాయం అందజేస్తారని వివరించారు.జిల్లా పరిధిలో చేనేత సహకార సంఘాలకు పావలా వడ్డీ పథకం ద్వారా ఇప్పటివరకు 15.62 లక్షల రుణ సాయం అందజేయబడిందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పేద ప్రజలపై పన్నుల భారం వేయకుండా, ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘం నాయకులు నాగుల సత్యనారాయణ తో పాటు సంఘం సభ్యులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులున్నారు.