Friday, October 31, 2025
E-PAPER
Homeఆటలుమెల్‌బోర్న్‌లోనూ వర్షం ముప్పు!

మెల్‌బోర్న్‌లోనూ వర్షం ముప్పు!

- Advertisement -

భారత్‌, ఆసీస్‌ రెండో టీ20 నేడు
మ. 1.45 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

ఐసీసీ ప్రపంచ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌, ఆస్ట్రేలియా టాప్‌-2లో ఉన్నాయి. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో అగ్ర జట్ల ముఖాముఖి పోరుపై సహజంగానే అభిమానుల్లో భారీ అంచనాలు. వరల్డ్‌కప్‌ రేసులో తమ ప్రణాళికలను అమలు చేసేందుకు ఇరు జట్లు ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కానీ ఎడతెగని వర్షంతో కాన్‌బెర్రా టీ20 రద్దుగా ముగిసింది. దీంతో భారత్‌, ఆస్ట్రేలియా నేడు మెల్‌బోర్న్‌లో మెగా ఫైట్‌కు సిద్ధమవుతున్నాయి.

నవతెలంగాణ-మెల్‌బోర్న్‌
భారత్‌, ఆస్ట్రేలియా మెగా సిరీస్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. మనూక ఓవల్‌లో తొలి టీ20 వర్షంతో ముందుకు సాగలేదు. దీంతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ కాస్త నాలుగు మ్యాచ్‌ల సవాల్‌గా మారింది. దీంతో తొలుత ఆధిక్యంలో నిలిచి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలనే వ్యూహంతో భారత్‌, ఆస్ట్రేలియా కనిపిస్తున్నాయి. అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం మెల్‌బోర్న్‌ ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. 90 వేల సామర్థ్యం కలిగిన ఈ స్టేడియం నేడు పూర్తిగా నిండిపోనుండగా.. వరుణుడు సైతం రంగ ప్రవేశం చేసేందుకు ఎదురుచూస్తున్నాడు. మెల్‌బోర్న్‌లో నేడు భారత్‌, ఆస్ట్రేలియా రెండో టీ20 మ్యాచ్‌ నేడు జరుగనుంది.

తుది జట్టు కూర్పుపై ఫోకస్‌
ఐసీసీ 2024 టీ20 ప్రపంచకప్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌. పొట్టి ఫార్మాట్‌లో టీమ్‌ ఇండియా పటిష్టంగా కనిపిస్తోంది. వర్షంతో రద్దైన కాన్‌బెర్రా మ్యాచ్‌లోనూ మనోళ్లు మంచి ప్రదర్శనే చేశారు. కానీ, తుది జట్టు కూర్పు తీవ్ర విమర్శలకు చోటిస్తోంది. పేస్‌ విభాగంలో భారత టీ20 ఫార్మాట్‌ ఉత్తమ పేసర్లు జశ్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌. ఈ ఇద్దరూ పవర్‌ప్లేలో, డెత్‌ ఓవర్లలో బంతి పంచుకుంటే ప్రత్యర్థి బ్యాటర్ల దూకుడుకు సులువుగా ముకుతాడు పడుతుంది. కానీ జట్టు మేనేజ్‌మెంట్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ను నిలకడగా బెంచ్‌కు పరిమితం చేస్తోంది. అర్ష్‌దీప్‌ సింగ్‌ స్థానంలో హర్షిత్‌ రానాను తుది జట్టులోకి తీసుకున్నారు. టీమ్‌ షీట్‌లో హర్షిత్‌ రానాను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నం.6 స్థానంలో ఉంచారు. దీంతో జట్టు మేనేజ్‌మెంట్‌, ప్రధానంగా చీఫ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌ వ్యక్తిగత అనుకూలతలపై తీవ్ర దుమారం రేగుతోంది. నేటి మ్యాచ్‌లోనైనా అర్ష్‌దీప్‌ సింగ్‌ను ఆడిస్తారా? లేదంటే మళ్లీ హర్షిత్‌ రానా వైపే మొగ్గు చూపుతారా? అనేది చూడాలి.

స్పిన్‌ విభాగంలో అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి ఉన్నారు. అయితే, ఆసీస్‌ పిచ్‌పై ముగ్గుర స్పిన్నర్లను తీసుకునే ఆలోచనపై భిన్నమైన వాదన వినిపిస్తోంది. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, కోచ్‌ గౌతం గంభీర్‌ తుది జట్టు కూర్పు విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాటర్‌గా తనేంటో మళ్లీ నిరూపించుకోవాల్సి ఉంది. ఇటీవల సూర్యకుమార్‌ గణాంకాలు దారుణంగా ఉన్నాయి. ఫామ్‌ కోల్పోయిన సూర్యకుమార్‌ యాదవ్‌ ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. నేడు సూర్యకుమార్‌ యాదవ్‌ మెగా ఇన్నింగ్స్‌పై కన్నేసి బరిలోకి దిగనున్నాడు. అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, తిలక్‌ వర్మ మంచి ఫామ్‌లో ఉన్నారు. సంజు శాంసన్‌ మిడిల్‌ ఆర్డర్లో కొత్త పాత్రలో ఇమిడిపోవాలనే ఆలోచనతో ఉన్నాడు. అక్షర్‌ పటేల్‌, శివం దూబెలు లోయర్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ బాధ్యత తీసుకోవాల్సి ఉంది.

ఉత్సాహంగా ఆసీస్‌
ఆతిథ్య కంగారూలు ఉత్సాహంగా ఉన్నారు. కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ పొట్టి ఫార్మాట్‌లో ఆసీస్‌ను దూకుడుగా నడిపిస్తున్నాడు. ట్రావిశ్‌ హెడ్‌, జోశ్‌ ఇంగ్లిశ్‌, టిమ్‌ డెవిడ్‌, మిచ్‌ ఓవెన్‌, మార్కస్‌ స్టోయినిస్‌లు ఫామ్‌లో ఉన్నారు. ఆసీస్‌ బ్యాటింగ్‌ భారం వీరిపైనే ఆధారపడి ఉంది. జోశ్‌ హాజిల్‌వుడ్‌, కున్హేమాన్‌, నాథన్‌ ఎలిస్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌లు బౌలింగ్‌ విభాగంలో కంగారూలకు కీలకం.

పిచ్‌, వాతావరణం
ఈ సీజన్‌లో మెల్‌బోర్న్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్‌ భారత్‌, ఆసీస్‌ టీ20 పోరు. మెల్‌బోర్న్‌లో స్క్వేర్‌ బౌండరీలు పెద్దగా, స్ట్రయిట్‌ బౌండరీలు చిన్నవిగా ఉంటాయి. బౌలర్లు అందుకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకోవాల్సి ఉంటుంది. సిడ్నీ మ్యాచ్‌ వర్షార్పణం కాగా.. మెల్‌బోర్న్‌లోనూ వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం మెండుగానే ఉంది. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకునేందుకు మొగ్గు చూపవచ్చు.

తుది జట్లు (అంచనా)
భారత్‌ : అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), శివం దూబె, అక్షర్‌ పటేల్‌, హర్షిత్‌ రానా, కుల్‌దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, జశ్‌ప్రీత్‌ బుమ్రా.
ఆస్ట్రేలియా : ట్రావిశ్‌ హెడ్‌, మిచెల్‌ మార్ష్‌ (కెప్టెన్‌), జోశ్‌ ఇంగ్లిశ్‌ (వికెట్‌ కీపర్‌), టిమ్‌ డెవిడ్‌, మిచ్‌ ఓవెన్‌, మార్కస్‌ స్టోయినిస్‌, జోశ్‌ ఫిలిప్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌, నాథన్‌ ఎలిస్‌, మాట్‌ కున్హేమాన్‌, జోశ్‌ హాజిల్‌వుడ్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -