నాణ్యతేది..?

What is the quality..?ఇటీవల యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌ (ఎఎస్‌ఇఆర్‌) తన తాజా నివేదికను విడుదల చేసింది. ఆ లెక్కలు చూస్తూ మన భావిభారతం పరిస్థితి ఏంటనే భయం కలుగుతోంది. దేశంలో నాణ్యమైన విద్య కొరవడిందని ఆ రిపోర్ట్‌ తేల్చి చెప్పేసింది. దీనికి ప్రభుత్వ అలసత్వమే ప్రధాన కారణం. గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత, వారి విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి అనే విషయాలపై ఎఎస్‌ఇఆర్‌ 2005లో తన అధ్యయనం ప్రారంభించింది. ఇప్పటి వరకు మూడు నివేదికలు విడుదల చేసింది. తాజాగా గతేడాది విడుదలైన నివేదికైతే పాఠశాల విద్యపై ఆందోళన వ్యక్తం చేసింది. 14-18 ఏండ్ల మధ్య విద్యార్థుల్లో విద్యకు సంబంధించిన పునాది చాలా బలహీనంగా ఉందని ఆవేదన చెందుతోంది. పునాదే బలహీనంగా ఉంటే ఇక దానిపై నిర్మించబోయే భవనం పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విద్యార్థి దశలో బలమైన పునాది లేకపోవడంతో యువత సరైన ఉద్యోగాలు పొందలేకపోతున్నారని, ఇది కూడా నిరుద్యోగానికి ఓ కారణమని ఆ నివేదిక చెబుతోంది.
దేశంలో విద్యావంతులైన వారందరికీ ఉద్యోగాలు లభించడం లేదు. పట్టభద్రుల్లో 45శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారని మెర్సర్‌ మెటిల్‌ సంస్థ రూపొందించిన నివేదిక తెలిపింది. భారత్‌లో విద్యనభ్యసించి పట్టభద్రులైన వారిలో నైపుణ్యం పరిమితంగా ఉంటుందని గతేడాది ఏప్రిల్‌లో విడుదలైన బ్లూమ్‌బర్గ్‌ నివేదిక నిగ్గుతేల్చింది. ‘ప్రపంచాన్ని మార్చగలిగే శక్తిమంతమైన ఆయుధం విద్య’ అన్నాడు నెల్సన్‌ మండేలా. అంటే ప్రజల జీవన ప్రమాణాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతులు వారికి అందించే విద్యపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. ఏ దేశమైనా అభివృద్ధి చెందిందంటే అక్కడ విద్యాభివృద్ధి ఉన్నట్టే. దేశ ప్రగతికి సాధనం విద్య. ప్రపంచంలో కొన్ని దేశాలలో అత్యుత్తమ విద్యా విధానం అమల్లో ఉన్నట్టు కొన్ని లెక్కలు చెబుతున్నాయి. ఆయా దేశాల్లో విద్యకు అవసరమైన నిధులు కేటాయించి అందరికీ కనీసం హైస్కూల్‌ వరకైనా సమాన విద్యను అందించడమే దీనికి కారణమని కూడా అవే లెక్కలు తేల్చాయి. కాబట్టే ఆయా దేశాలు అభివృద్ధి చెందాయి. అయితే ఇవేవి మన ప్రధాని కండ్లకు కనబడడం లేదు. తమ పరిపాలనా, వ్యాపార సౌలభ్యం కోసం నాడు విదేశీ పాలకులు మెకాలే విద్యా విధానం అమలు చేస్తే నేటి మన బీజేపీ పాలకులు తమ కుర్చీని సుస్థిరం చేసుకునేందుకు అంతరాల విద్యను పకడ్బంధీగా అమలు చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం ఉచిత నిర్బంధ విద్య అందించాల్సిన ప్రభుత్వాలు ఆ నిబంధనలను తుంగలో తొక్కి కార్పొరేట్‌ విధానాలకు వత్తాసు పలకుతున్నాయి. ఇది దేశ ప్రగతి నిరోధిస్తుంది. నాణ్యమైన విద్య మాత్రమే యువతను సమాజ అవసరాలకు అనుగుణంగా తయారు చేస్తుంది. కానీ మన దేశంలో గత 30 ఏండ్లుగా విద్య ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ బాట పట్టిందనేది ఎవ్వరూ కాదనలేని సత్యం. ఫలితంగా సామాన్యులు నాణ్యమైన విద్యకు దూరమయ్యారనేది కూడా పచ్చి నిజం.
ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం – 2020 తీవ్రమైన అసమానతలతో కూడుకొని ఉందని ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు మొదటి నుండి అంటూనే ఉన్నారు. కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చేలా, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని నెత్తీనోరూ కొట్టుకుంటూనే ఉన్నారు. సిలబస్‌ మార్పిడి పేరిట శాస్త్రీయ భావాలను తొలగించడమే దీనికి ఉదాహరణ. మేధావులను తయారు చేసే విశ్వవిద్యాల యాల్లో మూఢనమ్మకాలు పెంచిపోషించే జ్యోతిష్య, వాస్తు, భూత వైద్యాన్ని ప్రవేశపెట్టారంటే భావిభారతం పట్ల వారికి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే దేశాన్ని పెను ప్రమాదంలోకి నెట్టేసే అంశాలు నూతన విద్యా విధానంలో ఎన్నో ఉన్నాయి.
ఇలాంటి విద్యా విధానం సామాన్యులకు నాణ్యమైన చదువును దూరం చేస్తుందనడంలో, అసమానతలు మరింత పెంచిపోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కనుక ప్రజల ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, అభివృద్ధికి అవసరమైన విద్యా విధానాన్ని ప్రభుత్వం అమలు చేయకపోతే సామాన్యులు నాణ్యమైన విద్యకు మరింత దూరమవ్వడం ఖాయం. మరీ ముఖ్యంగా శాస్త్రీయ, లౌకిక, ప్రజాతంత్ర విద్యా విధానాన్ని మానవీయ విలువలు పెంపొందించే విధంగా రూపొందించాల్సి బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అయితే నిత్యం హిందూ, కార్పొరేట్ల జపంలో తరించే బీజేపీ ఈ బాధ్యత తీసుకుంటుందనే నమ్మకం ప్రజలు పూర్తిగా కోల్పోయారు. కనుక పాలకుల కనుసన్నల్లో జరుగుతున్న విద్యా వ్యాపారాన్ని అరికట్టి, విద్యా వ్యవస్థను కాపాడుకోవల్సిన బాధ్యత పౌర సమాజంపై ఎంతైనా ఉంది. ఇప్పటికే కార్మిక, కర్షకులు ఏకమై కేంద్ర ప్రభుత్వ వినాశకర విధానాలపై పోరాడేందుకు సిద్ధమయ్యారు. వారితో విద్యార్థులు, యువత, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, విద్యావేత్తలు సైతం భుజం కలిపే సమయం ఆసన్నమయ్యింది.

Spread the love