విడుదలలో జాప్యంపై జైలు అధికారుల క్షమాపణ
ముంబయి : ఎల్గార్ పరిషత్ – మావోయిస్టులతో సంబంధాలు కేసులో అరెస్టయిన సామాజిక కార్యకర్త రమేష్ గైచోర్ తాత్కాలిక బెయిల్‌పై విడుదలయ్యారు. బుధవారం రాత్రి రమేష్ గైచోర్ నవీ ముంబయిలోని తలోజా జైలు నుంచి విడుదలయ్యారని జైలు అధికారులు గురువారం బాంబే హైకోర్టుకు తెలిపారు. 2017 డిసెంబర్ 31న మహారాష్ట్రలోని పూణేలో జరిగిన ఎల్గార్ పరిషత్ సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ పోలీసులు అరెస్టు చేసిన వారిలో రమేష్ కూడా ఉన్నారు. 2020 సెప్టెంబర్‌లో అరెస్టయిన రమేష్ గైచోర్ అనారోగ్యంతో ఉన్న 76 ఏళ్ల తన తండ్రిని కలిసేందుకు రెండు వారాలపాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించగా, తిరస్కరించింది. ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించడంతో ఆగస్ట్ 26న మూడు రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ.. ట్రయల్ కోర్టు నుండి విడుదల వారెంట్ సమర్పించాల్సిందేనంటూ జైలు అధికారులు రమేష్‌ను విడుదల చేయలేదు. ఈ విషయమై ఆయన తరపు న్యాయవాది మిహిర్ దేశారు బుధవారం హైకోర్టులో పిటిషన్ సమర్పించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎఎస్ గడ్కరీ నేతృత్వంలోని ధర్మాసనం.. కోర్టు ఆదేశాన్ని పాటించనందున జైలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జైలు అధికారులు అతనిని వేధిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో జైలు సూపరింటెండెంట్ బేషరతుగా క్షమాపణలు తెలుపుతూ గురువారం అఫిడవిట్ దాఖలు చేశారు. రమేష్‌ను విడుదల చేసినట్లు తెలిపారు. కోర్టు ఆ అఫిడవిట్‌ను ఆమోదించి, గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తూ ఈ నెల 13 వరకూ రమేష్‌కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఐదేళ్లుగా రమేష్ గైచోర్ తన తండ్రిని కలవలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఎల్గార్ పరిషత్ కేసులో రమేష్ గైచోర్‌కు తాత్కాలిక బెయిల్
- Advertisement -
- Advertisement -