- – వాగులు పొంగిపొర్లి కల్వర్టులు మత్తడి దూకాయి
- – లో లెవెల్ వంతెనలపై వరదలు
- – స్తంభించిన రాకపోకలు
– నీట మునిగిన వరిపంట ఆందోళనలో రైతన్నలు
నవతెలంగాణ-రాయికల్: రాయికల్ మండలంలో బుధవారం మధ్యాహ్నం నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేసింది. వాగులు పొంగిపొర్లి,కల్వర్టులు మత్తడి దూకాయి. రాయికల్ పట్టణంతో పాటుగా పలు గ్రామాల్లోని వార్డుల్లో వరద నీరు ఇండ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మండలంలోని సింగరావుపేట్-మోరపల్లి, ఆలూరు-ఉప్పుమడుగు, వీరాపూర్-ధర్మాజీపేట్, మైతాపూర్-పైడిమడుగు, రాయికల్-మైతాపూర్, రాయికల్-ఇటిక్యాల, భూపతిపూర్ ఎక్స్ రోడ్-మూటపల్లి, భూపతిపూర్-రామాజీపేట్ ఎస్సీ కాలనీ, రామాజీపేట్-భూపతిపూర్ మెయిన్ రోడ్, చింతలూరు-బోర్నపల్లి, మైతాపూర్-కుమ్మరిపల్లి, మూటపల్లి-ఇటిక్యాల, మూటపల్లి-కొత్తపేట్, ఒడ్డెలింగాపూర్-వస్తాపూర్ వంటి గ్రామాల మధ్యలో ఉన్న లో లెవెల్ రోడ్ డ్యాంలపై వరదలు ఉధృతిగా ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.అప్రమత్తమైన అధికారులు వరద ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ఇరువైపులా భారీ కేడ్లు, ట్రాక్టర్లను అడ్డుగా ఉంచి ప్రయాణికులను ఆపుతూ కాపలాగా ఉన్నారు.
భారీ వర్షాల కారణంగా మండలంలోని పలు గ్రామాల్లో వరి పంటలు నీట మునిగాయని, రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.రాయికల్-మైతాపూర్, ఇటిక్యాల, రామోజీపేట రహదారులపై వరద తీవ్రతను జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, రూరల్ సీఐ సుధాకర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రోడ్ డ్యాం ల మధ్య వరద ఉధృతి ఉన్న ప్రాంతాల్లో చేపలు పట్టేవారిని, ప్రజలను ఆ వైపు వెళ్లకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గోదావరి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ పరిశీలన లో తహసిల్దార్ నాగార్జున, ఎంపీడీవో బి. చిరంజీవి, మున్సిపల్ కమిషనర్ టి మనోహర్, ఆర్.ఐ పద్మయ్య, స్థానిక పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.


