ఇంట్లో వారందరి బాగు కోరుకోవడమే కాదు.. ఎవరికి ఏ అవసరమొచ్చినా తీర్చడానికి ముందుకొస్తాం. ఎలాంటి ఆర్థిక ఇబ్బంది వచ్చినా గుట్టు చప్పుడు కాకుండా పిల్లల కడుపు నింపేందుకు అనేక తంటాలు పడతాం. మరి మన బాధ్యతలన్నీ సమర్థంగా నిర్వహించడానికి అవసరమయ్యే ఆర్థిక శక్తిని సమకూర్చు కోవల్సిన అవసరం మనపై వుంది. అప్పుడే మన కుటుంబానికీ, మనకీ భరోసా. మరి దాని కోసం ఏం చేయాలో తెలుసుకుందాం…
కొంతమంది మహిళలు తమ వ్యక్తిగత, కుటుంబ పరిస్థితుల రీత్యా అప్పటిదాకా తాము చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేస్తుంటారు. మరికొంతమంది సంపాదించాల్సిన అవసరం లేదంటూ ఈ నిర్ణయం తీసుకుంటుంటారు. ఈ రెండూ ఆర్థికంగా చేటు చేసే నిర్ణయాలే అంటున్నారు నిపుణులు. తద్వారా మొదట్లో బాగానే ఉన్నా భవిష్యత్తులో ప్రతి చిన్న అవసరానికీ భర్త మీదే ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి పెళ్లైనా ఉద్యోగం మానకపోవడమే ఉత్తమం. తద్వారా భవిష్యత్తులో ఒంటరిగా జీవించాల్సి వచ్చినా ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు.
పెట్టుబడులు పెట్టాలి?
ఆర్థిక విషయాల్లో పెళ్లి కాక ముందు తండ్రిపై, పెళ్లయ్యాక భర్తపై ఆధారపడే అమ్మాయిలు ఈ కాలంలోనూ కొందరున్నారు. ఆర్జన వరకు బాగానే ఉన్నా డబ్బు పొదుపు-మదుపు విషయాల్లో అవగాహన లోపమే ఇందుకు కారణం. అయితే ఇలా ప్రతి చిన్న దానికీ వారిపైనే ఆధారపడడం వల్ల వాళ్లు అందుబాటులో లేనప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి డబ్బుల్ని ఎందులో పొదుపు చేయాలి? లాభాలు ఆర్జించాలంటే వేటిలో పెట్టుబడులు పెట్టాలి? వంటి ప్రాథమిక విషయాలపై అవగాహన పెంచుకోవడం అత్యవసరం అంటున్నారు నిపుణులు. అలాగని ఒకేసారి అన్ని విషయాల గురించి తెలుసుకోవడం ఎవరి వల్లా సాధ్యం కాదు. కాబట్టి నిపుణుల సలహాలు పాటిస్తూ ఒక్కో విషయాన్ని ఒంట బట్టించుకుంటే ఆర్థిక విషయాల్లో మరొకరిపై ఆధారపడాల్సిన పరిస్థితి రాదు.
మీకోసం కూడా..
‘ఏ అవసరానికైనా వస్తుంది’ అని కిచెన్ డబ్బాలోనో, చీరల మాటునో డబ్బు దాస్తుంటారు చాలా మంది మహిళలు. ఇంట్లో ఎవరడిగినా తాము దాచుకున్న డబ్బును తీసిస్తుంటారు. మరి మీ సంగతేంటి? ఉద్యోగినులైతే.. వెంటనే డీమ్యాట్ ఖాతా ప్రారంభించండి. డెట్ మ్యూచువల్ ఫండ్లలో కొంత మొత్తం మదుపు చేసి, నెలనెలా డబ్బులు వెనక్కి వచ్చేలా చూసుకోవచ్చు. లేదా ఈక్విటీ ఫండ్ డివిడెండ్ ప్లాన్లలో మదుపు చేయొచ్చు. గహిణులకు వీటి గురించి పెద్దగా అవగాహన ఉండదు. అందుకే ఎప్పుడైనా కొంత మొత్తం చేతికి అందినప్పుడు బ్యాంకులో నాన్ క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే నెలనెలా వడ్డీ పొందవచ్చు. కాస్త పెద్దవాళ్లయితే పోస్టాఫీసులో సీనియర్ సిటిజన్ పొదుపు ఖాతానో, నెలవారీ ఆదాయ పథకం(ఎంఐఎస్)నో ఎంచుకోవచ్చు. నెలనెలా డబ్బులు మదుపు చేసే వీలుంటే.. మ్యూచువల్ ఫండ్లలో సిప్, బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ చేసినా మంచిదే. ఆరోగ్య బీమా పాలసీని తీసుకోండి. మహిళల ప్రత్యేక అవసరాల దష్ట్యా బీమా సంస్థలు వారి కోసం ప్రత్యేక ఆరోగ్య పాలసీలు అందుబాటులోకి తెచ్చాయి. వాటిల్లో గహిణుల కోసం తెచ్చిన సరళ్ జీవన్ బీమా పాలసీ ఒకటి. దాన్నీ ప్రయత్నించొచ్చు.
తల్లి కాబోతుంటే…
అమ్మ కాబోతున్న సమయంలో మహిళలకు ఎన్నెన్నో భావోద్వేగాలు. పిల్లల భవిష్యత్తుపై ఎన్నో ప్రణాళికలు. కొత్తగా వచ్చే ఖర్చులు ఒకటైతే.. ఇంటి బాధ్యతల దష్ట్యా కొందరు మహిళలకు కెరియర్ త్యాగం చేయక తప్పని పరిస్థితి. ఆదాయం ఒక్కసారిగా ఆగిపోతే.. ఆర్థికంగా భర్తపై ఆధారపడాల్సి వస్తుంది. అంటే ఆర్థిక స్వేచ్ఛ కరవైనట్లే. అందుకే దానికీ సిద్ధమవ్వాలి. అప్పటి వరకూ మీ దగ్గరున్న మొత్తాన్ని ఏదైనా ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా డెట్ ఫండ్లలో మదుపు చేసి, ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకోండి. దీనికోసం బ్యాంకులో రిలేషన్‌షిప్ మేనేజర్ సహాయం తీసుకోవచ్చు. ఇది మళ్లీ మీరు ఉద్యోగంలో చేరేంత వరకూ మీకు ఆర్థిక భరోసానిస్తుంది.
ఒంటరిగా జీవిస్తుంటే…
కారణాలు ఏమైనా ఇప్పుడు ఒంటరి తల్లుల సంఖ్యా బాగా పెరుగుతోంది. పిల్లల ఆర్థిక అవసరాలను తీర్చడంతోపాటు, తమ ఆర్థిక రక్షణ గురించి కూడా అలాంటి మహిళలు తప్పక ఆలోచించుకోవాలి. అందుకే మీ పేరిట జీవిత బీమా పాలసీ తీసుకోండి. ఇంకా పిల్లలతో కలిసి ఫ్యామిలీ ఫ్లోటర్ ఆరోగ్య బీమా పాలసీ కచ్చితంగా ఉండాలి. కనీసం ఆరు నెలల ఖర్చులను అత్యవసర నిధిగా అందుబాటులో ఉంచుకోవాలి. క్రమానుగత పెట్టుబడి విధానంలో సాధ్యమైనంత మొత్తాన్ని మదుపు చేసేందుకు ప్రయత్నించాలి. పిల్లలతోపాటు మీ భవిష్యత్తు గురించీ ఆలోచించాలి. మదుపులో మీ పదవీ విరమణ ప్రణాళికలకీ ప్రాముఖ్యం ఇవ్వాలి. ఆదాయం ఆగిపోయిన రోజున మీకంటూ భరోసా కల్పించే ఏర్పాటు చాలా అవసరం. అలాగే వీలునామా రాయడం, ప్రతి పెట్టుబడి పథకంలో కచ్చితంగా పిల్లలను నామినీగా చేర్పించడం మర్చిపోవద్దు.
ఈ సూత్రం పాటించండి..
ఆర్జించే తల్లులై ఇంటి బాధ్యత పంచుకోవడం తప్పనిసరి అయితే 40:30:30 సూత్రాన్ని పాటించండి. అంటే మీ ఆదాయంలో 40 శాతాన్ని ఇంటి ఖర్చులకు ఇవ్వండి. 30 శాతాన్ని మీ అవసరాలకు కేటాయించుకోండి. మిగిలిన 30 శాతాన్ని మీ పదవీ విరమణానంతర అవసరాల కోసం వివిధ పథకాల్లో మదుపు చేయండి. ఇందులో కొంత మొత్తాన్ని గోల్డ్ ఈటీఎఫ్‌లు, సార్వభౌమ పసిడి బాండ్లలో పెట్టుబడి పెడితే ఉపయోగకరంగా ఉంటుంది.