– కుల దురహంకార హత్యను ఖండిస్తూ.. 20, 21 తేదీల్లో రాష్ట్రవ్యాప్త నిరసనలు : వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు
నవతెలంగాణ-షాద్‌నగర్
రాజశేఖర్ హత్య జరుగుతుందని తెలిసి పోలీసులు విచారణలో జాప్యం చేశారని, ఇక్కడ నిర్లక్ష్యమే ప్రధాన పాత్ర పోషించిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో ఎర్ర రాజశేఖర్ కుటుంబ సభ్యులను సంఘం జిల్లా నాయకులతో కలిసి ఆయన పరామర్శించారు. అనంతరం విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో మాదిగ ఐక్యవేదిక, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజశేఖర్‌ను అర్ధరాత్రి కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడి అత్యంత దారుణంగా దహనం చేయడం ఘోరమని అన్నారు. నెలరోజుల క్రితమే ఈ కేసు వ్యవహారం పోలీసుల దృష్టిలో ఉందని, కానీ బాధితుని కుటుంబాన్నే టార్గెట్ చేసిన పోలీసులు వారిని బెదిరించడం, పెండ్లికి నిరాకరించినట్టు తెలిపారు. వెంకటేష్(అమ్మాయి తండ్రి) మృతుని ఇంటికి వెళ్లి రాజశేఖర్‌ను బయటికి తీసుకువెళ్లినప్పుడే అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిందని, అయిన ప్పటికీ విచారణలో నిర్లక్ష్యం చేయడం వల్లనే రాజశేఖర్ హత్య చేయబడ్డాడని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికి 142 కుల దురహంకార హత్యలు జరిగాయన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పందించక పోవడం దారుణమన్నారు. ఇకనైనా దీనిపై శాసనసభలో చర్చించి కులాంతర వివాహాల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆ ఘటనను నిరసిస్తూ ఈనెల 20, 21న రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలిపిస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అంజయ్య, ప్రధాన కార్యదర్శి కందుకూరి జగన్, ఉపాధ్యక్షులు శ్రీనునాయక్, సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శి ఎన్.రాజు, బిసా సాయిబాబు, కొంగరి నర్సింలు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్‌నాయక్, బేరి శ్రీనివాస్, ప్రజా, దళిత, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల నిర్లక్ష్యం వల్లే రాజశేఖర్ హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



