న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం
నవతెలంగాణ-ముంబయి
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో ఆతిథ్య భారత్ దర్జాగా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం ముంబయిలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 53 పరుగుల (డక్ వర్త్ లూయిస్ పద్దతిలో) తేడాతో ఘన విజయం సాధించింది. గ్రూప్ దశలో మూడో విజయం సాధించిన టీమ్ ఇండియా… మరో మ్యాచ్ ఉండగానే టాప్-4లో చోటు ఖాయం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్లు ప్రతిక రావల్ (122, 134 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్మతీ మంధాన (109, 95 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు సెంచరీలకు తోడు జెమీమా రొడ్రిగస్ (76 నాటౌట్, 55 బంతుల్లో 11 ఫోర్లు) రాణించటంతో 49 ఓవర్లలో 3 వికెట్లకు 340 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఓపెనర్లు తొలి వికెట్‌కు 212 పరుగుల అదిరే ఆరంభం ఇవ్వగా..జెమీమా డెత్ ఓవర్లలో దంచికొట్టింది. మ్యాచ్‌కు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది. భారత ఇన్నింగ్స్‌ను 49 ఓవర్లకు కుదించగా.. న్యూజిలాండ్ లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 44 ఓవర్లలో 325 పరుగులకు సవరించారు. భారీ ఛేదనలో న్యూజిలాండ్ చేతులెత్తేసింది. బ్రూక్ (81, 84 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), ఇసబెల్లా (65 నాటౌట్, 51 బంతుల్లో 10 ఫోర్లు) మెరిసినా ఆ జట్టు 44 ఓవర్లలో 8 వికెట్లకు 271 పరుగులే చేసింది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, రేణుక సింగ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. గ్రూప్ దశ ఆఖరు మ్యాచ్‌లో భారత్ ఆదివారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది.



