Thursday, October 9, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిప్రజా రవాణా

ప్రజా రవాణా

- Advertisement -

ప్రజా రవాణా.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉండేది. ఇదే సూత్రంతో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకూ పేద, మధ్య తరగతి ప్రజలు, రైతులు, కార్మికులు, కష్ట జీవులకు ఎంతో ఉపయోగపడుతోంది ఎర్రబస్సు. ఇదే కోవలో ప్యాసింజరు రైళ్లు, ఎమ్‌ఎమ్‌టీఎస్‌లు… జిల్లాలు, రాష్ట్రాల మధ్య వారధిగా నిలిచాయి. ప్రయాణీకులు అతి తక్కువ ఛార్జీతో ఎక్కువ దూరం ప్రయాణించేలా చూడటమే వీటి ముఖ్యోద్దేశం. దాదాపు మూడు, నాలుగు తరాలు ఇలాంటి ప్రజారవాణా వ్యవస్థలు పరిఢవిల్లాయి. కానీ సరళీకృత ఆర్థిక విధానాల ప్రభావంతో ప్రజారవాణా వ్యవస్థ కాస్తా.. ‘లాభాపేక్ష’కు దారిగా మారింది. రద్దీ ఉన్న రూట్లలోనే వీటిని నడుపుతామనే దిశగా ప్రభుత్వాల చర్యలుంటున్నాయి. నిన్నటికి నిన్న పెద్ద పండుగ దసరాకు ఊరెళ్లిన జనానికి ‘ప్రజారవాణా’ చుక్కలు చూపించింది. ప్రయాణీకుల సంఖ్యకు సరిపడా బస్సులు లేకపోవటం ఒక ఎత్తయితే.. ఉన్న బస్సుల్లోనూ ఛార్జీలను డబుల్‌ చేయటం, మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించిన బస్సుల సంఖ్యను తగ్గించటంతో ప్రజలు ‘ఇదేం ప్రయాణంరా బాబూ.. ఇల్లు గుల్ల, ఒళ్లు గుల్ల…’ అనుకున్నారు.

ఇదే సమయంలో ఇటు హైదరాబాద్‌ నగరంలో సైతం సిటీ బస్సు ఛార్జీలను ప్రభుత్వం అమాంతం పెంచేసింది. జంటనగరాల్లో మొదటి మూడు స్టేజీలకు రూ.5, నాలుగో స్టేజీకి రూ.10 చొప్పున పెంచుతూ నిర్ణయించటంతో జనాల జేబులకు చిల్లులు పడుతున్నాయి. కొత్త డిపోలు, కొత్త ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు కోసం ఈ మేరకు ఛార్జీలను పెంచక తప్పటం లేదంటూ ఆర్టీసీ ప్రకటించటం విడ్డూరం. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషించకుండా ఇలా ప్రజలపై అదనపు భారాలేయటం శోచనీయం. మరోవైపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక భాగం పల్లెలు ఎర్రబస్సు సౌకర్యానికి దూరమయ్యాయి. వ్యక్తిగత వాహనాలు, ఆటోలు పెరిగిపోవటంతో బస్సుల్లో ఎవరూ ఎక్కటం లేదనే కారణంగా వాటిని ఆపేశామంటూ అధికారులు సెలవివ్వటం గమనార్హం. వాస్తవానికి ప్రజలందరికీ అవసరమైన సమయాల్లో వాటిని తిప్పితే కచ్చితంగా ప్రజలు బస్సులనే ఆదరిస్తారు. అలాగాకుండా బస్సు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో… గంటల తరబడి రోడ్లపై నిరీక్షించాల్సి రావటంతో విసుగెత్తిన ప్రయాణీకులు.. గత్యంతరం లేక ప్రయివేటు, వ్యక్తిగత వాహనాలను ఆశ్రయిస్తున్న దుస్థితి.

ఆర్టీసీ యాజమాన్యం కొత్తబస్సులను కొనుగోలు చేయకపోవటం, ఒకవేళ కొన్నా ఎలక్ట్రిక్‌ బస్సులకే ప్రాధాన్యమివ్వటం, ఉన్న బస్సులు కాలం చెల్లినవి కావటంతో ప్రజా రవాణా వ్యవస్థ నానాటికీ కుంచించుకుపోతున్నది. దీంతో వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరగటమే కాదు.. ప్రయివేటు ట్రావెల్స్‌ పంట పండుతోంది. ప్రజారవాణా వ్యవస్థ స్థానంలో ఇదే ప్రయివేటుకు లాభసాటి వ్యాపారంగా మారింది. ఇక కరోనాను సాకుగా చూపి.. కేంద్ర ప్రభుత్వం రైళ్లలో ప్రయాణించే పేద ప్రయాణీకుల పట్ల చూపిన వివక్ష, నిర్లక్ష్యం అంతా ఇంతా కాదు. ఉన్న ప్యాసింజర్‌ రైళ్లన్నింటినీ (ఒకటీ అరా మినహా) ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చి.. వాటి ఛార్జీలను పెంచి, ఆగాల్సిన స్టేషన్ల సంఖ్యను సగానికి సగం తగ్గించి, రైలు బండిని పేదోడికి దాదాపు దూరం చేసింది మోడీ సర్కారు. అదేమంటే ‘వందేభారత్‌ రైళ్లను వేస్తున్నాం.. అత్యాధునిక స్టేషన్లను నిర్మిస్తున్నా మంటూ’ గొప్పలు చెబుతున్నారే తప్ప ప్యాసింజర్‌ రైళ్ల గురించి పట్టించుకోవటం లేదు. ఫలితంగా దసరా పండక్కి రైళ్లు లేక, ఉన్నా వాటిలో బెర్తులు లేక, ఛార్జీలు తడిసి మోపెడై సగటు ప్రయాణీకుడు నానా అవస్థలు పడ్డాడు.

హైదరాబాద్‌ మహా నగరంలో చౌకరవాణా సదుపాయమైన ఎమ్‌ఎమ్‌టీఎస్‌లు నామ్‌కే వాస్తేగా మారగా.. మెట్రో రైళ్లు ప్రారంభం నాటి నుంచి నేటివరకూ మూడంటే మూడే బోగీలతో తిరుగుతున్నాయి. దీంతో రద్దీ సమయాల్లో లోకల్‌ ఆటోల్లో కంటే దారుణంగా మెట్రోల్లో ప్రయాణీకులు ఒకరినొకరు తోసుకుంటూ, తొక్కుకుంటూ ప్రయాణించాల్సి వస్తోంది. వర్షాకాలం, విపరీతమైన ట్రాఫిక్‌ జామ్‌ల నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో మెట్రోల్లో అవస్థలు పడుతూ జనాలు ప్రయాణం సాగిస్తున్నారు. వెరసి.. రాష్ట్రంలో అటు పల్లెలు, ఇటు పట్టణాల్లో ప్రయాణమంటేనే ప్రజలు బెదిరిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా పౌర సమాజం మేల్కొనాలి. వాయుకాలుష్యం, విపరీతమైన ట్రాఫిక్‌జామ్‌లు, ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న ఛార్జీలను అరికట్టాలంటే ప్రజారవాణా వ్యవస్థే ఏకైక ప్రత్యామ్నాయ మార్గమనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. అందుకవసరమైన ప్రజాఉద్యమాలు రావాలి. ‘ప్రజా రవాణా వ్యవస్థ- సామాన్యుడి హక్కు’ అనే చైతన్యంతో పోరాటాలకు ప్రజలు కదలాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -