ప్రమాణస్వీకారం చేయించిన రాష్ట్రపతి
కేంద్రంతో పాటు జమ్మూ కాశ్మీర్‌లోనూ కీలక పదవులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి రాజ్‌కుమార్ గోయల్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో ప్రమాణం చేయించారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాక ృష్ణన్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సహా పలువురు హాజరయ్యారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని కమిటీ రాజ్‌కుమార్ గోయల్ పేరును ప్రతిపాదించింది.రాజ్‌కుమార్ గోయల్ 1990 బ్యాచ్ అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం-కేంద్రపాలిత ప్రాంతాల (ఏజీఎంయూటీ) క్యాడర్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారి. ఆయన ఆగస్టు 31న కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలోని న్యాయ విభాగ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. హౌం శాఖలో కార్యదర్శి (సరిహద్దు నిర్వహణ)గా కూడా పనిచేశారు. కేంద్రంతో పాటు జమ్మూ కాశ్మీర్‌లోనూ కీలక పదవులను నిర్వహించారు.
సీఐసీ సభ్యులు వీరే
కేంద్ర సమాచార కమిషన్‌కు ఒక సీఐసీ నేతృత్వం వహిస్తారు. గరిష్టంగా 10 మంది సమాచార కమిషనర్లు ఉంటారు. ప్రస్తుతం ఆనంది రామలింగం, వినోద్ కుమార్ తివారీ సమాచార కమిషనర్లుగా ఉన్నారు. దీంతో మిగిలిన ఖాళీలకు మాజీ రైల్వే బోర్డు చీఫ్ జయ వర్మ సిన్హా, ఇంటెలిజెన్స్ బ్యూరో, హౌం మంత్రిత్వ శాఖ, క్యాబినెట్ సెక్రెటేరియట్‌లో కీలక పదవులు నిర్వహించిన మాజీ ఐపీఎస్ అధికారి స్వాగత్ దాస్, మాజీ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ (సీఎస్‌ఎస్) అధికారి సంజీవ్ కుమార్ జిందాల్, మాజీ ఐఏఎస్ అధికారి సురేంద్ర సింగ్ మీనా, మాజీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ఖుష్వంత్ సింగ్ సేథీను సమాచార కమిషనర్లుగా నియమించాలని కమిటీ సిఫార్సు చేసింది. సీనియర్ జర్నలిస్టులు పీఆర్ రమేష్, అశుతోష్ చతుర్వేదితో పాటు పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ) సభ్యురాలు (చట్టపరమైన) సుధా రాణి రేలంగిను కూడా సమాచార కమిషనర్లుగా నియమించేందుకు కమిటీ ప్రతిపాదించింది.
సీఐసీలో ప్రస్తుతం 30,838 పెండింగ్ కేసులు
సెప్టెంబర్ 13న హీరాలాల్ సమారియా పదవీకాలం ముగిసిన తర్వాత సీఐసీ పదవి ఖాళీగా ఉంది. సీఐసీలో ప్రస్తుతం 30,838 పెండింగ్ కేసులు ఉన్నాయి. 2014 నుంచి సీఐసీ పదవి చాలాసార్లు ఖాళీగా ఉంటోంది. ఈ పదవి కోసం మే నెలలో ప్రకటన జారీచేయగా 83 దరఖాస్తులు రాగా, కమిషనర్ల పోస్టులకు 161 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంతకుముందు కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ), కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) సారథుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి లోక్‌సభ విపక్షనేత రాహుల్‌గాంధీ తన అసమ్మతి లేఖను ప్రభుత్వానికి అందించిన విషయం విదితమమే.



