Tuesday, December 30, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఅసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాలి

అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాలి

- Advertisement -

పాలమూరు-రంగారెడ్డి రైతులకు అన్యాయం
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం అఖిలపక్ష పోరాటం అవసరం
యూరియా యాప్‌పై ప్రభుత్వం పునరాలోచన చేయాలి
జర్నలిస్టుల్లో విభజన సరికాదు.. అందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

నవతెలంగాణ-సూర్యాపేట
అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారాలు చూపాలని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వంలోనూ రైతులకు అన్యాయం జరుగుతూనే ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం జీవీవీ గార్డెన్‌లో నిర్వహించిన సీపీఐ(ఎం) జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశానికి సోమవారం ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో జాన్‌వెస్లీ మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై నందున రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి చర్చించడంతో పాటు తగిన పరిష్కారం కూడా చూపాలన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 90శాతం పనులు పూర్తయ్యాయని మాజీ సీఎం కేసీఆర్‌, అసలు పనులే చేయలేదని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారన్నారు.

అయితే, గత బీఆర్‌ఎస్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు నిధుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రాజెక్టు పనులు మందగించాయని తెలిపారు. భూ సేక రణ, కాల్వల నిర్మాణం సక్రమంగా జరగక పోవడంతో సాగునీరందక రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని అన్నారు. భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటికీ తగిన నష్టపరిహారం అందలేదన్నారు. ఇది రైతుల పట్ల ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రాజెక్టు కోసం రూ.32వేల కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నాయని విమర్శించారు. ఇంకా రూ.42 వేల కోట్ల నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. 4వేల ఎకరాలు భూసేకరణ, కాలువల నిర్మాణం, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ సాధన అంశంపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని స్పష్టమవుతోందని, ఈ అంశాన్ని రాజకీయ లాభనష్టాలకు పరిమితం చేయ కుండా అఖిలపక్షం ఆధ్వ ర్యంలో ఉద్య మంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసర ముందని జాన్‌వెస్లీ అన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు సీపీఐ(ఎం) తన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఎన్నో హామీలిచ్చి అధికారంలోకొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేండ్ల పరిపాలనలో అన్ని రంగాల్లోనూ వైఫల్యం చెందిందని విమర్శిం చారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీ ప్రజల గొంతుకగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ప్రకటించకుండా నిరుద్యోగులను మోసగిస్తోందని విమర్శించారు. అదేవిధంగా మహిళలకు రూ.2500 ఇంతవరకు ఇవ్వలేదని, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో పూర్తి స్థాయిలో పేద ప్రజలకు న్యాయం జరగడం లేదని అన్నారు. ముఖ్యంగా పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, కొత్త చట్టం పేరుతో ఉపాధి పనిదినాలను కుదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

ఇది గ్రామీణ పేదల జీవనంపై దాడి వంటిదన్నారు. యూరియా పంపిణీలో తీసుకొచ్చిన యాప్‌పై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు. సరిపడా యూరియా అందుబాటులో ఉంచి, ఎక్కడా కొరత తలెత్త కుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. యూరియా కొరత కొనసాగితే రైతులతో కలిసి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. జర్నలిస్టుల అక్రిడి టేషన్ల జారీ విషయంలో వివక్ష చూపడం తగదన్నారు. డెస్క్‌ జర్నలిస్టులను వేరు చేయొద్దని, గతంలో ఇచ్చినట్టుగా 23వేల మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ కార్డులివ్వాలన్నారు. స్వేచ్ఛాయుత మీడియా లేకుండా ప్రజాస్వామ్యం బలపడదని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరి రావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి, అవాజ్‌ జిల్లా కార్యదర్శి జహంగీర్‌ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -