నవతెలంగాణ – హైదరాబాద్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు తెలిపారు. తెలుగు సినిమా గతిని మార్చిన ‘శివ’ చిత్రం రీరిలీజ్ సందర్భంగా చిరంజీవి ఆ సినిమాపై, తనపై ప్రశంసలు కురిపిస్తూ ఓ వీడియో విడుదల చేయగా, దానిపై వర్మ స్పందించారు. “తెలియకుండా మిమ్మల్ని ఎప్పుడైనా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి” అంటూ ఆయన ట్వీట్ చేశారు. చిరంజీవి గొప్ప మనసును ఈ సందర్భంగా కొనియాడారు. వివరాల్లోకి వెళితే.. అక్కినేని నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1989లో వచ్చిన కల్ట్ క్లాసిక్ ‘శివ’ నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా రీరిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో, మెగాస్టార్ చిరంజీవి ‘ది పంచ్ ఆఫ్ శివ’ పేరుతో విడుదలైన డాక్యుమెంటరీ వీడియోలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘శివ’ ఒక సినిమా కాదని, అదొక విప్లవమని చిరంజీవి అభివర్ణించారు. ఆ సినిమా చూసినప్పుడు షాకింగ్ గా అనిపించిందని, తెలుగు సినిమాకు కొత్త ఒరవడి సృష్టించిందని కొనియాడారు.
ముఖ్యంగా సైకిల్ చైన్ లాగే సన్నివేశాన్ని ఇప్పటికీ మర్చిపోలేనని, అదొక కల్ట్ సీన్‌గా తన మనసులో నిలిచిపోయిందని గుర్తుచేసుకున్నారు. నాగార్జున నటనలోని తీవ్రత, అమల, రఘువరన్‌ల పాత్రలు సినిమాకు ప్రాణం పోశాయని అన్నారు. ఈ సినిమా నేటి తరం కూడా చూడాలని, అప్పట్లోనే ఎంత ఆధునికంగా తీశారో తెలుసుకోవాలని చిరు ఆకాంక్షించారు. ఈ కల్ట్ క్లాసిక్ వెనుక ఉన్న ముఖ్యమైన వ్యక్తి రామ్ గోపాల్ వర్మేనని చిరంజీవి అన్నారు. ఆయన విజన్, కెమెరా యాంగిల్స్, సౌండ్ ప్రజెంటేషన్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. “చెన్నైలో సినిమా చూశాక, ఆయన్ను అభినందించడానికి పూల బొకే పంపడమే కాకుండా, ఫోన్ చేసి మాట్లాడాను. ఆ యువ దర్శకుడే తెలుగు సినిమా భవిష్యత్ అని ఆ రోజే అనిపించింది” అని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. చిరంజీవి చేసిన ఈ ప్రశంసల వీడియోకే రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ… గతంలో నా ప్రవర్తన పట్ల మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలుపుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.



