Saturday, May 17, 2025
Homeమానవిసరైన దారిలో పెట్టాలంటే

సరైన దారిలో పెట్టాలంటే

- Advertisement -

తల్లిదండ్రులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సార్లు పిల్లలు తప్పుదారి పట్టే అవకాశాలు లేకపోలేవు. అలా జరగకుండా ఉండాలంటే కొన్ని సూత్రాలు పాటించడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. వాటి ద్వారా పిల్లలను సరైన దారిలో నడిపించడంతో పాటు వారిని బాధ్యతాయుతంగా కూడా తీర్చిదిద్దొచ్చు. దీన్నే క్రియేటివ్‌ పేరెంటింగ్‌ అంటారు. మరి ఆ సూత్రాలేంటే ఈ రోజు తెలుసుకుందాం…
సాధారణంగా ఎవరైనా సరే మంచి కంటే చెడు వైపు చాలా తొందరగా ఆకర్షితులవుతుంటారు. ఈ లక్షణం పిల్లల్లో మరింత ఎక్కువ. పైగా వారికి ఇది మంచి, ఇది చెడు అని ఆలోచించే పరిణతి కూడా ఉండదు. కాబట్టి చెడు విసిరే వలలో సులువుగా చిక్కుకుపోతుంటారు. అందుకే చిన్నారులను ఎప్పటికప్పుడు సునిశితంగా గమనించడం ద్వారా వారి ప్రవర్తన ఎలా ఉందో ఓ అంచనాకు రావొచ్చు. వారు ఏమైనా తప్పులు చేస్తున్నపుడు వాటి గురించి వివరించడంతో పాటు మళ్లీ మళ్లీ వాటిని పునరావృతం చేస్తే వారు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో అర్థమయ్యేలా చెప్పాలి.
ఆదేశించవద్దు
కొందరు తల్లిదండ్రులు పిల్లలపై ‘అది చేయకు.. ఇలా ఉండద్దు..’ అంటూ ఎన్నో రకాల ఆంక్షలు విధిస్తుంటారు. పైగా తాము సాధించాలనుకున్న లక్ష్యాలు, ఆశయాలను బలవంతంగానైనా తమ చిన్నారుల ద్వారా సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. పైగా భవిష్యత్తులో సాధించాల్సిన లక్ష్యాలను సైతం ఇప్పుడే నిర్ణయించేసి దాన్ని సాధించి తీరాలని ఆదేశిస్తుంటారు. ఇలాంటి వాతావరణంలో పెరిగే చిన్నారులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు. ఫలితంగా వారు చేయాలనుకున్న వాటిని చేయలేకపోతుంటారు. అంతేకాదు ఒత్తిడి కారణంగా పిల్లల్లోని సృజనాత్మకత సైతం తగ్గిపోతుంటుంది. అందుకే వారు ఎందులో ఆసక్తి కనబరుస్తున్నారో గమనించి అందులో నైపుణ్యం సాధించేలా వారిని ప్రోత్సహించాలి. అప్పుడే వారు ఒత్తిడిని జయించి తమ జీవితానికి చక్కని బాట వేసుకోగలుగుతారు.
స్నేహహస్తాన్ని అందిస్తూ…
పిల్లల నుంచి పెద్దల వరకు స్నేహపూర్వకమైన వాతావరణంలోనే గడపడానికి ఇష్టపడతుంటాం. అయితే అలాంటి వాతావరణం చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండదు. పైగా కొందరు చిన్నారులు తాము ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నామని చెప్పినప్పుడు తల్లిదండ్రులు కసురుతుంటారు. ఫలితంగా చిన్నారులు తమ మనసులోని భావాలను తల్లిదండ్రులతో పంచుకోవడానికి ఇష్టపడరు. ఇలాంటి వాతావరణం కుటుంబ సభ్యుల మధ్య ఉండటం అంత మంచిది కాదు. అందుకే ఇంట్లో ఎప్పుడూ స్నేహపూర్వకమైన, సరదాలతో కూడిన వాతావరణం ఉండేలా తల్లిదండ్రులు చొరవ చూపాలి. అలాగని పూర్తిగా వారికి స్వేచ్ఛనివ్వమని కాదు. వారికి స్నేహహస్తాన్ని అందిస్తూ తప్పు చేస్తున్నప్పుడల్లా హెచ్చరిస్తుండాలి. అప్పుడు చిన్నారులు అన్ని విషయాలు మనతో పంచుకుంటారు. దీనివల్ల వారి వ్యక్తిత్వం, ఆలోచనలు అన్నింటిపై మనకు కూడా పూర్తి అవగాహన ఏర్పడుతుంది. తదనుగుణంగా వారి జీవితాన్ని మలచే అవకాశం ఉంటుంది.
అంతరాలు పెంచొద్దు
చాలా కుటుంబాల్లో కనిపించే సమస్య సమానంగా చూడకపోవడం. ముఖ్యంగా ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. ఒకరు బాగా చదువుతున్నారనో, చెప్పిన మాట వింటున్నారనో తల్లిదండ్రులు ఒకరినే ముద్దు చేస్తుంటారు. తనని చూసి నేర్చుకొమ్మని మరొకరికి చెబుతుంటారు. అంతేకాదు.. వారు చేసిన తప్పులని పెద్దగా పట్టించుకోరు. అదే సమయంలో మరో చిన్నారి చిన్న పొరపాటు చేసినా వారిపై విరుచుకు పడిపోతుంటారు. ఇలా చేయడం వల్ల మీ అంతట మీరే తోబుట్టువుల మధ్య అంతరం పెంచినవారవుతారు. పైగా తల్లిదండ్రులపై కూడా చిన్నారుల మనసుల్లో ప్రతికూల భావాలు కలిగే అవకాశం లేకపోలేదు. కనుక ఇద్దరిలోనూ సానుకూల అంశాలను గమనించి వాటిలో మెరుగయ్యేలా ప్రోత్సహించాలి. ప్రతికూల భావాలను తొలగించే ప్రయత్నం చేయాలి.
ముందు మీరు తగ్గించండీ…
ఈ రోజుల్లో చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఫోన్లను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. అయితే చాలా మంది తల్లిదండ్రులు ‘మా పిల్లలు నిత్యం మొబైల్‌ వాడుతున్నారు. దాని వల్ల సరిగా తినడం లేదు, చదువుకోవడం లేదు’ అని తెగ కంప్లెయిట్లు ఇస్తుంటారు. అయితే ‘యథా రాజా తథా ప్రజా’ అన్నట్టు మీరు అదే పనిగా మొబైల్‌ ఉపయోగిస్తే మీ పిల్లలు కూడా అలాగే చేస్తారు. కాబట్టి పిల్లల ముందు సెల్‌ఫోన్‌ని ఎక్కువగా ఉపయోగించకపోవడమే మంచిది. తల్లిదండ్రులు మొబైల్‌ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల పిల్లలపై పెట్టే శ్రద్ధ కూడా తగ్గిపోతుందని పలు సర్వేలు చెబుతున్నాయి. కనుక పిల్లల సమక్షంలో సాధ్యమైంతన వరకు మొబైల్‌ని పక్కన పెట్టండి. ఇలా మీరు పాటిస్తూనే వాళ్లు కూడా పాటించేలా చేయండి.
మీరూ పాటిస్తేనే…
చిన్న వయసులోనే చాలా మంది పిల్లలు ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణాలు జంక్‌ ఫుడ్‌ తినడం, వ్యాయామం చేయకపోవడం. పిల్లలకు ఆకలైందంటే కొంత మంది తల్లులు రెండు నిమిషాల్లో అయిపోతుందిగా అని నూడిల్స్‌ చేసి పెడుతుంటారు. మరికొంతమంది పిల్లలు వ్యాయామం చేయడానికి బద్ధకిస్తుంటారు. అయితే పిల్లలను వ్యాయామం చేయమని చెప్పి మీరు లేటుగా నిద్ర లేస్తే ఎలాంటి లాభం ఉండదు. కనుక ఆహారం, వ్యాయామం విషయాల్లో పిల్లలకు చెప్పే అలవాట్లు ముందు మీరు ఆచరించి చూపించండి. ఇలా చేయడం వల్ల మిమ్మల్ని చూసి వాళ్లే నెమ్మదిగా అలవాటుపడతారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -