– ప్లే ఆఫ్స్ ముంగిట శ్రేయస్ సేన
– రాజస్తాన్‌పై 10 పరుగులతో గెలుపు
పంజాబ్ బల్లే బల్లే. 2014 తర్వాత ఐపీఎల్‌లో తొలిసారి ప్లే ఆఫ్స్‌లో ఆ జట్టు బెర్త్ లాంఛనం చేసుకుంది. జైపూర్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై 10 పరుగులతో గెలుపొందిన పంజాబ్ కింగ్స్.. గ్రూప్ దశలో 12 మ్యాచుల్లో 17 పాయింట్లు సాధించింది. ఆదివారం ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో నేహల్ వదేరా (70), శశాంక్ సింగ్ (59 నాటౌట్) అర్థ సెంచరీలతో పంజాబ్ కింగ్స్ తొలుత 219/5 పరుగులు చేయగా..హర్‌ప్రీత్ బరార్ (3/22) మూడు వికెట్ల మెరుపులతో ఛేదనలో రాజస్తాన్ రాయల్స్ 209/7 పరుగులే చేసింది.
నవతెలంగాణ-జైపూర్
పంజాబ్ కింగ్స్ జోరు కొనసాగించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ధర్మశాల మ్యాచ్ అర్థాంతరంగా నిలిచిపోగా ఆందోళనకు గురైన పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు.. ఐపీఎల్ పున ప్రారంభంలో అదరగొట్టారు. ఆదివారం జైపూర్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై 10 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ మెరుపు విజయం సాధించింది. ఈ గెలుపుతో 17 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌లో శ్రేయస్ సేన బెర్త్ లాంఛనం చేసుకుంది. 2014 తర్వాత పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించటం ఇదే తొలిసారి కానుంది. పంజాబ్ కింగ్స్ పేసర్ హర్‌ప్రీత్ బరార్ (3/22) విజృంభణకు మార్కో జాన్సెన్ (2/41), అజ్మతుల్లా ఓవర్‌జారు (2/44) జత కలవటంతో ఛేదనలో రాజస్తాన్ రాయల్స్‌కు ఓటమి తప్పలేదు. ధ్రువ్ జురెల్ (53, 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (50, 25 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలతో మెరువగా.. వైభవ్ సూర్యవంశీ (40, 15 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) దంచికొట్టాడు. సంజు శాంసన్ (20), రియాన్ పరాగ్ (13), షిమ్రోన్ హెట్‌మయర్ (11) వైఫల్యంతో రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 209 పరుగులే చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 219 పరుగులు చేసింది. నేహల్ వదేరా (70, 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), శశాంక్ సింగ్ (59 నాటౌట్, 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో చెలరేగారు.
రాయల్స్ అదే తడబాటు
ఐపీఎల్18లో రాజస్తాన్ రాయల్స్ నిలకడగా రాణించినా ఆ జట్టును విజయాలు వరించలేదు. పంజాబ్ కింగ్స్‌తో ఛేదనను సైతం రాయల్స్ దూకుడుగా మొదలెట్టింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (50), వైభవ్ సూర్యవంశీ (40) తొలి వికెట్‌కు అదిరే ఆరంభం అందించారు. ఓపెనర్ల మెరుపులతో పవర్‌ప్లేలో రాయల్స్ 89/1 పరుగులు చేసింది. ఛేదనకు గట్టి పునాది పడినా.. గత మ్యాచుల తరహాలోనే మిడిల్, డెత్ ఓవర్లలో రాయల్స్ బోల్తా పడింది. యశస్వి జైస్వాల్ 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. సూర్యవంశీ సైతం ధనాధన్ జోరు చూపించాడు. 7.3 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్ దాటిన రాయల్స్ ఆ తర్వాత ట్రాక్ తప్పింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బంతి అందుకున్న హర్‌ప్రీత్ బరార్ (3/22) ఓపెనర్లు సహా రియాన్ పరాగ్ (13)ను సాగనంపి రాయల్స్‌ను దెబ్బకొట్టాడు. సంజు శాంసన్ (20) ఆశించిన ప్రదర్శన చేయలేదు. ధ్రువ్ జురెల్ (53) అర్థ సెంచరీతో రాణించినా.. రన్‌రేట్‌కు తగినట్టు దూకుడుగా ఆడలేదు. షిమ్రోన్ హెట్‌మయర్ (11), శుభమ్ దూబె (7 నాటౌట్), వానిందు హసరంగ (0) విఫలం అయ్యారు. 20 ఓవర్లలో 7 వికెట్లకు 209 పరుగులే చేసిన రాయల్స్ 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో మార్కో జాన్సెన్ (2/41), అజ్మతుల్లా ఓవర్‌జారు (2/44) రాణించారు.
మెరిసిన నేహల్, శశాంక్
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ కీలక బ్యాటర్లు విఫలమైనా భారీ స్కోరు చేసింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు ప్రియాన్షు ఆర్య (9), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (21) సహా మిచెల్ ఓవెన్ (0)లు 3.1 ఓవర్లలోనే డగౌట్‌కు చేరుకున్నారు. బంతితోనూ ఆరంభంలోనే బ్రేక్ సాధించిన రాయల్స్ ఆ తర్వాత పట్టు కోల్పోయింది. నేహల్ వదేరా (70), శ్రేయస్ అయ్యర్ (30) నాల్గో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నమోదు చేసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయ్యర్ అవుటైనా.. శశాంక్ సింగ్ (59 నాటౌట్)తో కలిసి నేహల్ జోరు కొనసాగించాడు. వరుసగా 67, 58 పరుగుల భాగస్వామ్యాలతో పంజాబ్ భారీ స్కోరుకు బాటలు వేసుకుంది. ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 25 బంతుల్లో అర్థ సెంచరీ బాదిన నేహల్.. రాయల్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 27 బంతుల్లో శశాంక్ ఫిఫ్టీ సాధించాడు. నేహల్ నిష్క్రమించినా..చివరి నాలుగు ఓవర్లలో అజ్మతుల్లా ఓవర్‌జారు (21 నాటౌట్, 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి శశాంక్ 60 పరుగులు పిండుకున్నాడు. దీంతో పంజాబ్ 219 పరుగుల భారీ స్కోరు చేసింది. రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే (2/37) రెండు వికెట్లతో రాణించాడు.
సంక్షిప్త స్కోరు వివరాలు :
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ : 219/5 (నెహల్ వదేరా 70, శశాంక్ సింగ్ 59 నాటౌట్, అజ్మతుల్లా 21 నాటౌట్, తుషార్ 2/37)
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : 209/7 (ధ్రువ్ జురెల్ 53, యశస్వి జైస్వాల్ 50, వైభవ్ సూర్యవంశీ 40, హర్‌ప్రీత్ బరార్ 3/22)