నవతెలంగాణ హైదరాబాద్:
రాష్ట్ర ప్రభుత్వం రాచకొండ కమిషనరేట్ ఉనికి లేకుండా కొత్త మల్కాజిగిరి కమిషనరేట్‌గా నామకరణం చేస్తూ నిర్ణయం తీసుకుంది. మల్కాజిగిరి కమిషనరేట్ ఏర్పాటు చేయడంతో పాటు కొత్తగా కమిషనర్‌ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి హడావిడిగా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్యూచర్ సిటీని, యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్‌ను నియమించింది.అలాగే ప్యూచర్ సిటీ కమిషనర్‌గా ప్రస్తుతం రాచకొండ కమిషనర్‌గా ఉన్న సుధీర్‌బాబును నియమించింది. మల్కాజిగిరి కమిషనర్‌గా అవినాశ్ మహంతిని నియమించింది. సైబరాబాద్ కమిషనర్‌గా రమేశ్‌రెడ్డిని నియమించింది.
రాష్ట్రంలో ప్రస్తుతం ట్రై పోలీస్ కమిషనరేట్లను పునర్విభజన చేసి జీహెచ్‌ఎంసీలో ఉన్నట్లుగానే 12 జోన్లను చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సైబరాబాద్‌లో ఉన్న రాజేంద్రనగర్, శంషాబాద్‌ను హైదరాబాద్‌లోకి కలిపి, సంగారెడ్డిలోని కొన్ని ప్రాంతాలను సైబరాబాద్‌లోకి కలుపనున్నారు. అలాగే రాచకొండ కమిషనరేట్‌లో ఇప్పటి వరకు ఉన్న యాదాద్రి భువనగిరి, మహేశ్వరం జోన్లను తొలగించారు. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేసిన మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోకి గతంలో ఉన్న మల్కాజిగిరి, ఎల్బీనగర్ జోన్‌లలోని ప్రాంతాలు మాత్రమే ఉండనున్నాయి. అయితే ఇక్కడ ఉప్పల్ జోన్‌ను ఏర్పాటు చేసి, మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేట్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలను కలుపనున్నారు.



