– ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వేగంగా సర్వేలు
– పలుచోట్ల అడ్డుకుంటున్న రైతులు ొ శంషాబాద్ మండలంలో గ్రామ సభలు
– సర్వం కోల్పోతే.. రోడ్డున పడతామని రైతుల ఆవేదన
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రేడియల్ రోడ్డు భూ సేకరణ పనులు జెట్ స్పీడ్‌లో జరుగుతున్నాయి. రెవెన్యూ అధికారులు సర్వేలు చేపడుతూ.. గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ నుంచి వికారాబాద్ జిల్లాలోని దుద్యాల మండలం వరకు పనుల్లో వేగం పెంచారు. అయితే ఈ పనులను రైతులు అడ్డుకుంటున్నారు. రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ భూముల్లో సర్వే చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భూములు ఇచ్చేది లేదని, భూమికి భూమికి ఇవ్వాలని కోరుతున్నారు. రైతులు ఎన్ని అడ్డంకులు తలపెట్టినా భూ సేకరణ ఆగదని రెవెన్యూ అధికారులు తెగేసి చెబుతున్నారు. దాంతో రైతుల ఆందోళన, అధికారుల సర్వేలతో ఆయా గ్రామాల్లో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి.
హైదరాబాద్ కేంద్రంగా పొల్యూషన్, ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర రాజధానికి నలుమూలల నుంచి రవాణా సౌకర్యం సులభతరం చేసేందుకు ప్రభుత్వం భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డుకు కనెక్టివిటీగా రేడియల్ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నది. ఔటర్ నుంచి సుమారు 11 రేడియల్ రోడ్ల నిర్మాణాలకు హెచ్‌ఎమ్‌డీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. మొదటి ఫేజ్‌లో ఎగ్జిట్ 13 రావిరాల నుంచి ఆమన్‌గల్ ఆకుతోటపల్లి వరకు సుమారు 42 కిలో మీటర్లు.. 330 ఫీట్ల వెడల్పుతో 6 లైన్ల రోడ్డు వేసేందుకు డీపీఆర్ రెడీ అయింది. ఇందుకు టెండర్లు కూడా ఖరారు చేశారు. రెండవ విడతలో భాగంగా బుద్వేల్ నుంచి కోస్గి వరకు సుమారు 81 కిలో మీటర్ల దూరం 225 ఫీట్ల వెడల్పుతో రేడియల్ రోడ్డు నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేసింది. భూ సేకరణ పనులు కూడా ప్రారంభించింది. ఈ రోడ్డు నిర్మాణానికి సుమారు 1500 ఎకరాల భూమి అవసరం ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు.
రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ మండల పరిధిలో 9 గ్రామాలు, షాబాద్ మండల పరిధిలోని 8 గ్రామాల్లో సుమారు 650 ఎకరాలు సేకరిస్తుంది. సుమారు 1100 మంది భూములు కోల్పోతున్నారు. వికారాబాద్ జిల్లాలోని దోమ, పరిగి, పూడురు మండలాల పరిధిలో సుమారు 800 ఎకరాలు అవసరం ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఇక్కడ భూ సర్వే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దుద్యాల మండల పరిధిలో హకీంపేట, పోలేపల్లి గ్రామాల్లో సుమారు 100 ఎకరాలు అవసరం ఉన్నట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు.
సమాచారం లేకుండా సర్వేలు..
ప్రభుత్వ అవసరాలకు భూ సేకరణ చేపడుతున్న క్రమంలో భూ సేకరణ చట్టం 2013 ప్రకారం రైతులకు ముందస్తు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రైతులకు సమాచారం ఇవ్వకుండా నేరుగా రైతుల భూముల్లో మార్కింగ్ పెట్టేందుకు అధికారులు వెళ్లడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సర్వేలేంటనీ నిలదీశారు. అయితే పేపర్లలో ప్రకటనలు ఇచ్చామని అధికారులు మాట దాటవేస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో శంషాబాద్, దుద్యాల ప్రాంతాల్లో సర్వే పనులను రైతులు అడ్డుకున్నారు. శంషాబాద్ మండలంలో ఓ రైతు సర్వేకు వచ్చిన అధికారుల ఎదుటే ఆత్మహత్యాయత్నం చేశాడు. దాంతో కొంత వెనక్కి తగ్గిన అధికారులు శంషాబాద్ మండలంలో గ్రామ సభలు నిర్వహించారు.
భూ సేకరణ ఆగదు.. రైతులకు అల్టిమేటం..!
శంషాబాద్ మండల పరిధిలో రామాంజపూర్, మాల్కపూరం, నర్కూడ, కవ్వగూడ గ్రామాల్లో సభలు నిర్వహించారు. భూ సేకరణపై రెవెన్యూ అధికారులు గ్రామ సభలు పెట్టి రైతులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం చట్టం ప్రకారం భూ సేకరణ చేపడుతున్నదని, ఇందుకు రైతులు సహకరించాలని కోరుతున్నారు. భూ సేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం ఇస్తామని హామీ ఇస్తున్నారు. చర్చల ద్వారా ఒప్పుకుంటే అవార్డు పాసు చేస్తామని.. లేదంటే కోర్టు ద్వారా తీసుకోవాల్సి వస్తుందని రెవెన్యూ అధికారులు సభల్లోనే అల్టిమేట్టం జారీ చేస్తున్నారు.
భూమికి భూమి ఇవ్వాల్సిందే..
గ్రామ సభల్లో రైతులు తమ గోడును అధికారుల ఎదుట వెలిబుచ్చుతున్నారు. తమకు ఆ భూములే దిక్కని, వాటిని అభివృద్ధి, రోడ్ల పేర తీసుకుంటే తాము రోడ్డున పడుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు వారసత్వంగా వస్తున్న భూములను ‘గద్దొచ్చి కొడిపిల్లను ఎత్తుకెళ్లినట్టు’ ప్రభుత్వం తమ భూములను లాక్కుంటే తమ భవిష్యత్ ఏంటనీ ఆందో ళన చెందుతున్నారు. తమకు భూమికి భూమి ఇవ్వాల్సిందే నని, లేదంటే భూములు ఇచ్చేది లేదని తేల్చి చెబుతు న్నారు. అయితే ప్రభుత్వం మాత్రం రోడ్డు పనులు శరవేగంగా పూర్తి చేసేందుకే ముందుకెళ్తోంది. ఈ క్రమంలో రైతులకు ఏ మేర న్యాయం జరుగుతుందో వేచి చూడాలి.


