Monday, May 5, 2025
Homeఆటలుపంజాబ్‌ ఫటాఫట్‌

పంజాబ్‌ ఫటాఫట్‌

- Advertisement -

– లక్నోపై 37 పరుగులతో ఘన విజయం
– రాణించిన ప్రభుసిమ్రన్‌, అర్షదీప్‌ సింగ్‌
– పంజాబ్‌ 236/5, లక్నో 199/7

నవతెలంగాణ-ధర్మశాల

లక్నో సూపర్‌జెయింట్స్‌పై పంజాబ్‌ కింగ్స్‌ ఫటాఫట్‌ విజయం సాధించింది. బ్యాట్‌తో, బంతితో సూపర్‌జెయింట్స్‌పై స్పష్టమైన పైచేయి సాధించిన శ్రేయస్‌ అయ్యర్‌ సేన 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్‌ కింగ్స్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 237 పరుగుల ఛేదనలో లక్నో సూపర్‌జెయింట్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులే చేసింది. టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు ఎడెన్‌ మార్‌క్రామ్‌ (13), మిచెల్‌ మార్ష్‌ (0), నికోలస్‌ పూరన్‌ (6)లను పవర్‌ప్లేలోనే సాగనంపిన పంజాబ్‌ పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌ మ్యాచ్‌ను సూపర్‌జెయింట్స్‌ నుంచి లాగేసుకున్నాడు. కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ (18, 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), డెవిడ్‌ మిల్లర్‌ (11, 8 బంతుల్లో 1 సిక్స్‌) నిరాశపరచగా.. ఆయుశ్‌ బదాని (74, 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), అబ్దుల్‌ సమద్‌ (45, 24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) తమ వంతు ప్రయత్నంతో పోరాడారు. విజయానికి చేరువ కాలేకపోయినా.. నెట్‌ రన్‌రేట్‌ను కాపాడారు!. అర్షదీప్‌ సింగ్‌ (3/16) మూడు వికెట్ల ప్రదర్శనతో నిప్పులు చెరుగగా.. అజ్మతుల్లా ఓమర్‌జారు (2/33), మార్కో జాన్సెన్‌ (1/31) రాణించారు.
ప్రభుసిమ్రన్‌ జోరు
ఓపెనర్‌ ప్రభుసిమ్రన్‌ సింగ్‌ (91, 48 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ప్రియాన్షు ఆర్య (1) విఫలమైనా.. జోశ్‌ ఇంగ్లిశ్‌ (30), శ్రేయస్‌ అయ్యర్‌ (45, 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) తోడుగా ప్రభుసిమ్రన్‌ సింగ్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 30 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన ప్రభుసిమ్రన్‌.. సెంచరీకి 9 పరుగుల దూరంలో వికెట్‌ కోల్పోయాడు. శశాంక్‌ సింగ్‌ (33 నాటౌట్‌, 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), మార్కస్‌ స్టోయినిస్‌ (15 నాటౌట్‌, 5 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) పంజాబ్‌కు అదిరే ముగింపు అందించారు. 20 ఓవర్లలో 5 వికెట్లకు పంజాబ్‌ 236 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో ఆకాశ్‌ సింగ్‌ (2/30), దిగ్వేశ్‌ (2/46) వికెట్లు పడగొట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -