Thursday, December 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజా సంక్షేమమే లక్ష్యం

ప్రజా సంక్షేమమే లక్ష్యం

- Advertisement -

అధికారుల నిర్లక్ష్యాన్ని సహించం..
విద్యారంగంపై పెద్దఎత్తున పెట్టుబడి
ఎప్పటికప్పుడు బిల్లులు క్లియర్‌ చేస్తున్నాం : సమీక్షలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ-ఖమ్మం కలెక్టరేట్‌

రాష్ట్ర ప్రజల ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వా ధికారులు, ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, మూడో సంవత్సరంలోకి అడుగు పెట్టామని, అలాఅని చెప్పి అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహిం చబోమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రతి లబ్దిదారునికి చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అధికారులు, ఉద్యోగులు విధులకు హాజరు విషయంలో సీరియస్‌గా ఉండాలని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నత స్థానంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అసెంబ్లీ సమయంలో ముందుగా వెళ్లి ఫేస్‌ రికగ్నైజేషన్‌, థంబ్‌ ఇంప్రెషన్‌ ఇస్తున్నామని అన్నారు. ప్రజలు చెల్లించిన పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని జీతాలుగా పంచుతున్నామని, కాబట్టి ప్రజలకు అందరం జవాబుదారీగా ఉండాలని సూచించారు. గిరిజనులకు సమగ్ర వ్యవసాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఇందిరా సౌర గిరి జలవికాసం పథకాన్ని తీసుకువచ్చామని తెలిపారు. అటవీ భూ హక్కుల చట్టం కింద భూములు పొందిన రైతులకు ఉచితంగా సోలార్‌ విద్యుత్తు, పంపుసెట్లు, డ్రిప్పు, ప్లాంటేషన్‌ సౌకర్యాలు కల్పిస్తామని, అధికారులు ప్రతిపాదనలను వేగంగా పంపాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థల భవనాలపై సోలార్‌ పవర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని, గ్రీన్‌ ఎనర్జీని పెద్ద ఎత్తున వినియోగంలోకి తెచ్చుకోవాలని కోరారు.మన బిడ్డలే రాష్ట్ర భవిష్యత్తు అని, వారు ప్రపంచంతో పోటీ పడాలన్న ఆలోచనతో మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా రాష్ట్రం ఎదిగేందుకు 2047 విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించామని భట్టి విక్రమార్క అన్నారు. విలువైన మానవ సంపదను సృష్టించేందుకు విద్యారంగంపై ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుందని చెప్పారు. డైట్‌, కాస్మోటిక్‌ ఛార్జీలు పెంచామని, అలాగే విద్యార్ధులకు న్యూట్రిషన్‌ ఫుడ్‌ అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ మొదలు అధికారులు అందరూ విద్యాసంస్థలను పర్యవేక్షించి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు.
ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల్లో ఏదైనా సంఘటన జరిగితే అందుకు ఇన్‌చార్జి అధికారిని బాధ్యునిగా చేస్తామని స్పష్టం చేశారు. గోదాముల్లో వస్తువులను కుక్కినట్టుగా ప్రయివేట్‌ విద్యాసంస్థల్లో విద్యార్థులను నమోదు చేసుకుంటున్నారని, ఇకనుంచి ప్రయివేటు విద్యాసంస్థలకు ఉండాల్సిన అర్హతలు, సౌకర్యాలపై ఒక చెక్‌ లిస్ట్‌ పెట్టుకొని అవన్నీ ఉంటేనే అనుమతులు ఇవ్వాలని సూచించారు. సంక్షేమ రంగంపై ప్రభుత్వం స్పష్టంగా ఉందని, సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఎప్పటికప్పుడు క్లియర్‌ చేస్తున్నామని తెలిపారు. ప్రతి మూడు నెలలకు బిల్లులు సిద్ధం చేసుకుని రాకపోతే సంబంధిత కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే చెప్పినట్టు చెప్పారు. విద్యాసంస్థల అద్దెలు, మెస్‌, కాస్మోటిక్స్‌ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -