– అమెరికా అధ్యక్షుడికి ఆదరణ తగ్గింది రాయిటర్స్ ఇప్సాస్ పోల్‌లో వెలుగులోకి..
– మిన్నెసోటా నిరసనలపై ఉక్కుపాదం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఇమ్మిగ్రేషన్ విధానాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాయిటర్స్/ఇప్సోస్ నిర్వహించిన పోల్‌ను పరిశీలిస్తే ట్రంప్ విధానానికి మద్దతు ఇచ్చే వారి సంఖ్య తగ్గుతూ వస్తున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు ఈ నెలలో మిన్నెపొలీస్‌లో ఇద్దరిని కాల్చి చంపడాన్ని అమెరికన్లు నిరసిస్తున్నారు. ఈ నెల 23-25 తేదీల మధ్య అమెరికా వ్యాప్తంగా ఈ పోల్‌ను నిర్వహించారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్ అవలంబిస్తున్న వలసవాద విధానాలపై ప్రజల్లో సానుకూలత కనిష్ట స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. అమెరికాలోని వివిధ నగరాలకు ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లను పంపడాన్ని నిరసిస్తూ మిన్నెపొలిస్‌లో ఈ నెల 24న ప్రదర్శన జరిగింది. ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లతో నిరసనకారులు వాగ్వివాదానికి దిగారు. దీనిపై ఆగ్రహించిన ఏజెంట్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో అమెరికా పౌరుడొకరు ప్రాణాలు కోల్పోయారు. రాయిటర్స్/ఇప్సోస్ పోల్‌పై ఈ ఘటన ప్రభావం చూపింది. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాన్ని ఏకంగా 53 శాతం మంది అమెరికన్లు వ్యతిరేకించారు. 39 శాతం మంది మాత్రమే సానుకూలంగా స్పందించారు. ఈ పోల్‌కు ముందు ఈ సానుకూలత 41 శాతంగా నమోదైంది. పోల్ సందర్భంగా 1,139 మంది పౌరుల అభిప్రాయాలను సేకరించారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో నిర్వహించిన పోల్‌లో ఇమ్మిగ్రేషన్ విధానాన్ని 50 శాతం మంది సమర్ధించగా 41 శాతం మంది వ్యతిరేకించారు. ఇదిలావుండగా తాజా రాయిటర్స్/ఇప్సోస్ పోల్‌లో ట్రంప్ రేటింగ్ కూడా దారుణంగా పడిపోయింది. కేవలం 38 శాతం మంది మాత్రమే ఆయనను సమర్ధించారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్ రేటంగ్ ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. ఈ నెల 12, 13 తేదీలలో నిర్వహించిన పోల్‌లో ఆయనకు 41 శాతం మంది మద్దతు తెలిపారు. ఇమ్మిగ్రేషన్స్-కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారని 58 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రతి పది మంది రిపబ్లికన్లలో ఇద్దరు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు.
నిరసనలపై ఉక్కుపాదం
మిన్నెసోటాలో జరుగుతున్న ప్రజా నిరసనలను ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ట్రంప్‌నకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఆందోళనల్ని భద్రతాబలగాలు గోంతునోక్కే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా ఒక ప్రదర్శనకారుడు నినదించకుండా.. బలవంతంగా అదుపులోకి తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో సర్వత్రా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలపై జనాగ్రహం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



