– కృషి, పట్టుదలతో యువతకు ఆదర్శం.
-;ఎక్సైజ్ కానిస్టేబుల్ నుంచి గ్రూప్-1 లో జిల్లా అధికారి వరకు
– ఎస్సై ఆర్. లావణ్య ప్రయాణం.
– కష్టపడితే ఫలితం వస్తుందనడానికి ఇది నిదర్శనం.
– రామారెడ్డి ఎస్సై ఆర్. లావణ్య ను అభినందించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర,
నవతెలంగాణ – కామారెడ్డి
రామారెడ్డి ఎస్సై ఆర్. లావణ్య మొదటగా 2018 లో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. 2020లో సివిల్ ఎస్సైగా, 2025లో గ్రూప్ –1లో జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టును సాధించడం ద్వారా అసాధారణ ప్రతిభను చాటుకున్నారు. ఎస్ హెచ్ ఓ గా విధులు నిర్వహిస్తూ, తన కృషి, పట్టుదలతో యువతకు ఆదర్శంగా నిలిచారు. జిల్లా పరిషత్ చేబర్తి (సిద్ధిపేట్ జిల్లా)లో ప్రాథమిక విద్యను పూర్తిచేసి, తరువాత IIIT (త్రిపుల్ ఐటీ) బాసరలో సీటు సాధించి మంచి ఆసక్తితో విద్యను అభ్యసించారు. పోలీస్ ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలు, ఆటుపోట్లు, సమయ పరిమితులను అధిగమిస్తూ, లభించిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని గ్రూప్ – 1 ఉద్యోగాన్ని సాధించడం గొప్ప విషయం అని జిల్లా ఎస్పీ అభినందించారు. జిల్లాలో ప్రొబేషనరీ పూర్తి చేసిన అనంతరం, ఆర్. లావణ్య నస్రుల్లాబాద్ పోలీస్ స్టేషన్, రామారెడ్డి పోలీస్ స్టేషన్‌లలో ఎస్ హెచ్ ఓ గా విధులు నిర్వహించారు. పోలీసు విధులలో ఎలాంటి రిమార్కులు లేకుండా అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భవిష్యత్తులో తన ప్రతిభతో మంచి పేరు సంపాదించి, ప్రజలకు సేవ చేస్తూ, తనదైన ముద్రను వేసుకోవాలని ఆకాంక్షించారు. ఆర్.లావణ్య కృషి, పట్టుదల, తపన యువతకు, ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుంది అని తెలిపారు