వైసీపీ వాకౌట్
చర్చలో 11 పార్టీలు..18 మంది సభ్యులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదముద్ర ప్రక్రియ ముగిసింది. అనంతరం ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపనుంది. ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తరువాత గెజిట్ నోటిఫికేషన్ విడుదలకానుంది. గురువారం రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రారు బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అనంతరం రాజ్యసభ చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్ బిల్లుపై చర్చకు అనుమతి ఇచ్చారు. అమరావతి చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చలో 11 పార్టీలు నుంచి 18 మంది సభ్యులు పాల్గొన్నారు. అయితే వైసీపీ రాజ్యసభలో కూడా బిల్లును వ్యతిరేకించి వాకౌట్ చేసింది.
రెండు రాష్ట్రాలతో కేంద్రం ఆటలు : రేణుకా చౌదరి
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి చర్చను ప్రారంభిస్తూ ఏపీ రాజధాని బిల్లు రైతుల విజయమని అన్నారు. ఉద్యమ సమయంలో రైతులు, మహిళలను తీవ్రంగా హింసించారని, ఎంత మంది వేధించినా రైతులు నిరసనలు ఆపలేదని అన్నారు. ఏపీ రాజధానిపై 12 ఏండ్లుగా అస్పష్టత ఉందన్నారు. అస్పష్టత వల్లే పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్లాయని తెలిపారు. దుగరాజపట్నం, కడప స్టీల్ ప్లాంట్‌ను ముగిసిన అధ్యాయం చేశారంటూ మండిపడ్డారు. . ‘బిల్లు పెట్టడం కాదు.. సమయానికి రాజధానిని పూర్తి చేసి చూపించాలి.
జగన్ మూడు రాజధానుల పేరుతో రాజధాని లేకుండా చేశారు. రెండు రాష్ట్రాలతో కేంద్రం ఆటలు ఆడుతోంది. రూ. 1.47 లక్షల కోట్ల విలువైన ఆస్తుల పంపకాలు జరగలేదు. తెలంగాణకు ఇచ్చిన హామీలు కూడా కేంద్రం నెరవేర్చలేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎన్‌టీపీసీ కూడా కేంద్రం ఇవ్వలేదు. ఇప్పటివరకు హామీలు ఎందుకు నెరవేర్చలేదో కేంద్రం చెప్పాలి. హామీలు అమలు చేయనందుకు రెండు రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాలి’ అని అన్నారు. ’12 ఏండ్ల తరువాత కూడా ఆస్తుల పంపకం ఇంకా పూర్తి కాలేదు. ఐదు గ్రామాలు ఏ రాష్ట్రానికి చెందకుండా పోయాయి. భౌగోళికంగా ఏపీలో ఉన్నా.. ఆ గ్రామాలు ఇంకా ఇబ్బంది పడుతున్నాయి. తెలంగాణలో ఉండాలని కోరకుంటున్న వాళ్లను ఆంధ్రాలో కలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాలు కలిసే ముందుకు సాగక తప్పదు’ అని అన్నారు.తెలుగు ప్రజలందరికీ నేడు చరిత్రాత్మకమైన రోజు అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై బిల్లులో లేదన్నారు. అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణమూ జరగలేదని తెలిపారు. రాజధాని రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో స్పష్టత లేదన్నారు. రాజ్యాంగంలో రాజధాని అంశం ఎక్కడ ఉందని ప్రశ్నించారు.ఏపీ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ఏపీ రీ ఆర్గనైజేషన్ చట్టాన్ని, తిరిగి ఏపీ రీ కన్‌స్ట్రక్చన్ బిల్లుగా మార్చొద్దని బీఆర్‌ఎస్ ఎంపీ కెఆర్ సురేశ్‌రెడ్డి హితవు పలికారు. ఏపీ, తెలంగాణలు… ఒక శరీరం, రెండు కండ్లు అనేది కేసీఆర్ సిద్ధాంతం అని అన్నారు.
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, నదీముల్ హక్ (టీఎంసీ), సంజయ్ సింగ్, సందీప్ కుమార్ పాఠక్ (ఆప్), బీజేపీ ఎంపీలు పాక వెంకట సత్యనారాయణ,ఆర్. కృష్ణయ్య, నిరంజన్ బిషి (బీజేపీ), సంజయ్ యాదవ్ (ఆర్జేడీ), సంజయ్ కుమార్ ఝా (జేడీయూ), బీద మస్తాన్ రావు, సానాసతీశ్ (టీడీపీ), ప్రియాంక చతుర్వేది (శివసేన), రవి చంద్ర వద్దిరాజు (బీఆర్‌ఎస్) తదితరులు చర్చలో పాల్గొన్నారు. అనంతరం బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. తరువాత బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఈ బిల్లు ఆమోదం పొందడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజ్యసభ చైర్మెన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యసభలో బిల్లుపై చర్చ సందర్భంలో మంత్రి నారా లోకేశ్ విజిటర్స్ గ్యాలరీ నుంచి వీక్షించారు.



