పదేళ్లలో పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్లను విస్మరించారు
రైతులంటే గత ప్రభుత్వానికి చిన్న చూపు
రైతుల పట్ల ముసలి కన్నీరు కార్చడం హాస్యాస్పదం
రైతులకు సాగునీరు అందించి ఆదుకోవడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం
తొర్రూరు చెరువులో గోదావరి జలాలకు పూజలు చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రాజెక్టుల పేరుతో గత ప్రభుత్వం ప్రసజాదనాన్ని లూటీ చేసి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి విమర్శించారు. మండలంలోని తొర్రూరు జే ఊర చెరువు గోదావరి జలాలతో నిండి మత్తడిపోవడంతో మంగళవారం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చెరువులో గోదావరి జలాలకు పూలు చల్లి జలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల క్రితం ఊర చెరువు మత్తడి కి గండి పడినప్పటికీ మరమ్మతు చర్యలు చేపట్టడంలో గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. మత్తడి మరమ్మతు పనులు చేపట్టి రైతాంగాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో 19 లక్షలతో మత్తడి నిర్మాణ పనులు పూర్తిచేసి గోదావరి జలాలతో చెరువును నింపామని తెలిపారు.
గోదావరి జలాలతో ఊర చెరువు జలకళలాడుతుందని అన్నారు. అయ్యంగారి పల్లి తో పాటు దంతలగడ్డ, రేగులగడ్డ ప్రజలకు, ఆయకట్టుదారుల సౌలభ్యం కోసం మత్తడి సమీపంలో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులను ప్రారంభిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. గోదావరి జలాలతో చెరువులు, కుంటలను నింపి రైతులను ఆదుకుంటామని తెలిపారు. 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ పనులు పూర్తి కాలేదని, 25 శాతం పనులు పూర్తి చేసి చేతులు దులుపుకున్నారని తెలిపారు. పెండింగ్ లో ఉన్న రిజర్వాయర్ పనులను పూర్తి చేసి పాలకుర్తి నియోజకవర్గం లోని రైతాంగానికి సాగునీరు అందించాలని సదుద్దేశంతో పెండింగ్ రిజర్వాయర్ పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తానని, సాగునీటి కష్టాలు తీరుస్తానని, ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి లతో పాటు మంత్రులను కలిసి రిజర్వాయర్ పనుల పూర్తికి నిధులు కేటాయించాలని కోరామన్నారు.
చెన్నూరు, పాలకుర్తి, ఉప్పుగల్లు రిజర్వాయర్ల నిర్మాణాలతో పాటు సాగునీరు అందించే కాలువల నిర్మాణాలకు ప్రభుత్వం వెయ్యి పదిహేను కోట్లు విడుదల చేసేందుకు మంత్రివర్గం ఆమోదించిందని తెలిపారు. రాబోవు రెండు సంవత్సరాల్లో పెండింగ్ రిజర్వాయర్ పనులను పూర్తి చేసి పాలకుర్తి నియోజకవర్గం తో పాటు తుంగతుర్తి ప్రాంతానికి 78 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని, పాలకుర్తి నియోజకవర్గం లో 45 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. రిజర్వాయర్ల పూర్తితో పాలకుర్తి ప్రాంత రైతుల చిరకాల కోరిక నెరవేరుతుందని అన్నారు. గత ప్రభుత్వం రైతులను చులకనగా చూసిందని, రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే రిజర్వాయర్ పనులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే కొత్త నాటకాలకు రైతుల పట్ల ముసలి కన్నీరును కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎవరి పాలన ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారని రాబోవు ఎన్నికల్లో 2023 ఎన్నికల స్ఫూర్తితో గుణపాఠం చెబుతారని అన్నారు.
సొంత ఇంజనీర్ వ్యవస్థతో నిర్మాణం చేసిన కాలేశ్వరం కూలేశ్వరం అయిందని, కారు షెడ్డు కు చేరుకుందని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ పనులు చేసి రైతులకు సాగునీరు అందించాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రిజర్వాయర్ పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం పునాదిరాయి వేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి చేస్తుందని, పాలకుర్తి ప్రాంత రైతాంగం మోసం చేసే ప్రతిపక్షాల మోసపూరిత మాటలను నమ్మరాదని సూచించారు. ప్రజా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్ జెండా నేనని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావుడియా మంజుల, వైస్ చైర్మన్ అనుముల మల్లారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, తొర్రూరు సొసైటీ చైర్మన్ గోనె మైసిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ తొర్రూరు గ్రామ అధ్యక్షుడు చిలువేరు బాలరాజు, పాలకుర్తి సొసైటీ మాజీ చైర్మన్లు వీరమనేని యాకాంతరావు, అడ్డూరి రవీందర్రావు, జిల్లా మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి మదర్, నాయకులు మారం శ్రీనివాస్, గోనె కార్తీక్ రెడ్డి, చిలువేరు సంపత్, కమ్మగాని నాగన్న గౌడ్, పెనుగొండ రమేష్, బొమ్మగాని భాస్కర్, లావుడియా భాస్కర్, బండిపెళ్లి మనమ్మ లతోపాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.