– సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యార్థిగా ఉన్నపుడే నిజాం ప్రభుత్వ నిషేదాజ్ఞలను ధిక్కరించి వందేమాతర గీతాలాపన చేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నిజమైన జాతీయవాది అని సీనియర్ జర్నలిస్టు ఎ కృష్ణారావు అన్నారు. పీవీ వర్ధంతి కార్యక్రమాన్ని శ్యాంప్రసాద్ ముఖర్జీ రీసెర్చ్ ఫౌండేషన్ మంగళవారం కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ఆర్యసమాజ్, వందేమాతరం ఉద్యమం, స్వాతంత్య్రోద్యమం, నిజాం వ్యతిరేక పోరాటం పీవీపై ప్రగాఢ ప్రభావాన్ని చూపాయని చెప్పారు. నెహ్రూ నుంచి రాజీవ్‌గాంధీ వరకు సామాజిక, ఆర్థిక చరిత్ర ఒక ఘట్టమైతే ఆధునిక భారతదేశ చరిత్ర పీవీతోనే ప్రారంభమైంని వివరించారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారని అన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు బాటలు వేశారని గుర్తు చేశారు. టెలీకమ్యూనికేషన్ల విప్లవం, మౌలిక సదుపాయాల కల్పన, భారీ పెట్టుబడులు, ఐటీ విప్లవం, ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం వంటి అనేక పరిణామాలు పీవీ హయాంలోనే మొదలయ్యాయని వివరించారు. నరేగాకు ముందే 1991లో జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేశారనీ, మహిళలకు స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్ల కల్పించారని అన్నారు. మైనార్టీ ప్రభుత్వంలో ఉన్నా ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవడం పీవీకే చెల్లిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ సుధాంశుత్రివేది, ఆల్ ఇండియా ఉగ్రవాద వ్యతిరేక ఫ్రంట్ చైర్మెన్ మణీందర్‌జీత్‌సింగ్ బిట్టా తదితరులు పాల్గొని ప్రసంగించారు.
పీవీ నిజమైన జాతీయవాది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



