6 గ్యారంటీలు వెంటనే అమలు చేయాలి
ఉపాధి హామీపై బీజేపీ దాడిని తిప్పి కొట్టాలి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి
పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట కలెక్టరేట్ ముట్టడి
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ప్రభుత్వం వెంటనే ప్రజా సమస్యలను పరిష్కరించాలని, ఆరు గ్యారంటీలను అమలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట పట్టణం నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి.. ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. రైతాంగానికి పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదన్నారు. రైతు భరోసా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి.. రూ.6000 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని చెప్పారు. పేదలందరికీ ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇస్తోందని ఆరోపించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన హుజూర్‌నగర్ నియోజకవర్గంలో మాత్రమే ఇండ్లు నిర్మిస్తున్నారు తప్ప జిల్లాలో ఏ గ్రామంలోనూ నిర్మాణాలు చేపట్టలేదని తెలిపారు.
ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, వంటి స్కీం వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. జిల్లాలోని 27 గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయని, ప్రభుత్వం తక్షణమే మరమ్మతులు చేసి అర్హులైన పేదలకు కేటాయించాలని కోరారు. వేసవికాలంలో తాగునీటి పరిష్కారానికి ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. మరోవైపు, అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ.. కూలీల నోట్లో మట్టి కొట్టేందుకు వీబీజీఆర్‌ఏఎం-జీ పథకాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ఉపాధి హామీని పాత పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టంపై బీజేపీ దాడిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కూలీలను రెండు పూటలా ఫొటో తీసే విధానాన్ని రద్దుచేసి మస్టర్ ద్వారా హాజరు వేయాలని కోరారు. ఏడాదికి 200 రోజులు పనులు కల్పించి, రోజు కూలి రూ.600 ఇవ్వాలన్నారు.
కలెక్టరేట్ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు
కలెక్టరేట్‌ను ముట్టడించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రజలను, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ బయటకు రాకపోవడంతో గేట్లు ఎక్కి దూకేందుకు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు సీపీఐ(ఎం) నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌కు వినతి పత్రం అందజేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, నాయకులు జిల్లపల్లి నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్, వేల్పుల వెంకన్న, వీరబోయిన రవి, మద్దెల జ్యోతి, కందాల శంకర్ రెడ్డి, మేకనబోయిన శేఖర్, దండ వెంకటరెడ్డి, బుర్ర శ్రీనివాస్, కొప్పుల రజిత, ఎల్గూరి గోవింద్, పల్లె వెంకటరెడ్డి, షేక్ యాకుబ్, పాండు నాయక్, షేక్ సైదా, వట్టెపు సైదులు, మిట్ట గనుపుల ముత్యాలు, విజయలక్ష్మి పాల్గొన్నారు.



