Saturday, October 18, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలురాజ్‌భవన్‌ ముట్టడి ఉద్రిక్తం

రాజ్‌భవన్‌ ముట్టడి ఉద్రిక్తం

- Advertisement -

బీసీ రిజర్వేషన్లపై కేంద్రం వైఖరికి నిరసనగా సీపీఐ(ఎం) నేతల ఆందోళన
గవర్నర్‌ బంగ్లా ముందు నాయకుల బైటాయింపు
ప్రతినిధి బృందాన్ని లోనికి అనుమతించని జిష్ణుదేవ్‌ వర్మ
ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
జాన్‌వెస్లీ సహా పలువురు నాయకుల అరెస్ట్‌
గవర్నర్‌ వైఖరికి నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తలపెట్టిన చలో రాజ్‌భవన్‌ ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ నుంచి సోమాజిగూడ వరకు ర్యాలీగా వెళ్లి గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించేందుకు వెళ్తున్న వారిని పోలీసులు మెట్రో రెసిడెన్సీ వద్ద అడ్డుకు న్నారు. అప్పటికే బారికేడ్లు వేసి ముందుకెళ్లకుండా నిలిపివేయడంతో నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో బారికేడ్లను తొలగించుకుని వెళ్లేందుకు కార్యకర్తలు చేసిన ప్రయత్నాలను పోలీసులు భగం చేశారు. వారిని బలవంతంగా అడ్డుకున్నారు.అక్కడి నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ నేతృత్వంలో ప్రతినిధి బృందం మాత్రం వెళ్లేందుకు అనుమతించారు. అయితే వారిని కూడా లోపలికి వెళ్లకుండా రాజ్‌భవన్‌ గేటు వద్దే భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.

దీనితో సీపీఐ(ఎం) నేతలు అక్కడే బైఠాయించారు. బీసీలకు వ్యతిరేకంగా గవర్నర్‌ మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారని నిరసిస్తూ తమను లోనికి అనుమతించే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని తేల్చిచెప్పారు. గవర్నర్‌ బంగ్లా గేటు ముందే రోడ్డుపై బైటాయించి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ బీసీ వ్యతిరేక విధానాలు వీడాలంటూ నినాదాలు చేశారు. గవర్నర్‌ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తు న్నారని నినదించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీనితో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు జాన్‌వెస్లీ సహా నాయకులందరినీ బలవంతంగా అరెస్ట్‌ చేసి వాహనాల్లో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

అంతకు ముందు మెట్రో రెసిడెన్సీ వద్ద రోడ్డు మీదే బైఠాయించిన సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలను కూడా పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించారు. దీనితో అక్కడ కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసులకు మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగాయి. పోలీసులు నిరసనకారుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. వారిని బలవంతంగా లాక్కెళ్లి, పోలీసు వాహనాల్లో పడేశారు. ఈ క్రమంలో ఒక కార్యకర్త స్పృహ తప్పి పడిపోయారు. తాము శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో వినతిపత్రం సమర్పించేందుకు వచ్చామని చెప్తున్నా, పోలీసులు వినిపించుకోలేదు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలకు దెబ్బలు తగిలాయి.

అఖిలపక్ష నిర్ణయాలకు ఒకే
రాష్ట్ర ప్రభుత్వం కేవలం న్యాయపోరాటాలకే పరిమితం కావడం సరిపోదని జాన్‌వెస్లీ అభిప్రాయపడ్డారు. అందరిని కలుపుకుని కేంద్రంపై ఉద్యమం చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్షం తీసుకునే నిర్ణయాలకు సీపీఐ(ఎం) మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిన తర్వాతే జీవోను తీసుకొచ్చిందని తెలిపారు. రిజర్వేషన్ల సీలింగ్‌కు సంబంధించి ఆయా కోర్టుల తీర్పులను సగమే ప్రస్తావిస్తూ, ఉద్దేశపూర్వకంగా మిగిలిన రిజర్వేషన్ల అనుకూల ప్రస్తావనలు ఉటంకించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ సంతకం పెట్టకుండా బీజేపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ గవర్నర్‌ ఆమోదించనందువల్లే హైకోర్టు స్టే విధించిందని తెలిపారు.

రాష్ట్రంలోని ఇద్దరు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. బీసీ వ్యతిరేక ధోరణని మానుకోకపోతే బీజేపీని బొంద పెట్టడం ఖాయమని హెచ్చరించారు. చలో రాజ్‌భవన్‌ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు టీ.జ్యోతి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టీ.సాగర్‌, మహ్మద్‌ అబ్బాస్‌, బండారు రవికుమార్‌, సీనియర్‌ నాయకులు నంద్యాల నర్సింహారెడ్డి, డీజీ నర్సింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎమ్‌వీ రమణ, పీఆశయ్య, ఆర్‌ శ్రీరాంనాయక్‌, టీ స్కైలాబ్‌బాబు, బీ ప్రసాద్‌, ఉడుత రవీందర్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల కార్యదర్శులు పీ సత్యం, పగడాల యాదయ్య, హైదరాబాద్‌ సెంట్రల్‌ కమిటీ కార్యదర్శి ఎమ్‌ వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు. గవర్నర్‌ వ్యవహారశైలిని వారు తీవ్రంగా ఆక్షేపిస్తూ, బీజేపీ ద్వంద్వ వైఖరిని విమర్శించారు.

గవర్నర్‌ చర్చించేందుకు సిద్ధంగా లేరు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
రాజ్‌భవన్‌ గేటు ముందు రోడ్డుపై బైటాయించిన జాన్‌వెస్లీ మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు సిద్ధంగా లేని గవర్నర్‌ దానిపై కనీసం చర్చించేందుకు కూడా ఇష్టపడటం లేదన్నారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్‌ కేంద్రానికి అనుకూలంగా ఉంటున్నారని విమర్శించారు. నెలన్నరకుపైగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు.

మూడు రోజుల క్రితమే గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ అడిగామనీ, అయితే బీసీల గురించి మాట్లాడేందుకు వస్తే కలవడానికి విముఖత వ్యక్తం చేశారని తెలిపారు. బీసీలకు, సామాజిక న్యాయానికి, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మనువాదంతో వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గవర్నర్‌ వైఖరికి నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం, మోటార్‌ సైకిల్‌ ర్యాలీలతో పాటు వివిధ రూపాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. గవర్నర్‌ తీరును మార్చుకోకుంటే ఆయన బదిలీని కోరాల్సి వస్తుందని హెచ్చరించారు.

బంద్‌కు బీజేపీ మద్దతు మోసపూరితం
బంద్‌కు బీజేపీ మద్దతు మోసపూరితమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఖైరతాబాద్‌ వద్ద చలో రాజ్‌భవన్‌ ర్యాలీ ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు కేంద్రం పరిధిలో ఉందనీ, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చే అధికారం కేంద్రానికి ఉందని తెలిపారు. గవర్నర్‌ ఆర్డినెన్స్‌కు అనుకూలమా? వ్యతిరేకమా? అని చెప్పకుండా కేంద్రానికి పంపించారని తప్పుపట్టారు. బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్‌కు మద్దతిచ్చిన బీజేపీ, కేంద్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లనుఅడ్డుకుంటూ నాటకాలాడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బంద్‌కు బీజేపీ మద్దతివ్వడం మోసపూరితమని చెప్పారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు కావాలనే చిత్తశుద్ధి ఉంటే బీజేపీకి వ్యతిరేకంగా బంద్‌ నిర్వహించాలని ఆయన సూచించారు. లేకపోతే సీపీఐ (ఎం) ఒంటరిగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. అప్పటికీ కేంద్రం దిగిరాకుంటే కలిసొచ్చే శక్తులను కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధతం చేస్తామని హెచ్చరిం చారు. బీసీలకు సమాన అవకాశాలి వ్వాలని అన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్న సమయంలో గవర్నర్‌ అడ్డుపడటం సరికాదన్నారు. మతోన్మాద, కులోన్మాద, పురుషాధిక్య, కార్పొరేట్ల అను కూల, మనవాద బీజేపీని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా బీసీ జేఏసీ రాష్ట్ర బంద్‌ చేపడితే అందులో సీపీఐ(ఎం) పాల్గొంటుందని జాన్‌వెస్లీ మరోసారి స్పష్టం చేశారు.

అరెస్టులకు తమ్మినేని ఖండన
చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ సహా ఇతర నాయకులను అరెస్టు చేయడాన్ని, గవర్నర్‌ నిరంకుశ వైఖరిని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -