Tuesday, October 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపూరణ్‌ కుమార్‌ ఆత్మహత్య దారుణం

పూరణ్‌ కుమార్‌ ఆత్మహత్య దారుణం

- Advertisement -

నిందితులపై చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరం
ఈ ఘటన మానవ హక్కుల ఉల్లంఘన
చండీగఢ్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణకు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, అడిషనల్‌ డీజీ వై.పూరన్‌ కుమార్‌ మరణం తీవ్రంగా కలిచివేసిందనీ, దురదృష్టకర ఘటన అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. సోమవారం హర్యానా రాజధాని చండీగడ్‌లో పూరన్‌కుమార్‌ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. కుమార్‌ భార్య, ఐఏఎస్‌ అమ్నీత్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. పూరన్‌ కుమార్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు భరోసా ఇచ్చారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్థానిక మీడియాతో మాట్లాడారు. రా విభాగంలో ఆయన కీలక సేవలందించారనీ, రాష్ట్రపతి మెడళ్ళను కూడా అందుకున్న ప్రతిభావంతులు అని కొనియాడారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. డీజీపీ కపూర్‌, ఎస్పీ నరేంద్ర అనే అధికారులు అడుగడుగునా అవమానించి, వేధించడం వల్లనే తాను సూసైడ్‌ చేసుకుంటున్నానని స్పష్టంగా పేర్కొన్నా చట్ట ప్రకారం హర్యానా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. మృతదేహానికి శవపరీక్ష నిర్వహించకపోవడం, వృద్ధురాలైన ఆయన తల్లికి, భార్యకు, కూతుళ్లకు కనీసం శవాన్ని చూడటానికి కూడా అనుమతించకపోవడం అత్యంత అమానుషం, దారుణమని విమర్శించారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందన్నారు. కులవివక్ష చూపుతారనే ఆరోపణలున్నా డీజీపీగా కపూర్‌ను కొనసాగించడం సిగ్గుచేటన్నారు. ఒక ఐపీఎస్‌ అధికారికే రక్షణ లేకపోతే ఇక సాధారణ ప్రజల గతి ఏమిటో ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. హర్యానా, చండీగఢ్‌ రెండూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి కాబట్టి ప్రధాని, హౌం మంత్రి తమ రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించాలని డిమాండ్‌ చేశారు. ఆయన మరణం కుటుంబానికీ, వ్యవస్థకు తీరని నష్టమన్నారు. పూరన్‌ కుమార్‌ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్న డీజీపీ కపూర్‌, ఎస్పీ నరేంద్రలను వెంటనే అరెస్ట్‌ చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఆయన భార్య, తల్లి, ఇద్దరు కూతుళ్లకు, పూర్తి రక్షణ, న్యాయం కల్పించాలని కోరారు. డిప్యూటీ సీఎం వెంట ఏఐసీసీ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు కొప్పుల రాజు, చండీగఢ్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ హెచ్‌ఎస్‌ లక్కీ, సంవిధాన్‌ కమిటీ చైర్మెన్‌ డాక్టర్‌ వినరు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -