Wednesday, July 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసహకార రంగంలో సమూల మార్పులు

సహకార రంగంలో సమూల మార్పులు

- Advertisement -

– సహకార సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా మార్పు
– రైతులకు అన్ని సేవలూ అందించాలి
– మార్పులకు అనుగుణంగా దృక్పథం మార్చుకోవాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌

దేశంలోనే ఎక్కడాలేని విధంగా ప్రాథమిక సహకార సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సహకార రంగంలో సమూల మార్పులు చేసి నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఎన్‌సీడీఎస్‌, కోఆపరేటివ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో 311 ఎఫ్‌పీఓలతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు, వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సహకారం పరపతి సంఘాలు తమ దృక్పథం మార్చుకోవాలని అన్నారు. రాష్ట్రంలో ఉండి సహకార రంగంలో దేశవ్యాప్తంగా రోల్‌ మోడల్‌గా నిలిచిన ముల్కనూరు సహకార పరపతి సంఘ విజయాల్ని ప్రస్తావించారు. సహకార సంఘ బాధ్యతలు నీతిగా, నిజాయితీగా చేస్తూ.. సంఘ అభివృద్ధికి పాటుపాడితే ముల్కనూరు లాంటి సహకార సంస్థలు మరిన్ని ఉద్భవించే అవకాశాలు ఉంటాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా 10,000 రైతు ఉత్పత్తి సంఘాల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తున్న క్రమంలో ఇప్పటికే ఉన్న ప్రాథమిక సహకార పరపతి సంఘాలను ‘రైతు ఉత్పత్తి సంఘలు’గా మార్చి, వారికి మరింత ఆర్థిక తోడ్పాటు అందించే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్నారు. నేషనల్‌ కో-ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సహకారంతో, నిర్లిప్తంగా ఉన్న తెలంగాణ కో-ఆపరేటివ్‌ యూనియన్‌ను క్లస్టర్‌ బేస్డ్‌ బిజినెస్‌ ఆర్గనైజేషన్‌గా నియమించి దాని ద్వారా రాష్ట్రంలో 311 సహకార పరపతి సంఘాలను ఎఫ్‌పీఓలుగా ఎన్నిక చేశామన్నారు. వీటికి ఒక్కొక్క దానికి రూ.15 లక్షల ఈక్విటీ గ్రాంటు, రూ.18 లక్షల మేనేజ్‌మెంట్‌ ఖర్చు అనగా 311 ఎఫ్‌పీఓలకు సుమారు రూ.167.93 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు.
మొదటి విడతగా రూ.9,85,40,000 విడుదల చేశామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌లో భాగంగా ప్రతి ఎఫ్‌పీఓ లకు 2 కోట్లు వరకు లోన్‌ గ్యారంటీ సౌకర్యం కూడా ఉందన్నారు. రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూరగాయలు, పండ్ల సాగును ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిదీ అని, ఆదేవిధంగా వ్యవసాయంలో ఎరువుల, రసాయనాల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ వ్యవసాయం దిశగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీడీఎస్‌ రీజనల్‌ డైరెక్టర్‌ శార్దూల్‌, తెలంగాణ కో-ఆపరేటివ్‌ యూనియన్‌ ఛైర్మెన్‌ మోహన్‌రెడ్డి, రవీందర్‌రావు, ఛైర్మెన్లు, కోఆపరేటివ్‌ సిబ్బంది, రాష్ట్రం నలుమూలాల నుంచి 311 సొసైటీ ఛైర్మెన్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -