నవతెలంగాణ – గోవిందరావుపేట
పండుగ పేరుతో పెరిగిన చార్జీలపై ప్రయాణికుల ఆగ్రహం రాఖీ పండుగ సందడి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు మహిళలతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామున నుంచే పట్టణ, గ్రామ బస్‌స్టాండ్‌లు రద్దీగా మారాయి. అన్నదమ్ముల ఇళ్లకు వెళ్లేందుకు సరికొత్త చీరలు, బహుమతులు, రాఖీలు చేతబట్టి వచ్చిన మహిళలు బస్సుల ఎక్కే క్రమంలో తోపులాటలకు దిగారు. ప్రతి బస్సు స్టాప్ వద్ద ప్రయాణికుల పోటీ తారస్థాయికి చేరుకోవడంతో, కొన్ని చోట్ల మహిళలు, పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పండుగ సీజన్‌ను వాణిజ్యావకాశంగా మార్చుకున్న ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపినా, చార్జీలను 30 శాతం వరకు పెంచినట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పురుషులు ఈ అధిక ఛార్జీలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పండుగ పేరుతో సాధారణ ప్రజల జేబులు ఖాళీ చేయడం అన్యాయం అని మండిపడుతున్నారు. “ప్రతి పండుగకి ఇదే తరహా పెంపులు చేస్తే, మధ్యతరగతి ప్రజలు బస్సు ప్రయాణం మానేయాల్సి వస్తుంది” అని కొందరు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెరిగిన బస్సుల డిమాండ్
రాఖీ పండుగ, వారాంతపు సెలవులు కలిసివచ్చిన కారణంగా బస్సుల డిమాండ్ మరింత పెరిగింది. రోడ్లపై ఆటోలు, క్యాబ్‌లు, బైకులు కూడా రద్దీగా సంచరించడంతో, కొన్ని చోట్ల ట్రాఫిక్ జాం పరిస్థితులు ఏర్పడ్డాయి. పండుగ సందడి, పెరిగిన ఛార్జీలు, బస్సుల రద్దీ – ఇవన్నీ కలసి బస్‌స్టాండ్‌ల వద్ద కాసేపు కూడా నిలబడలేని పరిస్థితిని సృష్టించాయి.
బస్సు సర్వీసులు పెంచాలి: మంచాల కవిత ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు
హనుమకొండ నుంచి ఎటునాగారం వెళ్లే ప్రయాణికులు బస్సులు తక్కువ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బస్సులలో సుమారు 100 కిలోమీటర్లు నిలబడి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పండుగల సమయంలో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది .కాబట్టి ప్రభుత్వం వెంటనే బస్ సర్వీసులు పెంచి ప్రయాణికులకు రవాణా సౌలభ్యం కల్పించే విధంగా చూడాలి.