గ్రూప్ దశ నుంచే కంగారూల నిష్క్రమణ
దర్జాగా సూపర్8కు శ్రీలంక, జింబాబ్వే
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. ప్రేమదాసలో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించిన జింబాబ్వే.. పల్లెకెలెలో ఎడతెగని వర్షంతో మాజీ చాంపియన్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. వర్షం కారణంగా మంగళవారం జింబాబ్వే, ఐర్లాండ్ గ్రూప్ దశ మ్యాచ్ రద్దుగా ముగిసింది. ఇరు జట్లు పాయింట్లు పంచుకోగా.. ఐదు పాయింట్లతో గ్రూప్-బి నుంచి శ్రీలంకతో పాటు జింబాబ్వే సూపర్8 బెర్త్ బుక్ చేసుకుంది. చివరి మ్యాచ్‌లో ఆసీస్ నెగ్గినా 4 పాయింట్ల వద్దే నిలిచిపోనుంది. 2024 టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించలేని జింబాబ్వే.. పొట్టి ప్రపంచకప్‌లో తొలిసారి సూపర్8కు చేరుకుంది.
నవతెలంగాణ-పల్లెకెలె
పసికూనలు అగ్రజట్లను వణికిస్తూ సూపర్8 రేసును రసవత్తరంగా మార్చాయి. చిన్నజట్ల సంచలనాలకు వరుణుడు జతకలవటంతో టీ20 ప్రపంచకప్ నుంచి అగ్రజట్టు, మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా నిష్క్రమించింది. బ్యాటర్లకు పరీక్షగా నిలుస్తున్న ప్రేమదాస స్టేడియంలో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో 23 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ఒమన్‌పై 8 వికెట్లతో నెగ్గిన జింబాబ్వే.. మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఓ ఫలితం తేలని మ్యాచ్‌తో 5 పాయింట్లు ఖాతాలో వేసుకుంది.
గ్రూప్ దశ ఆఖరు మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు శ్రీలంకతో జింబాబ్వే తలపడనుంది. శ్రీలంక 3 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి 6 పాయింట్లతో సూపర్8కు చేరుకుంది. శ్రీలంక, జింబాబ్వే మ్యాచ్‌తో సూపర్8 సమీకరణాలు మారే అవకాశం లేదు. ఆస్ట్రేలియా, ఒమన్‌తో ఆఖరు మ్యాచ్‌లో నెగ్గినా.. ఆ జట్టు పాయింట్లు 4కు చేరుకుంటాయి. గరిష్టంగా గ్రూప్‌లో మూడో స్థానానికి ఎగబాకేందుకు ఆస్కారం ఉంటుంది.
మ్యాచ్ వర్షార్పణం
జింబాబ్వే, ఐర్లాండ్ మ్యాచ్‌పై సహజంగా పెద్దగా అంచనాలు ఉండవు. కానీ ఈ మ్యాచ్ ఫలితంపై ఆస్ట్రేలియా భవితవ్యం ఆధారపడి ఉండటంతో అందరి దృష్టి పల్లెకెలెపై పడింది. మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ముందుకు సాగలేదు. కనీసం టాస్ వేయడానికి సైతం వీలు పడలేదు. షెడ్యూల్ సమయానికి రెండున్నర గంటల తర్వాత అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. జింబాబ్వే, ఐర్లాండ్‌లు చెరో పాయింటు పంచుకున్నాయి. మ్యాచ్‌కు ముందు నుంచే పిచ్‌పై కవర్లు కప్పి ఉంచటంతో ఆట సాగటంపై అనుమానాలు రేగాయి. నిలకడగా చిరుజల్లులు కురవటంతో మైదాన సిబ్బంది ఏమీ చేయలేకపోయారు.
ఆసక్తికరం ‘సూపర్8’
టీ20 ప్రపంచకప్ సూపర్8 గ్రూప్‌లకు ప్రీ సీడింగ్ ఇచ్చారు. ఓ గ్రూప్‌లో భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా ఉండగా.. మరో గ్రూప్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక ఉన్నాయి. ఈ ప్రీ సీడింగ్ జట్లలో ఏదేని జట్టు సూపర్8కు ముందే నిష్క్రమిస్తే.. ఆ గ్రూప్ నుంచి అర్హత సాధించిన జట్టును సూపర్8లో ప్రీ సీడింగ్ జట్టు స్థానంలో ఆడుతుంది. గ్రూప్-బి నుంచి శ్రీలంక అర్హత సాధించగా.. ఆస్ట్రేలియా స్థానంలో జింబాబ్వే వచ్చింది. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లతో కూడిన గ్రూప్ చావోరేవో మాదిరిగా ఉండేది.
ఇప్పుడు జింబాబ్వే రాకతో అగ్రజట్లకు కాస్త ఊరటతో పాటు భయమూ మొదలైంది. సూపర్8లో జింబాబ్వే ఈ నెల 23న ముంబయిలో వెస్టిండీస్‌తో, 26న చెన్నైలో భారత్‌తో, మార్చి 1న ఢిల్లీలో దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. గ్రూప్-ఏ నుంచి భారత్ సూపర్8కు చేరుకున్నా.. మరో స్థానం కోసం యుఎస్‌ఏ, పాకిస్తాన్ రేసులో ఉన్నాయి. నేడు గ్రూప్-ఏ ఆఖరు మ్యాచ్‌తో ఈ బెర్త్ తేలిపోనుంది. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లాండ్.. గ్రూప్-డి నుంచి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్8కు అర్హత సాధించాయి.



