‘కొంతమంది యువకులు రాబోవు యుగం దూతలు.. పావన నవజీవన బృందావన నిర్మాతలు… బానిస పంధాలను తలవంచి అనుకరించరు.. పోనీ, అని అన్యాయపు పోకడలు సహించరు’ అన్న శ్రీశ్రీ మాటలను నేటి యువతీ యువకులు కొందరు నిజం చేస్తున్నారు. స్మార్టుఫోను, కంప్యూటర్లతో సావాసం మాత్రమే కాదు.. సాహిత్య లోగిళ్లలోనూ సేదతీరుతున్న యువత సంఖ్య తక్కువేమీ కాదు. నేటి తరం సాహిత్యాన్ని పట్టించుకోవటం లేదనే వాదనను పటాపంచలు చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ తదితర రంగాల్లోని యువతలో చాలా మంది పుస్తకాలతో దోస్తానా చేస్తున్నారు. ఫిక్షన్, ఫాంటసీ, యాక్షన్ నవలలపట్ల అమితాసక్తి చూపుతున్న వారే అధికం. డిజిటల్, ఈ-పుస్తకాల కన్నా కాగితం పుస్తకాన్ని చేతబట్టి చదవడమే తమకు ఇష్టం అనే యువతరం ముందుకు వస్తోంది. వారికి పుస్తకాలను మరింత చేరువ చేయాలనే ఆలోచన చేశాడు కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి సభావట్ హాథిరామ్. ఆ ఆలోచనకు ఆచరణే Look A Book పుస్తకాల దండెం.
విశ్వ రహస్యాలను తెలుసుకోవడానికి, అంతరిక్ష గుట్టును విప్పడానికి, ప్రముఖుల జీవిత విశేషాలను అర్థం చేసుకోవడానికి, మనం చూడని ప్రదేశాలను అక్షరయాత్రలో వీక్షించడానికి, మానవ నాగరికత పరిణామాన్ని తెలుసుకోవడానికి, జీవన పోరాటంలో ఎదురు దెబ్బలను తట్టుకొని నడవడానికి పుస్తక పఠనం ఎంతో సహకరిస్తుంది. లక్ష్యాలను సునాయాసంగా ఛేదించడానికి, మానవ జీవితాల్లో సంక్లిష్టతలను జీర్ణించుకోవడానికి, జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకోవడానికి, వివేకం, విజ్ఞానం, ఆలోచనాశక్తిని విస్తృత పరుచుకోవడానికి అందుబాటులో ఉన్న ఏకైక ఉత్తమ సాధనం బుక్ రీడింగ్. పుస్తక పఠన నైపుణ్యంతో విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం, మానసిక వికాస దిశగా, విజ్ఞాన వెలుగుల దిశగా పయనించడమే పుస్తక పఠన కళ లేదా ఆర్ట్ ఆఫ్ రీడింగ్.
21 వ శతాబ్దంలో వద్ధి చెందుతున్న టెక్నాలజీలో భాగంగా, మొబైల్ వినియోగం భారీగా పెరుగుతూ వచ్చింది. దాని వల్ల పుస్తక పఠనానికి దూరం అయ్యే ప్రమాదం లేకపోకలేదు. దీని ముఖ్య ఉద్దేశం సోషల్ మీడియా మత్తులో మునిగితేలుతున్న సమాజానికి పుస్తకాన్ని పరిచయం చేయడమే. మొదట పోటీ ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థులకు సాహిత్యాన్ని అందించడం అంత్యంత అవసరం అని ఈ కార్యక్రమాన్ని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 20న ప్రారంభించారు సభావట్ హాథిరామ్ అని మిత్ర బృందం ఉదయ్, అమర్నాథ్, అమత రాజు,శివ నాస్తిక్, వంశి, జాహ్నవి, శశిధర్, బాలు.
”తనలోని పరాయితనాన్ని పోగొట్టి మనిషి అంతరంగాన్ని ఆవిష్కరించేదే పుస్తకం”. 21వ శతాబ్దం, మనిషిని తనకు తానే కాకుండా చేసింది.తనలో ఎమోషన్స్ లేకుండా యాంత్రికంగా మర వస్తువులా మార్చింది.దీనికి తోడు విలువలు మరిచి నిత్యం అబద్దాలు ప్రచారం చేసే మీడియా ఛానళ్ళు, చరిత్రను వక్రీకరించే సినిమాలు, మన మెదడును కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో నిజాన్ని తెలుసుకోవడమెలా? నిజాన్ని నిలబెట్టడమెలా?
దీనికి సమాధానమే పుస్తకం.నిజాన్ని చెప్పే పరికరం.భూమి నుండి భూపొరలను ఒక్కొక్కటిగా ఒలిచింది. నింగి దాటి సమస్త విశ్వాన్ని నిల్వ చేసింది.సజీవుల, నిర్జీవుల పుట్టుక నుండి చావుదాకాబీ మనుషుల భావోద్వేగాలను, భావనలను, సిద్ధాంతాలను ప్రవర్తనలను, వారి సంస్కతులను, ఎదుగుదలను,శతత్వాలను, యుద్ధాలను, తిరుగుబాట్లు, ఉద్యమాలు, మహనీయులను చరిత్రగా రాసింది. వర్తమానాన్ని పదిలపరుస్తున్నది. ముందుచూపు అందిస్తున్నది. మనిషిని బానిసత్వం నుండి విముక్తి పథంలోకి నడిపించింది. ఇంతటి జ్ఞానమందించే పుస్తకంలోకి మనం తొంగి చూస్తున్నామా? లేదంటే నీలోకి నీవే చూసుకుంటలేవన్నట్టే. నీతో నీవే మాట్లాడుకుంటలేవన్నట్టే. చివరికి నీకు నీవు సమాధి అవుతున్నట్టే.
ఇది గమనించిన మిత్రబృందం యువత పుస్తకాలను యూనివర్శిటీ చెట్ల కింద పరిచి పుస్తకంలోకి చూడమని పిలుస్తున్నది. పుస్తక దినోత్సవం సందర్భంగా( ఏప్రిల్ 23న) కాకతీయ యూనివర్సిటీలో Look A Book Reader Club` కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ‘చదవాలని ఆసక్తిని కూడగట్టుకొని పాఠకులరా రండి. రచయితలారా, సమాజాన్ని చదివిపించాలనే తపన కల్గిన పుస్తక ప్రియులారా మీ అల్మారలో దాచిన పుస్తకాలను కూడా పట్టుకొని రండి. కొద్దిసేపు పక్షులమై ముచ్చటిద్దం. అంటూ ప్రతీ ఆదివారం కొనసాగుతూనే ఉంటుందని పిలుపునిస్తున్నది.
”చదవడమనే అలవాటు మెదడుకు చైతన్యం కలిగించడమే కాకుండా సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి పునాదిగా కూడా పని చేస్తుంది. ప్రతి ఒక్కరు పుస్తకాలు చదవడం అలవాటుగా చేసుకుందాం. పుస్తకాలు అపార జ్ఞాన నిధులు, సంతోషానికి పునాదులు. ‘విద్య లేని వాడు వింత మనిషి అయితే విద్యావంతుడు అనంత శక్తిమంతుడు’ అని నమ్మాలి. హొనేటి విద్యావంతులందరూ ప్రాంతీయ భాష, జాతీయ భాష, అంతర్జాతీయ భాషా పుస్తకాలను చదువుతూ విద్యావేత్తలుగానే కాకుండా సంస్కారవంతులుగా దేశాభివద్ధిలో భాగస్వాములు కావాలి అన్న సత్ సంకల్పం Look A Book Reader Club ది.
మంచి పుస్తకాన్ని చదివినపుడు పొందే కిక్కే వేరు. దానిని వర్ణించడం కష్ట్రం. నేటి ఆధునిక, వేగవంతమైన జీవితంలో అనంత సమాచారం మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. చదవడానికి తీరికలేకుండా ఆధునిక మనిషి జీవితం కొనసాగుతోంది. అశాంతిమయ క్షణాల్లో, నిరాశా నిస్పహలలో, ఒంటరి తనంలో పుస్తకమే నిజమైన నేస్తం. ప్రాణ స్నేహితులు కూడా ఒకొక్కసారి విభేదాలు వచ్చి మనతో విడిపోవచ్చు. కాని, పుస్తకాలు అనే స్నేహితులు మన సుఖ దుఃఖాలలో మనకు తోడు. ఎంతో వెన్నుదన్ను. ముఖ్యంగా మన బాధలో, మనని ఎప్పుడూ విడిచి పెట్టవు. మౌన మిత్రులు. మనలోని లోపాలను దిద్ది మంచి దారిలో పెడతాయి. మనలో మంచి ప్రవర్తనను ప్రోది చేసే అద్భుత సాధనాలు. శాశ్వతమైన స్నేహితులు. అలాంటి పుస్తకాలను యువతకు చేరువ చేయడమే Look A Book Reader Club
అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417




