మండలంలో 500 పైగా దరఖాస్తుదారులు
నవతెలంగాణ – మల్హర్ రావు
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం రూపొందించిన రాజీవ్ యువ వికాసం పథకానికి ఎట్టకేలకు నిధుల కేటాయింపు జరిగింది. డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.6 వేల కోట్లను రాజీవ్ యువ వికాసం పథకానికి కేటాయించడంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నా యి. నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకానికి 2025లో ప్రభుత్వం భారీ మొత్తంలో దరఖాస్తులను స్వీకరించింది.
ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొ రేషన్లకు మండలంలో 500 పైగా దరఖాస్తులు అందాయి. ఆయా సామాజిక వర్గాల వారికి కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలను రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున అందించేందుకు ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. అయితే అప్పట్లో నిధులకే యువ వికాసం కెటాయింపులు లేకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో పథకం అమలుకు బ్రేక్ పడింది.
చిన్న రుణాలకు వంద శాతం రాయితీ…
ఈ పథకం ద్వారా రూ.50 వేల వరకు వందశాతం, రూ.లక్ష వరకు ఇచ్చే రుణానికి 90 శాతం, రూ.2 లక్షల వరకు రుణాలకు 80 శాతం, రూ.4 లక్షల వరకు రుణాలకు 70 శాతం రాయితీని ప్రకటించారు. బ్యాంకు లింకేజీ ద్వారానే రుణాలను అందించాలని ప్రభుత్వము నిర్ణయించగా రుణ ప్రక్రియ పూర్తి కాగానే రాయితీ సొమ్మును అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రూ.4 లక్షల వరకు రుణం కావాలని దరఖాస్తులు అందించారు. నిధులు లేకపోవడంతో పథకం అమలు ముందుకు సాగలేదు. తాజాగా రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించడంతో రాజీవ్ వికాసం రాయితీ రుణాలు అందుతాయని యువత ధీమా వ్యక్తం చేస్తున్నారు.



