ముగ్గురు మృతి..శిథిలాల కింద చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
కొనసాగుతున్న సహాయ చర్యలు : అధికారులు
సోన్‌భద్ర : ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లా ఓబ్రా ప్రాంతంలోని బిల్లీ మార్కుండి మైనింగ్ ఏరియాలోని ఓ క్వారీలో శనివారం రాత్రి ఒక భాగం కూలిపోయి కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఎనిమిది మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకు పోరునట్టు తెలుస్తోంది. ఎంతమంది కార్మికులు చిక్కుకున్నారనే స్పష్టమైన సమాచారం ఇంకా తెలియలేదు. అలాగే ఇంకెంతమంది చనిపోయారన్న దానిపై స్పష్టత లేదు. అయితే అప్రమత్తమైన అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్ (రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం) బృందం వెంటనే రంగంలోకి దిగింది. అదనపు సహాయం కోసం వారణాసి నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్ (జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం) బృందం కూడా చేరుకుంది. ప్రస్తుతం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సంయుక్తంగా శ్రమిస్తున్నాయి.
అకస్మాత్తుగా కూలటంతోనే…
రోజువారీ మాదిరిగానే శనివారం సాయంత్రం కూడా కార్మికులు తమ పనిలో నిమగమై ఉండగా, అకస్మాత్తుగా గోడ కూలిపోయినట్టు అధికారులు తెలిపారు. కార్మికులు అప్రమత్తమయ్యే లోపే పెద్ద పెద్ద బండరాళ్లు వారిపై పడినట్టు వెల్లడించారు. అయితే ఈ గని 500 మీటర్లకు పైగా లోతుగా ఉండటం, రాత్రి చీకటి కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పోక్లెయిన్ యంత్రాలు, జనరేటర్లు తెప్పించి రాత్రి రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేశారు.
ఘటనాస్థలికి మంత్రి, కలెక్టర్
ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ (డీఎం), ఎస్పీతో పాటు స్థానిక మంత్రి సంజీవ్ కుమార్ గోండ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిథిలాల కింద 12 మంది వరకు చిక్కుకొని ఉండొచ్చని అన్నారు. బాధితులకు అండగా ఉంటామన్న ఆయన ప్రభుత్వం తరఫున పరిహారం అందిస్తామని తెలిపారు. ఈ ప్రమాదానికి గల బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ”జనజాతి గౌరవ దివస్ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఈ ప్రాంతంలో మైనింగ్‌ను నిలిపివేయాలని ఆదేశాలిచ్చారు. ఆ ఆదేశాలను పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కావడానికి ఒకటి-రెండు రోజులు పట్టే అవకాశం ఉంది.” అని యూపీ మంత్రి సంజీవ్ గోండ్ తెలిపారు.
ఇండోనేషియాలోని జావా ద్వీపంలో విరిగిపడిన కొండచరియలు 12 మంది మృతి…మరో 12 మంది గల్లంతు
ఇండోనేషియాలోని జావా ద్వీపంలో కొండచరియలు విరిగిపడ్డారు. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. మరో 12 మంది గల్లంతయ్యారు. అదృశ్యమైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు స్థానిక శోధన, రక్షణ చీఫ్ ముహమ్మద్ అబ్దుల్లా తెలిపారు. భారీ వర్షాల కారణంగా సెంట్రల్ జావా ప్రావిన్స్‌లోని మూడు గ్రామాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. కొన్ని ఇండ్లు నేలమట్టంకాగా.. మరికొన్ని దెబ్బతిన్నాయి.సాధారణంగా నవంబర్, ఏప్రిల్ మధ్య వార్షిక రుతుపవనాల కారణంగా తరచుగా కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు ముంచెత్తేస్తుంటాయి.



