– నేడు, రేపు పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక ొ వందకుపైగా ప్రాంతాల్లో వర్షం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఈ నెల ఎనిమిదో తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న తెలిపారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో (గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో) కూడిన వర్షం పడే సూచనలున్నాయనీ, అదే సమయంలో అక్కడక్కడా వడగండ్లు పడే అవకాశముందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. ఆ జాబితాలో ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలున్నాయి. మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడా వర్షం కురిసే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చే 48 గంటల పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముంది. వర్షాల నేపథ్యంలో వాతావరణం చల్లబడటంతో గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం రాత్రి పది గంటల వరకు రాష్ట్రంలో వందకుపైగా ప్రాంతాల్లో వర్షం పడింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో అత్యధికంగా 5 సెంటీమీటర్ల వాన పడింది.
