Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుజనజీవనం అస్తవ్యస్తం

జనజీవనం అస్తవ్యస్తం

- Advertisement -

వర్షబీభత్సంతో నీట మునిగిన పంట పొలాలు
లోతట్టు ప్రాంతాలు జలమయం
నిండుకుండల్లా ప్రాజెక్టులు
వరదలతో తెగిన రోడ్లు.. నేలకూలిన ఇండ్లు
పలు గ్రామాలకు రాకపోకలు బంద్‌
ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాధుల భయం
మంజీరాలో చిక్కుకున్న గొర్ల కాపరులను రక్షించిన రెస్క్యూ టీం
శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తివేత
నాగార్జునసాగర్‌ 26 గేట్లు ఓపెన్‌
నవతెలంగాణ-మొఫిషియల్‌ యంత్రాంగం

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతా లను వరదలు ముంచ ెత్తుతున్నాయి. ఏజెన్సీ ప్రజలు అల్లాడుతు న్నారు. వాగులు వంకలు పొంగిపొ ర్లుతున్నాయి. ప్రాజెక్టుల గేట్లు తెరవడంతో కాలువల కట్టలు తెగి పంట పొలాలు వరద నీటిలో మునిగిపోయాయి. నిజామాబాద్‌, మెదక్‌, సిద్దిపేట, ములుగు, సంగారెడ్డి, కామారెడ్డి, మంచిర్యాల, కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి.ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరామసాగర్‌ ప్రాజెక్ట్‌కు భారీగా వరద వస్తోంది. స్థానికంగా కురుస్తున్న వర్షాల తోపాటు మహా రాష్ట్ర నుంచి పెద్దఎత్తున వరద వస్తుండటంతో గోదావరి నది గుండా ప్రాజెక్టులోకి ప్రవహిస్తూ ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,25,400 క్యూసెక్కుల నీరు చేరుతోంది. అధికారులు ప్రాజెక్టు 8 గేట్ల నుంచి 25వేల క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. క్రమంగా వరద పెరగడంతో సాయంత్రానికి 39 గేట్లు ఎత్తారు. ఎగువ ప్రాంతాల నుంచి లక్ష 52వేల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్టు ప్రాజెక్టు ఎస్‌ఈ తెలిపారు. నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టు వరద గేట్లను తెరిచారు.

కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గాన్ని వరుణుడు వణికించాడు. ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. వాగులపై ఉన్న లోలెవల్‌ వంతెనలపై నుంచి వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. నిజాంసాగర్‌ మండలంలో 21.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలకు డీఈవో రాజు సెలవు ప్రకటించారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో రెండు మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి.

మంజీరా నది వరదలో చిక్కుకున్న కాపరులు
బిచ్కుంద మండలంలోని గుండెకల్లుర్‌ గ్రామానికి చెందిన యాదుగొండ, సాయిగొండ, షెట్లుర్‌ గ్రామానికి చెందిన చాకలి సాయిలు, జుక్కల్‌ మండలంలోని బస్వాపూర్‌ గ్రామానికి చెందిన సాయిగొండ నలుగురు కలిసి ఏడు వందల గొర్లను షెట్లూర్‌ గ్రామ శివారులోని మంజీర పరివాహక ప్రాంతమైన బసన్నగడ్డకు మేపడానికి తీసుకెళ్లారు. ఆదివారం రాత్రి బసన్నగడ్డపైనే విశ్రాంతి తీసుకున్నారు. ఎగువన కురిసిన భారీ వర్షాలతో నిజాంసాగర్‌ డ్యాం, కౌలాస్‌ డ్యాం నిండటం డ్యామ్‌ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు అప్రమత్తమై ఏస్‌డీఆర్‌ఎఫ్‌, ఫైర్‌ సిబ్బందిని, పోలీస్‌ బెటాలియన్‌ను రప్పించారు. నాలుగు బోట్ల ద్వారా ఆరు గంటలపాటు శ్రమించి గొర్రెలు, కాపరులను సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చారు.

ఉమ్మడి వరంగల్‌లో మూడు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌
ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ హెచ్చరికలు జారీ చేసింది. వరంగల్‌, హన్మకొండ, జనగామ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ ప్రకటించింది. సోమవారం ఉదయం నుంచి వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. ములుగు జిల్లాలో అత్యధికంగా మంగపేట మండలంలో 17.7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.

గిరిజన గ్రామాలకు నిలిచిన రాకపోకలు
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌ చుట్టూ వరద నీరు చేరింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జంపన్నవాగు ఉప్పొంగడంతో కొండాయి వద్ద రాకపోకలను నిలిపివేశారు. ఏటూరునాగారం- భద్రాచలం మధ్యలోని జీడివాగు ఉప్పొంగడంతో బస్సులు, లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎర్రవాగు ఉధృతికి కమలాపురం గ్రామ భగత్‌ సింగ్‌ నగర్‌, ఇందిరా కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. భారీగా వరద నీరు ఇండ్లలోకి చేరింది. వరద ఉధృతి పెరగడంతో ప్రజలు అందిన వస్తువులను చేత పట్టుకొని ఇండ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ములుగు జిల్లాలోని రామప్ప, లక్నవరం మధ్యతరహా ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో వరద ప్రవాహం కొనసాగుతోంది.

పెరుగుతున్న గోదావరి
భద్రాచలం వద్ద గోదావరికి ఎగువ ప్రాంతం నుంచి నీరు వచ్చి చేరుతుండటంతో క్రమక్రమంగా పెరుగుతోంది. సాయంత్రం 6 గంటలకు 38 అడుగులకు చేరింది. మణుగూరు మండలం పగిడేరు పంచాయతీ పరిధిలోని పోచంపల్లి చెరువు అలుగుపడటంతో పోచంపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. వరదనీరు గ్రామంలోకి ప్రవేశించింది. శాంతినగర్‌ ఊర చెరువు అలుగు గ్రామ మధ్యలో నుంచి ప్రవహించడంతో ఇండ్లల్లోకి నీరు చేరింది.

సింగరేణిలో అంతరాయం
సింగరేణిలో ఉపరితల గనులలోకి వరదనీరు చేరింది. బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది. సుమారు లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దుమ్ముగూడెం మండలంలో ప్రధాన వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పర్ణశాల వద్ద గోదారమ్మ ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. సీతానార చీరల ప్రదేశం పూర్తిగా నీట మునిగింది. అశ్వాపురం మండలం గొందిగూడెం- ఎలకలగూడెం గ్రామాల మధ్య ఇసుక వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

మంచిర్యాలలో కాలనీల్లోకి భారీగా వరద
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షం కురిసింది. పట్టణంలో ఇండ్లలోకి నీరుచేరడంతో జనం అవస్థలు పడ్డారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. బైపాస్‌ రోడ్‌ నుంచి రాళ్లపేటకు వెళ్లే కాజ్‌వే పైనుంచి వరద పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో పెద్దఎత్తున వర్షం నీరు నిలిచింది. అధికారులు అప్రమత్తమై రోగులను ఇతర వార్డుల్లోకి తరలించారు. శ్రీరాంపూర్‌ ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోనూ లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో..
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం, జూరాల రిజర్వాయర్లు నిండుకుండను తలపిస్తున్నాయి. మూడు గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. గద్వాల జిల్లా మానవపాడు అమరవాయి మధ్యలో ఉన్న పెద్దవాగు రాకపోకలకు అంతరాయంగా మారింది. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ పరిధిలో ముక్కిడిగుండం చిన్నవాగు ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. కేసరి సముద్రం నల్లవాగు నాగనోలు వడ్డెమానుచెరువులు పొంగిపొర్లుతున్నాయి. దుందుభి నది పోర్ట్‌ ఎత్తడంతో రామగిరి, రఘుపతిపేట, సిరిసినగండ్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరి, పత్తి, మొక్కజొన్న పంటలు మునిగాయి. వనపర్తి జిల్లా మదనాపూర్‌ ఊకచెట్టువాగు ప్రవహిస్తుండటంతో ఆత్మకూరు, అమరచింత, అయ్యవారిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచాయి.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో జలదిగ్బంధనంలో గ్రామాలు
మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలం బొడమటిపల్లి వద్ద గుండువాగు ఉగ్రరూపం దాల్చడంతో కారు నీటి ప్రవాహంలో చిక్కుకుపోయింది. అందులో ఉన్న వారి అరుపులు విన్న బొడమట్‌పల్లి యువకులు తాళ్ల సాయంతో రక్షించారు. పల్వంచ దన్నురా, వెంకటాపూర్‌, చల్లపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చకిలం సురేష్‌ గుప్తా కిరాణం షాప్‌లో రెండు లక్షల రూపాయల సరుకులు నీటిపాలయ్యాయి. వెంకటపూర్‌లో చెరువు, కుంటలకు గండ్లు పడటంతో ట్రాన్స్‌ఫార్మర్లు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. గ్రామస్తులు కలిసి జేసీబీల సహాయంతో మట్టిని పోసి తాత్కాలికంగా గండ్లను పూడ్చారు. పాల్వంచ గ్రామాన్ని వరద చుట్టుముట్టడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తూప్రాన్‌ మండలం కిష్టాపూర్‌ గుండ్రెడ్డిపల్లి వెళ్లే రహదారిపై వెళ్తున్న హల్దీ వాగును , కుకునూర్‌పల్లి గాగ్రామ శివారులోని బ్రిడ్జిని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. శివ్వంపేట మండలం పోతులబోగూడ-పాంబండ డబుల్‌ రోడ్డు తెగిపోవడంతో మెదక్‌, వెల్దుర్తికి రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్‌ మండలంలో గల సింగూర్‌ ప్రాజెక్ట్‌కు 32 వేల క్యూసెక్కుల పైచిలుకు ఇన్‌ఫ్లో వస్తోంది. 43 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని బీడీ కాలనీ సమీపంలో ఉన్న గోండు గుడారాల్లోకి వరద నీరు చేరింది. వర్గల్‌ మండలంలోని అంబర్‌పేట శివారులో ఉన్న ఖాన్‌చెరువు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో.. ముందస్తు జాగ్రత్తగా అంబర్‌పేట్‌ నుంచి శాకారం వైపు వెళ్లే రోడ్డును అధికారులు మూసి బ్యారికెడ్లు ఏర్పాటు చేశారు. ములుగు మండల వ్యాప్తంగా ఆదివారం 157 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని తహసీల్దార్‌ తెలిపారు. మర్కుక్‌ మండలంలో పంటలు నీటమునిగాయి. చేబర్తి నుంచి ఇప్పలగూడెం రోడ్డు పూర్తిగా మునిగిపోవడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగార్జున సాగర్‌ 26 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad