ఇంటరాక్షన్ పేరుతో వికృత చేష్టలు..?
ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
ఆలస్యంగా వెలుగులోకి ఘటన
నవతెలంగాణ – మల్యాల/జగిత్యాల టౌన్
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ‘ఇంటరాక్షన్’ పేరుతో సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనతో కళాశాల వాతావరణం ఉద్రిక్తంగా మారింది. క్యాంపస్‌లో ఇద్దరు ఫస్ట్ ఇయర్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఇద్దరు అబ్బాయిలకు సీనియర్లు పెండ్లి తంతు నిర్వహించారు. ఈ ర్యాగింగ్ తీరును అక్కడే ఉన్న మరికొందరు విద్యార్థులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జూనియర్ల భయం.. తల్లిదండ్రుల ఆందోళన
సీనియర్ల బెదిరింపులతో జూనియర్లు భయాందోళనకు గురవుతున్నారు. ఫిర్యాదు చేస్తే మరింత ఇబ్బంది వస్తుందేమోనన్న భయంతో తల్లిదండ్రులకే వివరాలు చెప్పడానికి వెనుకడుగే స్తున్నారు. ”పిల్లలు బయట ప్రాంతాలనుంచి వచ్చి చదువుకుంటున్నారు.. ఇలా భయపెట్టి వాతావర ణం చెడగొట్టకూడదు’ అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రతి క్లాస్‌రూమ్‌లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ర్యాగింగ్ ఘటనలను అడ్డుకో లేకపోవడం తల్లిదండ్రుల్లో ఆగ్రహం రేపుతోంది. ప్రిన్సిపాల్, మేనేజ్‌మెంట్ ఎందుకు మౌనం పాటిస్తున్నారంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
పేరుకే కమిటీలు?
యాంటీ ర్యాగింగ్ కమిటీలు, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, డిసిప్లీనరీ టీంలు ఉన్నప్పటికీ వాటి పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. అవగాహనా కార్యక్రమాలు కేవలం నిబంధన నెరవేర్చడానికే పరిమితమై పోయాయని విద్యార్థులు విమర్శిస్తున్నారు. కేవలం బోర్డులు పెట్టడం కాదని, నిజంగా కమిటీలు పనిచేయాలని స్థానిక విద్యావేత్తలు అంటున్నారు.
మానసిక ఒత్తిడికి గురవుతున్న జూనియర్లు
ఇదంతా సరదా కోసం చేసింది మాత్రమేనని, ఫస్ట్ ఇయర్ విద్యార్ధులతో హెల్తీ ఇంటారాక్షన్‌లో భాగంగా చేసిందే తప్ప ఎక్కడా జూనియర్లను వేధింపులకు గురిచేయలేదని కొందరు సీనియర్లు చెబుతున్నారు.
కాగా, ఇది సరదా ఇంటరాక్షన్ కాదని, సీనియర్లు మానసిక ఒత్తిడికి గురిచేస్తు న్నారని కొంతమంది జూనియర్లు చెబుతుండటం గమనార్హం. అంతేకాదు, ఎవరికైనా చెప్పితే దాడి చేస్తారన్న భయం ఉందని తెలిపారు. ఒక విద్యార్థి ఈ ఒత్తిడిని తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటానని ఈ మెయిల్ పంపినట్టు సమాచారం. ఈ ఘటన తర్వాత శుక్రవారం జరగాల్సిన ఫ్రెషర్స్ పార్టీని శనివారం నిర్వహిం చినట్టు తెలుస్తోంది.
అధికారుల మౌనం.. విమర్శల వెల్లువ
జిల్లా ఎస్పీ వచ్చిన రోజునే ఇలాంటి ఘటన జరగడం, యాజమాన్యం మాత్రం పార్టీ ఏర్పాట్లలోనే బిజీగా ఉండటంపై తల్లిదండ్రులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడే చర్యలు తీసుకోకపోతే పెద్ద ప్రమాదం తప్పదని హెచ్చరి స్తున్నారు. కాగా, ఆదివారం ఉదయం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మెకానికల్ విద్యార్థులతో కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ చర్చించారు. ఇది సరదా కార్యక్రమమేనని, సీనియ ర్లు ఎటు వంటి ఒత్తిడి చేయలేదని జూనియర్లు తెలిపినట్టు వారి వాయిస్ ఓవర్ వీడియోను ప్రిన్సిపాల్ రికార్డు చేశారు. కాగా, దీనిపై ప్రిన్సిపాల్ నరసింహ వివరణ ఇస్తూ.. కాలేజీలో ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని, ఇది కేవలం ఇంటరాక్షన్ కార్యక్రమం మాత్రమేనని తెలిపారు. విద్యార్థుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
నాచుపల్లి జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



