– రాజీనామా ఆమోదం ఎత్తుగడేనా?
– శివసేనలో చేరతారనే ప్రచారం
నవతెలంగాణ – ధూల్ పేట్
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజకీయం పయనం ఎటువైపు.. కొత్తగా పార్టీ పెట్టడమా.. వేరే పార్టీలోకి మారడమా.. అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గ్రేటర్‌లో బీజెపీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ పార్టీకి రాజీనామా చేయడం, దానిని ఆ పార్టీ అధిష్టానం కూడా ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే, గతంలో రాజీనామా చేస్తే.. మళ్లీ ఆయనను పిలిచి పార్టీలోకి చేర్చుకుంది. మళ్లీ అలాంటిదే జరుగుతుందా? అన్న చర్చ నడుస్తోంది. తెలంగాణలో బీజేపీకి ప్రస్తుతమున్న ఎమ్మెల్యేలలో సీనియర్ అయిన రాజాసింగ్ పార్టీకి దూరం కావడం గ్రేటర్‌లో ఆ పార్టీ బలంపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. ఎందుకు పార్టీకి రాజీనామా చేశారు..? ఆ పార్టీ అధిస్థానం ఎలాంటి నోటీసులు, వివరణలూ తీసుకోకుండానే రాజీనామాను ఆమోదించడంతో పార్టీ పూర్తిగా ఆయనను వద్దనుకుంటుందా..! రాజకీయ ఎత్తుగడలో భాగమా అని ఆ పార్టీ వర్గాల్లోనే అనుమానాలు ఉన్నాయి.
సొంతంగా పార్టీయా..?
గ్రేటర్ హైదరాబాద్‌లో బీజెపీకి కీలక నాయకుడిగా ఉన్న రాజాసింగ్.. ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టే అవకాశాలు లేకపోలేదనేది కూడా సీనియర్ రాజకీయ నేతలు పేర్కొంటున్నారు. ‘తాను హిందుత్వాన్ని రక్షించాలనే లక్ష్యంతో బీజేపీలో చేరానని.. ఏ పదవి, అధికారం ఆశించి రాజీనామా నిర్ణయం తీసుకోలేదు.. చివరి శ్వాస వరకు హిందూ సమాజ హక్కుల కోసం తన గళం వినిపిస్తూనే ఉంటాను” అని ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. దీంతో ఆయన హిందూ నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నద్ధమైనట్టు వెల్లడవుతోంది. ఇదంతా ఆయన రాజకీయంలో భాగం తప్ప.. మరోటి కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
శివసేన వైపు ..
మహారాష్ట్రలో హిందూ భావజాలం ప్రధాన ఎజెండా నడుస్తున్న ‘శివసేన’ పార్టీలో రాజాసింగ్ చేరే అవకాశాలు ఉన్నట్టు కూడా ఆయన అనుచరుల నుంచి వినిపిస్తోంది. శివసేన పార్టీ శాఖను తెలంగాణలో ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా కార్యకలాపాలను నిర్వహించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ప్రస్తుతం సొంతంగా పార్టీ పెట్టడం అంత తేలిక కాదనీ, ఏదైనా పార్టీలో చేరి ఆ పార్టీ ద్వారా రాష్ట్రంలో తన వాణిని, బాణీని వినిపించడం ద్వారా రాష్ట్రంలో రాజాసింగ్ ఒక ప్రధాన రాజకీయ నాయకుడిగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తారని పలువులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆయన రాజీనామా ఆమోదం వెనుక ఏదో జరుగుతోందని, ప్రజలను మభ్య పెట్టడా నికే బీజేపీ, రాజాసింగ్ రాజీనామా పరిణామాలు అని అనుకోవడం కొసమెరుపు. హిందూత్వ ప్రచారాన్ని తెలంగాణలో మరో విధంగా తీసుకెళ్లేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం ఈ రకమైన ఎత్తుగడ వేసి ఉంటుందన్న అభిప్రాయాన్నీ కొట్టిపారేయలేమని పలువురు అంటున్నారు. ఆయన రాజీనామా ఆమోదం పైనా బీజేపీ నేతలుగానీ, రాజాసింగ్‌గానీ వ్యతిరేకంగా స్పందించకపోవడం గమనార్హం.