నవతెలంగాణ – హైదరాబాద్: ఈనాడు గ్రూప్ సంస్థల వ్యవస్థాపక అధినేత రామోజీరావు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, సినీ ప్రముఖులు మురళీమోహన్, బ్రహ్మానందం తదితరులు హాజరయ్యారు.
జర్నలిజం, గ్రామీణాభివృద్ధి, మానవ సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కళ-సంస్కృతి, యూత్ ఐకాన్, మహిళా సాధికారత వంటి ఏడు రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారికి ఈ వేదికపై అవార్డులను ప్రదానం చేయనున్నారు. రామోజీరావు స్ఫూర్తిని కొనసాగిస్తూ వివిధ రంగాల్లో అద్భుతమైన కృషి చేసిన వారిని ఈ పురస్కారాలతో సత్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పక్కపక్కనే ఆసీనులై నవ్వుతూ మాట్లాడుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇద్దరు నేతలు నవ్వులు చిందిస్తూ ముచ్చటించుకుంటున్న దృశ్యాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.



