Monday, March 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగంగాదేవిపల్లిని జాతీయి స్థాయిలో నిలిపిన గొప్ప వ్యక్తి రాజమౌళి

గంగాదేవిపల్లిని జాతీయి స్థాయిలో నిలిపిన గొప్ప వ్యక్తి రాజమౌళి

- Advertisement -

తెలంగాణ గ్రామీణ శిక్షణ కేంద్రానికి ‘రాజమౌళి’ పేరు : సంస్మరణ సభలో మంత్రి దనసరి సీతక్క

నవతెలంగాణ- గీసుగొండ
కూసం రాజమౌళి సాధారణ వ్యక్తిగా ఉండి, సామాన్యులను ఏకం చేసి గంగాదేవిపల్లిని జాతీయ స్థాయిలో ఆదర్శ గ్రామంగా నిలిపిన గొప్ప నాయకుడని పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క అన్నారు. రాజమౌళి సేవలను రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు పరిచయం చేసేలా చర్యలు తీసుకుంటామని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తెలంగాణ గ్రామీణ శిక్షణ కేంద్రానికి ఆయన పేరు పెట్టేలా కృషి చేస్తామని చెప్పారు. వరంగల్‌ జిల్లా గీసుగొండ గంగాదేవిపల్లి గ్రామంలో ఆదివారం బాలవికాస ఆధ్వర్యంలో కమ్యూనిస్టు నేత, మాజీ సర్పంచ్‌ కూసం రాజమౌళి సంస్మరణ సభ నిర్వహించారు.

బాలవికాస ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సింగిరెడ్డి శౌరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌ రెడ్డితో కలిసి మంత్రి హాజరయ్యారు. రాజమౌళి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో మంత్రి సీతక్క మాట్లాడారు. తాను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం రాజమౌళితో కలిసి నేపాల్‌ దేశానికి వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేశారు. ఆయన మృతి గ్రామానికే కాకుండా పంచాయతీరాజ్‌ వ్యవస్థకు కూడా తీరని లోటని అన్నారు.

‘పుట్టుక, మరణం మన చేతుల్లో లేకపోయినా జీవించినంత కాలం మంచి పనులు చేయడం మన బాధ్యత. రాజమౌళి తన ఆలోచనలతో ప్రజలను భాగస్వామ్యం చేసి అభివృద్ధి సాధించారు. ఆయన వద్ద సంపదలేమైనా లేకపోయినా ఐక్యత అనే గొప్ప బలం ఉంది’ అని తెలిపారు. మహిళల ఐక్యతతో కుటుంబం నుంచి దేశం వరకు అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కూసం స్వరూప రమేష్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, జడ్పీ సీఈఓ రామ్‌రెడ్డి, తహసీల్దార్‌ ఎండీ రియాజుద్దీన్‌, ఎంపీఓ పాక శ్రీనివాస్‌, పరకాల అధికార ప్రతినిధి చాడ కొమురరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్‌ ఏయంసి డైరెక్టర్‌ ఆకుల రుద్రప్రసాద్‌. యంసిపిఐ(యూ) నాయకులు గోనె కుమారస్వామి, ప్రజాప్రతినిధులు, రాజమౌళి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -