– ఎల్‌ఆర్‌ఎస్‌ఎ సిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించాలి
– రైల్ నిలయం (సికింద్రాబాద్) లోకో రన్నింగ్ స్టాఫ్ నిరసన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రైల్వే లోకో రన్నింగ్ సిబ్బందికి 25 శాతం మైలేజీ అలవెన్స్ ఇవ్వాలనీ, ఎల్‌ఆర్‌ఎస్‌ఏ సిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించాలని ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ (ఏఐఎల్‌ఆర్‌ఎస్‌ఎ) సెంట్రల్ కమిటీ పిలుపులో భాగంగా గురువారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం వద్ద సౌత్ సెంట్రల్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎల్‌ఆర్‌ఎస్‌ఎ సెంట్రల్ ఉపాధ్యక్షులు హనుమయ్య మాట్లాడుతూ..పెరిగిన టీఏ (ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్) రేట్లకు అనుగుణంగా కిలోమీటర్ అలవెన్స్ పెంపుదలకు సంబంధించి, ఇన్‌కమ్ టాక్స్ పరిధి నుంచి 70శాతం మైలేజీ అలవెన్సును, టీఏ (టీఏకు 100శాతానికి మినహాయింపు ఉంది) మాదిరిగా మినహాయించాలని డిమాండ్ చేశారు. లోకో రన్నింగ్ సిబ్బందికి డ్యూటీలో భోజనం, కాలకృత్యాలను తీర్చుకోవడానికి చాలినంత సమయం కేటాయించాలని కోరారు. రిటైర్మెంట్ సమయంలో పెన్షన్‌కు వర్తించే 55 శాతం పెంపును నిరాకరించడాన్ని వెనక్కు తీసుకోవాలనీ, కనిష్ట మైలేజ్ అలవెన్స్ పొందే విధంగా హ్యాండిక్యాప్‌డ్ సెక్షన్స్‌ను గుర్తించాలని సూచించారు. స్టేషన్లలో ఉండే కంపేనీల, పరిశ్రమల గూడ్స్ బండ్లను నడిపినప్పుడు గంటకు 20 కిలోమీటర్ల చొప్పున మైలేజ్ అలవెన్సును చెల్లించాలని సూచిస్తూ కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వారాంతపు సెలవు అమలు చేయాలని, రెండు వరుస రాత్రి డ్యూటీల తర్వాత రాత్రి విశ్రాంతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైల్వే రంగాన్ని బలహీనపరుస్తోందనీ, అంబానీ, ఆదానీలకు భారతీయ రైల్వేలను కారుచౌకగా కట్టబెట్టడం అన్యాయమని విమర్శించారు. కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను దూకుడుగా అమలు చేస్తూ సామాన్యులపై భారాలు మోపుతున్నారని వాపో యారు. కార్పొరేట్ గుత్త సంస్థలకు, పెట్టుబడి దారులకు వేల కోట్ల రాయితీలు ప్రకటించి దేశ ఆర్ధిక వ్యవస్థను లూఠీచేస్తున్న తీరును ఎండగట్టారు. రైల్వే, రోడ్, ఎయిర్‌వేస్, డాక్ పోర్టులు, టెలికం, తదితర మౌలిక రంగాలలో నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ పేరిట, నేషనల్ ఎస్సెట్ మానిటైజేషన్ పైప్‌లైన్ పేరుతో లక్షల ఎకరాల భూములను కార్పొరేట్ కంపెనీలకు కారుచౌకగా కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కార్మికవర్గం యావత్తు భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ రైల్వే జోనల్ కార్యదర్శి సయ్యద్ జిలాని భాషా మాట్లాడుతూ.. లోకో రన్నింగ్ స్టాఫ్ సిబ్బంది హక్కుల కోసం ఎల్‌ఆర్‌ఎస్‌ఎ దశాబ్ధాల తరబడి పోరాడుతుందనీ, కోట్లాది ప్రయాణీకుల భద్రతకు రేయింబవళ్ళు శ్రమిస్తున్న ఎల్‌ఆర్‌ఎస్‌ఎ సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం విమర్శించడం అన్యాయమని అన్నారు. భవిష్యత్‌లో ఎల్‌ఆర్‌ఎస్‌ఎ సిబ్బంది దీర్ఘకాలిక కార్యాచరణకు పూనుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శులు శ్రీజిత్, కె. ప్రసాద్, ఏఐజీసీ నాయకులు పాండే, ఇక్బాల్ తదితరులు ప్రసంగించారు.
రైల్వే లోకో రన్నింగ్ సిబ్బందికి 25శాతం మైలేజీ అలవెన్స్ ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES