Friday, December 5, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిముప్పుతిప్పలు పెడుతున్న పుతిన్‌!

ముప్పుతిప్పలు పెడుతున్న పుతిన్‌!

- Advertisement -

ప్రేమంటుందీ, పెళ్లంటుందీ అది నాతోనా కాదా అన్నది స్పష్టం చేయటం లేదంటూ ఒక సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఉక్రెయిన్‌ శాంతిచర్చలలో పుతిన్‌ వైఖరి గురించి చెప్పాడు. పోరును ముగించేందుకు శాంతి కావాలని పుతిన్‌ కోరుకుంటున్నాడు గానీ దానికి దారే తెలియటం లేదని ట్రంప్‌ అన్నాడు. ఏం చెప్పాలో తోచక ఏదో ఒకటి చెప్పటం తప్ప పుతిన్‌ ఏం కోరుతున్నాడో, ఇతర నాటో దేశాలు ఏం చేస్తున్నాయో అతగాడికి తెలియదా! ఉక్రెయిన్‌ సంక్షోభంలో నిమగమైన ఇతరులను పుతిన్‌ మూడు చెరువుల నీరు తాగిస్తున్నాడంటే అతిశయోక్తి కాదు. ఎంత పెద్ద ఏనుగైనా ఇరకాటంలో పడినపుడు ఘీంకరించటం తప్ప చేయగలిగిందేమీ లేదు.చర్చల పేరుతో ప్రపంచ సమయాన్ని వృధా చేస్తున్నా డని పశ్చిమదేశాలు ఆరోపించగా, శాంతిని కోరుకుంటున్నాడని తన యంత్రాంగం విశ్వసిస్తున్నదని పుతిన్‌ గురించి ట్రంప్‌ చెప్పాడు. మంగళవారం నాడు ట్రంప్‌ దూతలు స్టీవ్‌ విట్‌కాఫ్‌,జారెడ్‌ కుషనర్‌ (ట్రంప్‌ అల్లుడు) మాస్కోలో ఐదు గంటల పాటు జరిపిన చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి.దీంతో జెలెన్‌స్కీతో జరిపే చర్చలను రద్దు చేసినట్లు వార్తలొచ్చాయి. తమ మీద నెపం మోపితే కుదరదని, ఇప్పటి వరకు ఎలాంటి రాజీకీ ప్రాతిపదిక కుదరలేదని రష్యా ప్రతినిధి చెప్పాడు. ప్రారంభించింది రష్యానే గనుక ముగించాల్సింది కూడా వారే అని ఐరోపా, ఉక్రెయిన్‌ ప్రతినిధులు వ్యాఖ్యానించారు.

ఒక వైపు చర్చలంటూనే మరోవైపు ఐరోపా కమిషన్‌ నేతలు తమ దేశాల్లో స్తంభింపచేసిన రష్యన్‌ ఆస్తులను తనఖా పెట్టి ఉక్రెయిన్‌ మిలిటరీకి 90బిలియన్‌ యూరోలు ఇచ్చేందుకు పూనుకున్నారు. ఐరోపా కోరుకుంటే తాను కూడా యుద్ధానికి సిద్ధమేనని, తరువాత తనతో చర్చించేందుకు ఎవరూ మిగలరని పుతిన్‌ చేసిన హెచ్చరికను చూడాల్సి ఉంది. పశ్చిమ దేశాల అండతో ఉక్రెయిన్‌ బాల్టిక్‌, నల్లసముద్ర జలాల్లో ఉన్న రష్యా చమురు టాంకర్లపై దాడులు జరిపి రెచ్చగొట్టటం కొనసాగిస్తూనే ఉంది.దానికి ప్రతిగా డెన్మార్క్‌, రుమేనియాలపై రష్యా దాడులకు దిగితే వివాదాన్ని విస్తరించాలన్నది నాటో దేశాల కుట్ర. మూడింట రెండువంతుల నాటో దేశాలు ఉక్రెయిన్‌కు నాలుగు బిలియన్‌ డాలర్ల విలువగల ఆయుధాలు అందించాలని నిర్ణయించాయి. ఐరోపాతో సంబంధంలేని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ కూడా మంటను ఎగదోసేం దుకు తమ వంతు అందచేస్తామని ప్రకటించాయి. ట్రంప్‌ దూతలు మాస్కోలో చర్చలకు వచ్చే ముందు పుతిన్‌ హెచ్చరిక జారీచేశాడు. ఐరోపా దేశాలు ఒక పక్షాన యుద్ధంలో ఉన్నాయి, శాంతికి అడ్డుపడుతున్నాయి. ఒక వేళ ఆకస్మికంగా పోరు ప్రారంభించాలనుకుంటే ఆ పని చేయవచ్చు.తరువాత తనతో చర్చించేవారెవరూ మిగలరని, చర్చలకు తాను సిద్దమేనని, ఉక్రెయిన్‌ గనుక ఒప్పందాన్ని తిరస్కరిస్తే తన సేనలు మరింత ముందుకు వెళతా యని అన్నాడు. ప్రస్తుతం 19శాతం ఉక్రెయిన్‌ ప్రాంతాలు (1,15,600 చదరపు కిలోమీటర్లు) రష్యన్‌ సేనల ఆధీనంలో ఉన్నాయి. కీలకమైన పోక్‌రోవస్క్‌ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పుతిన్‌ ప్రకటించాడు.

శాంతి ఒప్పందానికి ఒప్పించేందుకు అమెరికన్లు అనేక బిస్కెట్లు వేస్తున్నారు. ఉక్రెయిన్‌లో కొంత ప్రాంతాన్ని అప్పగిస్తామని, రష్యా చమురు రంగంలో అమెరికా పెట్టుబడులు పెడతామని, జి7 ధనికదేశాల కూటమిలో తిరిగి రష్యాకు స్థానం కల్పిస్తామని చెబుతున్నారు. అవన్నీ సరే, ఎన్నడూ ఉక్రెయిన్‌ నాటోలో చేరకూడదని, దాని సైన్యానికి పరిమితులు విధించాలని, క్రిమియా, డాన్‌బోస్‌,ఖేర్సన్‌, జపోర్జియా ప్రాంతాలను తమకు చెందినవిగా గుర్తించాలని, ఉక్రెయిన్‌లో రష్యన్‌ భాష మాట్లాడేవారికి రక్షణ కల్పించాలని పుతిన్‌ డిమాండ్‌ చేస్తున్నాడు.దీనికి అంగీకరించటం అంటే దాసోహం కావటం తప్ప మరొకటి కాదని ఉక్రెయిన్‌ వ్యాఖ్యానిం చింది.మాస్కోకు కొన్ని ప్రాంతాలను అప్పగిస్తే తరువాత తమ సభ్యదేశాలపై దాడులకు దిగుతుందని నాటో నేతలు అన్నారు. దీన్ని మాస్కో తోసిపుచ్చింది. రష్యా షరతులను అంగీకరిస్తే 2014 నుంచి ఐరోపా దేశాలు చేస్తున్న వాదనలు, రష్యాకు వ్యతిరేకంగా పన్నిన కుట్రలన్నీ వమ్మయినట్లే. అదే జరిగితే ఐరోపా యూనియన్‌పై అక్కడి ధనిక దేశాల పట్టుకూడా సడలుతుంది. దాని ప్రభావం ఒక్క ఐరోపాకే కాదు, యావత్‌ ప్రపంచంపై అమెరికా, ఐరోపా దేశాల ప్రభావం దిగజారిపోవటం ఖాయం.ప్రపంచ రాజకీయాల్లోనే అనేక మార్పులు సంభవిస్తాయి. అందుకే పశ్చిమదేశాలు అలా జరగకుండా నానాతంటాలు పడుతున్నాయి!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -