11 జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాకు ఎల్లో హెచ్చరికలు
25న బంగాళాఖాతంలో అల్పపీడనం
27న దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు బలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న ప్రకటించారు. ఈ మేరకు 11 జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. 25న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 26 నాటికి వాయుగుండంగా మారుతుంది. ఈ నెల 27న దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర ప్రాంతం మధ్యలో తీరం దాటే అవకాశముంది. మంగళవారం పశ్చిమబెంగాల్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రాంతం నుంచి తెలంగాణ వరకు నెలకొన్న ద్రోణి బుధవారం బలహీనపడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే సూచనలున్నాయి. బుధవారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 10:30 వరకు రాష్ట్రంలో 182 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అత్యధికంగా 6.65 సెంటీమీటర్ల వాన పడింది.