Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిప్రజారోగ్యం విలవిల

ప్రజారోగ్యం విలవిల

- Advertisement -

ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశ ప్రజల ఆరోగ్యం మీదే ఆధారపడి ఉంటుంది. కానీ స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా నేటికీ కనీస ప్రాథమిక వైద్య అవసరాలు తీర్చలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయంటే… వారికి మనుషుల ప్రాణాలంటే విలువ లేకపోవడమే. ఏటా వాతావరణ మార్పులతో కమ్మేస్తున్న సీజనల్‌ వ్యాధులు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కరోనా కంటే ప్రమాదకరంగా వైరల్‌ జ్వరాలు భయపెడుతున్నాయి. దానికి నమోదవుతున్న కేసులే ఉదాహరణ. రోజురోజుకు అంటువ్యాధులతో పాటు ఇతర కొత్త జబ్బులు పుట్టుకొస్తున్నాయి. ప్రబలుతున్నాయి. డెంగీ, చికున్‌గున్యా, మలేరియా, విష జ్వరాలతో మనిషి చిక్కి శల్యమవుతున్నాడు. ఆరోగ్యాన్ని కాపాడుకునేం దుకు లక్షల రూపాయలు ఖర్చు చేసి అప్పుల పాలవుతున్నారు. ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని పాలకులు చెప్పుకుంటున్నా ప్రాథమిక వైద్యరంగం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది.

ఇటీవల దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో వర్షాలు బాగా కురిశాయి. వర్షాలు, వరదలతో జనం బెంబేలెత్తారు. తీవ్ర ఆస్తి నష్టాన్ని కలిగించాయి. వ్యాధులు కూడా చుట్టుము ట్టాయి. ఒక్కొక్కచోట ఒక్కో పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలంగాణలో పరిస్థితి దారుణంగా తయారైంది. ఒకవైపు వర్షాలు, వరదలతో భారీగా నష్టం చేకూర్చింది. దాన్నుంచి తేరుకోకముందే పారిశుధ్యం లోపించి ప్రజలు అనారోగ్యం బారినపడ్డారు. వైరల్‌ ఫీవర్‌ కేసులు పెరిగాయి. జ్వర పీడితులు లేని ఇల్లు లేదంటే ఆశ్చర్యకరమే. జలుబు, దగ్గు, జ్వరాలతో ఆస్పత్రులకు క్యూ కట్టారు. హైదరాబాద్‌లోని గాంధీ, నిలోఫర్‌, ఉస్మానియా, ఫీవర్‌ ఆస్పత్రులతో పాటు జిల్లా ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోయాయి. ఆగస్టులో సగటున 400 నుంచి 600 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 800కి పెరిగింది. ప్రధాన ఆస్పత్రుల్లో ఓపీ, ఇన్‌పేషెంట్ల సంఖ్య బాగా పెరిగింది. 40 శాతం పైనే పెరిగిన కేసుల సంఖ్య.. సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. జనం విలవిలలాడుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో పాటు ఏజెన్సీల్లో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే రాష్ట్రంలో 5 వేల డెంగీ కేసులు నమోదు కాగా… ఆగస్టు నెలలోనే 300 డెంగీ కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా ఇంకా ఎన్నో కేసులు ఉన్నాయి. దీనికంతటికీ ప్రభుత్వం వద్ద ముందు చూపులేకపోవడమే. వర్షాకాలం ప్రారంభం సమయంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలడం సర్వసాధారణం అని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం నిర్లక్ష్య ధోరణికి పరాకాష్ట. డాక్టర్లు లేకుండా పీహెచ్‌సీలు ఉండటం, కావాల్సిన మందులు లేకపోవడం, అపరిశుభంగా ఉండటం వల్ల చిన్న చిన్న రోగాలకూ పట్టణ ప్రాంతాలకు వచ్చి రోగులు జేబులు గుల్ల చేసుకుంటున్నారు. పిహెచ్‌సీలను పటిష్టం చేసుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు లేకపోతే పరిస్థితి మరింత అదుపుతప్పేదేమో. వాస్తవానికి బడ్జెట్లో వైద్యానికి పెట్టిన కేటాయింపులు నామమాత్రమే. అవి కేవలం వేతనాలు, కొత్త భవనాల నిర్మాణాలకు కేటాయింపులు ఉన్నాయి తప్ప ఇతర వాటికి లేవని చెప్పవచ్చు. కానీ కేరళ ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దానికి ప్రధాన కారణం అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేసుకోవడం. ప్రతీ గ్రామంలో ఫ్యామిలీ హెల్త్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం వల్ల కేరళ వైద్యరంగాన్ని దేశంలోని అగ్రగామిగా నిలిపిందనడంలో సందేహం లేదు. కరోనా లాంటి ఎన్నో వైరస్‌లను తట్టుకుని ప్రజలందరిని ఆరోగ్యంగా ఉంచడానికి అక్కడ తీసుకున్న జాగ్రత్తలు, అమలు చేసిన విధానాలు కారణం.

పారిశుధ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే.. ప్రతీ సంవత్సరం విషజ్వరాల కేసులు పెరుగుతూనే ఉంటాయి. సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం కూడా అపరిశుభ్రతకు ఒక కారణం. పాలకవర్గాలు లేవన్న సాకుతో కేంద్రప్రభుత్వం కూడా నిధులు ఇవ్వకుండా ఉండటం దారుణం. అన్నింటికన్నా ముందు పిహెచ్‌సీలను బలోపేతం చేసి ప్రాథమిక ఆరోగ్యరంగాన్ని కాపాడాలి. చాలా దేశాల్లో ప్రభుత్వ ఆస్పత్రులే ఎక్కువ సేవలు అందిస్తుంటే, మన దగ్గర మాత్రం ప్రయివేటు, కార్పొరేట్‌ రంగాలది సింహభాగం. వైద్యం కోసం ప్రజలు సొంతంగా ఖర్చు చేసే సొమ్ము 87 శాతంగా ఉండటం విస్మయం కల్గిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు కల్పించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు కోల్పోవల్సిందేనా. సాధారణంగా సీజనల్‌ వ్యాధుల నివారణకు చేపట్టాల్సిన చర్యలకు ప్రభుత్వం ఇంతవరకు ప్రణాళికలు చేపట్టలేదు. ప్రజారోగ్యానికి కావాల్సిన వైద్యులను కేటాయించడం, మందులను ఆస్పత్రులకు సమకూర్చడం చాలా ముఖ్యమైనవి. పరిసరాల పరిశుభ్రత, మంచినీటి వసతి కల్పించగలిగితే అనేక రోగాలను నివారించవచ్చు. అందుకే ‘అందరికీ ఆరోగ్యం’ నినాదాన్ని సాకారం చేయాలంటే ఆరోగ్య వ్యవస్థను మార్కెట్‌ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలేసే విధానాలను పాలకులు విడనాడాలి. ప్రజారోగ్యాన్ని రక్షించాలి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad