రంగు మారుతున్న తెల్లబంగారం
పగిలిన పత్తిలో నీరు చేరి మొలకెత్తుతున్న వైనం
80 లేదా 90 కాయలు కాసే పత్తి… 50 కాయలకే పరిమితం
సగానికి తగ్గనున్న పంట దిగుబడి
పత్తి బాగా లేదంటూ రూ. 6వేలకే దళారుల కొనుగోలు
రైతుకు ఆసరా లేకపోగా అప్పులే మిగులు
సీసీఐ కేంద్రాలు తెరవని సర్కారు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అధిక వర్షాలతో పత్తి రైతుపై తీవ్ర దెబ్బపడింది. పత్తి విత్తినప్పటి నుంచి పంట చేతికొచ్చే దాకా వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆరుగాలం కష్టపడుతున్న రైతుకు పంట చేతికొస్తుందన్న గ్యారంటీ లేకుండా పోతున్నది. ఆ పంటను అమ్ముకునేందుకు ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. రాష్ట్రంలో 45,04,685 ఎకరాల్లో పత్తి సాగైంది. వర్షాధార పరిస్థితుల వల్ల వేసిన పత్తి విత్తనాలు మొదట మొలకెత్తలేదు. తర్వాత వచ్చిన అధిక వర్షాలు, వరదలతో కాత, పూత దెబ్బతిన్నది. పండిన పత్తిని తీయడం ఒక ఎత్తైతే, కూలీలు దొరకడం మరో ఎతైంది. తెల్ల బంగారంగా ప్రసిద్ధి చెందిన పత్తి వానలకు రంగు మారుతున్నది. పగిలిన పత్తిలో నీరు చేరి గింజలు మొలకెత్తుతున్నాయి.సరైన సమయంలో వానలు పడి కాలం మంచిగైతే ఒక్కొక్క పత్తి చెట్టుకు నల్లరేగడి నేలల్లో అయితే 80 నుంచి 95 కాయలు కాస్తాయి. అదే దుబ్బ, ఎర్రనేలల్లో అయితే 60 నుంచి 70 కాయలు కాస్తాయి.
కానీ ఈసారి జూన్, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన వానలకు పత్తి దిగుబడి బాగా తగ్గిపోయింది. ఒక్కొక్క చెట్టుకు సగటున 50 నుంచి 60 కాయలకు మించి కాయలేదు. చెట్లపై ఉన్న పత్తి కాయలు పగిలిన తర్వాత కొత్తగా కాత, పూత కూడా వచ్చే పరిస్థితి లేదు. కొన్నిజిల్లాల్లో భారీ వర్షాలకు పొలాల్లో నీరు చేరి నీర్చిచ్చు వచ్చి మొక్కలు చనిపోయాయి. సాధారణంగా ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఐదు లేదా ఏడు క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఎకరాకు నాలుగు క్వింటాళ్లే వస్తుంది. వీటన్నింటి ఫలితంగా పత్తి ఉత్పత్తి సగానికి తగ్గిపోయింది. రైతు పెట్టుబడి ఖర్చులు పోను రైతుకు మిగిలేది జీరోనే. దీంతో ఆరుగాలం కష్టపడిన రైతు పెట్టుకున్న ఆశలు ఆవిరైపోతున్నాయి.
జిన్నింగ్ మిల్లుల జిమ్మిక్కు
పత్తి చేతికొచ్చిన తర్వాత తడి కారణంగా పత్తి నాణ్యత తగ్గి నల్లగా మారడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సెంట్రల్ కాటన్ కార్పొరేషన్ (సీసీఐ) కేవలం 8 శాతం నుంచి 12శాతం తేమ ఉన్న పత్తినే కొనుగోలు చేస్తామని నిబంధనలు విధించడంతో రైతులు మరింత ఇబ్బంది పడుతున్నారు. వికారాబాద్ జిల్లాలోని ఒక జిన్నింగ్ మిల్లులోకి రైతులు 15 లోడ్ల పత్తి తీసుకెళ్లగా, కేవలం 2 లోడ్లకే తేమ శాతం సరిపోగా, మిగతా పత్తిని తిరిగి పంపివేశారు. ఒక్క లోడ్ తీసుకురావడానికే రవాణా, కూలీల ఖర్చులు కలిపి రూ.6,000 వరకు ఖర్చు అవుతోందని రైతులు చెబుతున్నారు. పత్తిని తిరిగి తీసుకెళ్లి ఎక్కడ ఉంచాలో తెలియక కష్టాల్లో కూరుకుపోతున్నారు.
కొత్తగా రైతులకు యాప్ కష్టాలు
అసలే కష్టాల్లో ఉన్న రైతులకు ‘కపాస్ కిసాన్ యాప్’ కష్టాలు వెంటాడుతున్నాయి. సాంకేతిక లోపాల వల్ల కూడా రైతులు గందరగోళానికి గురవుతున్నారు. క్రాప్ బుకింగ్ సమయంలో చిన్న తప్పు జరిగితే, ఆ వివరాలు యాప్‌లో కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. మార్కెట్‌కు వచ్చినప్పుడు కూలీలు దొరకకపోవడం వల్ల కూడా లోడ్లు ఆలస్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి 20 శాతం తేమ ఉన్నప్పటికీ పత్తి కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ కేంద్రం నుంచి సమాధానం వచ్చేవరకు వేచి చూస్తే, రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలి.
సీసీఐ కేంద్రాలు ప్రారంభించడంలో ఆలస్యం
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్రాలు సకాలంలో ప్రారంభించడం ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి తెరవడంతో దళారులు రంగంలోకి దిగుతున్నారు. పంటను దాచుకోలేక, మార్కెట్‌కు తీసుకుపోలేక, వ్యాపారులను ఆశ్రయించక రైతుకు తిప్పలు తప్పడం లేదు. రంగు మారింది. తేమ ఎక్కువగా ఉంది. నాణ్యత లేదంటూ సవాలక్ష కారణాలు చెప్పి, అగ్గువకు కొంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పత్తికి మద్దతు ధర రూ.8,110 చెల్లించాలి. కానీ మార్కెట్లో రూ.6,500కు మించి ఇవ్వడం లేదు. జిన్నింగ్ మిల్లు యాజమానులు, దళారులు, అధికారులు కుమ్మక్కై రైతులను భయాందోళనకు గురి చేస్తున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు ఎంతకో అంతకు అమ్ముకుంటున్నారు. సీసీఐ కేంద్రాల్లో అమ్ముకోవాలంటూ మంత్రి చెబుతున్న మాటలు కూడా నీటి మూటలవుతున్నాయి.
తడి ఉందని తక్కువ రేటు : గడ్డం యాదగిరి, రైతు మేడిపల్లి
వానలకు పత్తిలో తడి ఎక్కువగా ఉందని వ్యాపారులు తక్కువ ధర ఇస్తున్నారు. మరోపక్క ప్రభుత్వం కొంటలేదు. దీంతో చేసిన కష్టం, పెట్టిన పెట్టుబడి పోను ఏమీ వచ్చే పరిస్థితి లేదు. వానలకు చేను పాడైపోతుంది. కాతా, పూత వస్తలేదు.
క్వింటాకు రూ. ఆరువేలే ఇస్తున్నరు : మహిళా రైతు మంజుల
పత్తి క్వింటాలుకు రూ.ఆరు వేలే ఇస్తున్నరు. ఈసారి వానలకు తక్కువ పంటొచ్చింది. ఎరువులు, పురుగులు, దున్నటానికి, కలుపులు తీయడానికి, కూలీలకు పోను మిగిలేది ఉండదు. ఈసారి వానలకు పంట దెబ్బతిన్నది.
పత్తికి రూ. 475 బోనస్ చెల్లించాలి
పత్తిని మద్దతు ధరకు కొనడంతోపాటు క్వింటాల్ పత్తికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 475 బోనస్ చెల్లించాలి. అయితే వ్యాపారులు జిన్నింగ్ చేసి పత్తిని అధిక ధరలకు తిరిగి సీసీఐకి అమ్ముతూ లాభాలు గడిస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారుల లాభాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. సీసీఐ కొనుగోలు చేసిన పత్తిని జిన్నింగ్ మిల్లులకు రైతులతోనే రవాణా చేయించడం, పత్తి తెచ్చిన బస్తాలకు కనీసం డబ్బులు ఇవ్వడం లేదు. శాంపిల్స్ పేరిట పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోంది.
భూక్య చందునాయక్, రాష్ట్ర కన్వీనర్, తెలంగాణ పత్తి రైతుల సంఘం
నష్టపోయిన రైతుల వివరాలు నమోదు చేయాలి
అధిక వర్షాలకు పంట నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేయాలి. వారికి పరిహారం ఇవ్వాలి. 20శాతం తేమ వరకు కనీస మద్దతు ధరకు పత్తి కొనాలి. కపాస్ కిసాన్ యాప్ ఎలా వాడాలో అధికారులే గ్రామాలకు వెళ్లి రైతులకు వెంటనే నేర్పించాలి. యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత అధికారులు తీసుకోవాలి. కౌలు రైతులకు స్వయంగా రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం కల్పించాలి.
బి. కొండల్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు, రైతు స్వరాజ్య వేదిక



