-15 మందిని చితకబాధిన టెన్త్ విద్యార్థులు
-సివిల్ ఆస్పత్రికి విద్యార్ధుల తరలింపు.. చికిత్స
– విద్యార్థులు, తల్లిదండ్రులను విచారించిన తహసీల్దార్
– తహసీల్దార్ విచారణలో వెలుగు చూసిన నిజాలు
– గురుకుల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులపై జిల్లా కలెక్టర్ కు నివేదిక
నవతెలంగాణ – గంగాధర
ఇంజనీరింగ్, వైద్య, విద్య కళాశాలల్లోనే కాదు.. ప్రభుత్వ గురుకుల పాఠశాలలోనూ ర్యాగింగ్ భూతం ఆవరించింది. తమకు మర్యాద ఇవ్వడం లేదనే అక్కసుతో 9 వ తరగతికి చెందిన 15 మంది విద్యార్థులను టెన్త్ చదివే విద్యార్థులు అర్థరాత్రి వేళ ఒక్కొక్కరిని తమ హాస్టల్ గదికి పిలిచి ర్యాగింగ్ కు పాల్పడి చితకబాధిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గంగాధర మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో అర్ధరాత్రి సమయంలో విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడిన సంఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు.
ఈ గురుకులంలో విద్యాభ్యాసం చేసే 9,10 వ తరగతి చదివే విద్యార్థుల మధ్య గత కొంత కాలంగా ఘర్షణ చోటు చేసుకున్నట్టు పోలీసులు, అధికారుల విచారణలో వెల్లడైయ్యింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో టెన్త్ చదివే కొంత మంది విద్యార్థులు 9 వ తరగతి చదివే విద్యార్థులు కొందరు తమ మర్యాద ఇవ్వడం లేదనే అక్కసుతో ఒక్కొక్కరిని తమ హాస్టల్ గదికి పిలిచి వెకిలి చేష్టలకు పాల్పడి ర్యాగింగ్ కు పాల్పడినట్టు బాధిత విద్యార్థులు ఆరోపించారు. ఈ ర్యాగింగ్ ఘటనలో 15 మంది 9 వ తరగతి విద్యార్థులు టెన్త్ విద్యార్థులు కొట్టిన దెబ్బలకు స్వల్పంగా గాయపడగా, వీరిని రెవెన్యూ, పోలీసు అధికారులు శనివారం ఉదయం గంగాధర సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అయితే ఇందులో ఇద్దరు విద్యార్థులకు బలమైన గాయాలు కావడంతో కరీంనగర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. అయితే గురుకులంలో శుక్రవారం రాత్రి ఇంత పెద్ద సంఘటన చోటు చేసుకున్నా.. పాఠశాలలో రాత్రి పూట విధుల్లో ఉన్న ఉపాధ్యాయుడు నిద్రలోకి జారుకోవడంతో 10 వ తరగతి విద్యార్థులు కొందరి రెచ్చిపోయి ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు అధికారుల విచారణలో నిగ్గు తేలింది.
గురుకుల పాఠశాలలో కొరవడిన ప్రిన్సిపల్ పర్యవేక్షణ లోపం, ఉపాధ్యాయుల తప్పదం వల్ల పాఠశాలలో ర్యాగింగ్ చోటు చేసుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నాణ్యమైన విద్య అందుతుందని గురుకుల పాఠశాలకు పంపితే తమ పిల్లలను రాత్రి వేళలో పడుకునే హాస్టల్ గదికి పిలిచి వెకిలి చేష్టలకు పాల్పడి చితకబాధారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై ఎంఈవో ప్రభాకర్ రావు, పోలీసులు రహస్య విచారణ చేపట్టి జరిగిన సంఘటనను బయటకు పొక్కకుండా ప్రయత్నం చేశారనే ఆ రోపణలు ఉన్నాయి. అయితే విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట చేరి ఆందోళనకు దిగడంతో జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
విద్యార్థులు, తల్లిదండ్రులను విచారించిన తహసీల్దార్
బాలుర గురుకుల పాఠశాలలో జరిగిన విద్యార్థుల ర్యాగింగ్ పై స్థానిక తహసీల్దార్ అంబటి రజిత విచారణ జరిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తహసీల్దార్ కార్యాలయంలో విచారించి వివరాలు రాబట్టారు. 9 వ తరగతి విద్యార్థులు తమకు రెస్పెక్టు ఇవ్వడంలేదనే దృష్టితో తమపై రాత్రి ర్యాగింగ్ చేస్తూ దాడికి పాల్పడి చితకబాధినట్టు బాధిత విద్యార్థులు ఆరోపించారు. ప్రిన్సిపల్, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందని, రాత్రి విధుల్లో ఉన్న ఉపాధ్యాయున్ని సస్పెండ్ చేయాలని, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు అందరిని బదిలీ చేయాలని తల్లిదండ్రులు ఇచ్చిన లిఖిత పూర్వక ఫిర్యాదును జత చేస్తూ జిల్లా కలెక్టర్, డీఆర్వోకు నివేదిక పంపడం జరిగిందని తహసీల్దార్ అంబటి రజిత వివరించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునే విధంగా జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపామని ఆమె తెలిపారు.




