ఏకపక్ష అరెస్టులు తగవు
ఇరాన్‌పై ఐరాస మానవ హక్కుల మండలి తీర్మానం.. వ్యతిరేకంగా ఓటేసిన భారత్
న్యూయార్క్ : ఇరాన్‌లో ఇటీవల జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలను అక్కడి ప్రభుత్వం అణచివేయడాన్ని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ఖండించింది. చట్టవిరుద్ధ హత్యాకాండకు స్వస్తి చెప్పాలని, బలవంతపు అపహరణలు, ఏకపక్ష అరెస్టులను ఆపేయాలని సూచించింది. ఇరాన్ చర్యలను నిరసిస్తూ ఐరాస మానవ హక్కుల మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా 25 మంది సభ్యులు ఓటేయగా 14 మంది గైర్హాజరు అయ్యారు. భారత్, చైనా సహా ఏడు దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. ఇరాన్ ప్రభుత్వం చేపట్టిన క్రూరమైన అణచివేత చర్యలను 47 మంది సభ్యులున్న మండలి తన తీర్మానంలో అభిశంసించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా గత డిసెంబర్ 28న ఇరాన్‌లో ప్రారంభమైన ఆందోళన ఆ తర్వాత వందకు పైగా పట్టణాలకు వ్యాపించింది. మత నేతల పాలనను అంతమొందించాలంటూ నిరసనకారులు డిమాండ్ చేశారు.
ఉవ్వెత్తున సాగిన ఆందోళనలో వేలాది మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం అనేక మందిని నిర్బంధించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సమావేశమైన ఐరాస మానవ హక్కుల మండలి ఇరాన్ చర్యను ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని హింసాత్మకంగా అణచివేశారని, ఫలితంగా వేలాది మంది చనిపోయారని తెలిపింది. మానవ హక్కుల బాధ్యతలను గౌరవించాలని, వాటిని పరిరక్షించాలని, నెరవేర్చాలని ఇరాన్ ప్రభుత్వాన్ని కోరింది. ఇరాన్ ప్రభుత్వం చేపట్టిన అణచివేత చర్యల కారణంగా కనీసం ఐదు వేల మంది చనిపోయారని హక్కుల కార్యకర్తలను ఉటంకిస్తూ ఏపీ వార్తా సంస్థ తెలియజేసింది. ఇరాన్ అధికారులు 26,800 మందిని నిర్బంధించారని చెప్పింది. అయితే ఆందోళనలో 3,100 మంది చనిపోయారని ఇరాన్ ప్రభుత్వం వివరించింది. వీరిలో 2,400 మంది పౌరులు, భద్రతా సిబ్బంది ఉన్నారని, మిగిలిన వారు ఉగ్రవాదులని తెలిపింది.



