ఆలయ ఈవో–ఉద్యోగుల మధ్య చిచ్చు
ఎమ్మెల్యే వద్ద మొరపెట్టుకున్న ఉద్యోగులు
రమాదేవి తీరుపై రగిలిపోతున్న సిబ్బంది
నవతెలంగా వేములవాడ
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మరోసారి వివాదాల కుదుపులో చిక్కుకుంది. ఆలయ ఈవో రమాదేవి వ్యవహార శైలిపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈవో తీరుతో పని చేయలేకపోతున్నామని ఆవేదన చెందిన ఆలయ ఉద్యోగులు, శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను ఆశ్రయించారు. విధి నిర్వహణ పేరుతో ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారని, నిర్ణీత సమయానికి మించి పని చేయిస్తూ మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆలయ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు మండిపడ్డారు. ఉద్యోగులు–సిబ్బందిని పరస్పరం చీల్చేలా ఈవో వ్యవహారం సాగుతోందని, ఆమె తీరుతో ఆలయంలో పని వాతావరణం పూర్తిగా విషమంగా మారిందని ఎమ్మెల్యే ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు.
రోజురోజుకూ పెరుగుతున్న ఒత్తిడితో మానసికంగా కుంగిపోతున్నామ ని, ప్రశ్నించే వారిపై వివక్ష చూపుతున్నారని ఉద్యోగులు తీవ్రంగా ఆరోపించారు. ఈ పరిస్థితులు కొనసాగితే ఆలయ పరిపాలన పూర్తిగా కుదేలయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.
ఉద్యోగుల విన్నపాలను శ్రద్ధగా విన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు నాలుగు రోజుల్లో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇప్పటికే పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న రాజన్న ఆలయ పాలన మరోసారి ఉద్యోగుల ఆగ్రహానికి కేంద్రంగా మారడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. దేవస్థాన ప్రతిష్ఠకు భంగం కలిగించే ఈ తరహా వివాదాలపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.



