Thursday, January 1, 2026
E-PAPER
Homeజాతీయంసంక్షోభం నుంచి గట్టెక్కించిన పీవీ

సంక్షోభం నుంచి గట్టెక్కించిన పీవీ

- Advertisement -

సమస్యలకు ఎదురొడ్డిన మాజీ ప్రధాని : డాక్టర్‌ మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి మాజీ ప్రధానమంత్రి పీ.వీ.నరసింహారావు గట్టెక్కించారని ప్లానింగ్‌ కమిషన్‌ మాజీ డిప్యూటీ చైర్మెన్‌ డాక్టర్‌ మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియా కొనియాడారు. పీ.వీ.నరసింహారావు మెమోరియల్‌ లెక్చర్‌ కమిటీ ఆధ్వర్యంలో సీనియర్‌ పాత్రికేయులు డాక్టర్‌ కె.రామచంద్రమూర్తి అధ్యక్షతన బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన స్మారకోపన్యాసం ఇచ్చారు. అహ్లూవాలియా మాట్లాడుతూ తీసుకునే నిర్లయాల పట్ల పీవీ కట్టుబడి ఉండేవారని తెలిపారు. పీవీ ప్రధానమంత్రిగా పదవి చేపట్టే నాటికి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌ ఎకానమీ పెరుగుతున్నదనీ, అందుకనుగుణంగా ఆర్థిక సంస్కరణలు తీసుకున్నారని తెలిపారు. ఆ కొద్ది కాలంలోనే వెలుగులోకి వచ్చిన హర్షద్‌ మెహతా స్కాంకు పీవీ తీసుకున్న ఆర్థిక సంస్కరణలే కారణమని విమర్శకులు నిరాధార ఆరోపణలు చేశారని చెప్పారు. పార్లమెంటు లోపలా, బయట విమర్శలు పెరిగిపోవడంతో నాటి ఆర్థికశాఖ మంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ రాజీనామాకు సిద్ధపడితే, పీవీ వెన్నంటి ఉండి రాజీనామాను తిరస్కరించడమే కాకుండా ఆయన్నే ఆర్థిక మంత్రిగా కొనసాగించారని వివరించారు. రాజకీయంగాను స్థిరత్వం కోసం ఎప్పటికప్పుడు ఆర్థిక సంస్కరణలకు ఆటంకాలు రాకుండా అమలు చేస్తూ దేశం అభివృద్ధి చెందడానికి అవసరమైన పునాదులు వేశారన్నారు. నాటి సంస్కరణల పుణ్యమే నేడు వృద్ధి రేటు పెరిగిందని తెలిపారు. నేటి తరం పీి.వీ.నరసింహారావు గురించి తెలుసుకోవాలని ఆయన సూచించారు. నాటి పరిస్థితుల్లో ఉన్న సమస్యలకు భిన్నంగా దేశం ప్రస్తుతం భిన్నమైన సమస్యలను ఎదుర్కొంటున్నదని తెలిపారు. ఏఐ, ఆటోమొబైల్‌ టెక్నాలజీ తదితర సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా పెరుగుతున్నదనీ, దీంతో ఉద్యోగుల అవసరత తగ్గిపోతూ, నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వీటితో పాటు వాతావరణ మార్పులు తదితర సమస్యలు కూడా దేశం ఎదుర్కొంటున్నదని చెప్పారు. ఈ ఇబ్బందుల నుంచి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు.

సీపీటీపీపీలో సభ్యత్వం తీసుకోవాలి
భారతదేశం కాంప్రిహెన్సివ్‌ అండ్‌ ప్రొగ్రెసివ్‌ అగ్రిమెంట్‌ ఫర్‌ ట్రాన్స్‌- పసిఫిక్‌ పాట్నర్‌ షిప్‌ (సీపీటీపీపీ)లో లో సభ్యత్వం తీసుకోవాలని అహ్లువాలియా సూచించారు. యూకె, యూరోపియన్‌ యూనియన్‌ లాంటి భాగస్వాములతో కలిసి వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరపడం మంచిదని అభిప్రాయపడ్డారు. దేశీయ మార్కెట్‌కు అవకాశాలు కల్పించేందుకు సీపీటీపీపీలో చేరడం అవసరమని తెలిపారు. ఈ సమావేశంలో పీ.వీ.నరసింహారావు కూతురు, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, కుమారుడు పీ.వీ.ప్రభాకర్‌ రావు, ఎమెస్కో విజయ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -