Tuesday, February 24, 2026
E-PAPER
Homeఆటలునేటి నుంచి రంజీ ఫైనల్‌

నేటి నుంచి రంజీ ఫైనల్‌

- Advertisement -

జమ్మూ కశ్మీర్‌తో కర్నాటక ఢీ
ఉదయం 9.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

నవతెలంగాణ-హుబ్లీ : సుమారు 4 నెలలుగా సాగుతున్న రంజీ ట్రోఫీ అంతిమ ఘట్టానికి చేరుకుంది. తొలి మ్యాచ్‌లో ముంబయి చేతిలో 35 పరుగుల తేడాతో ఓడిన జమ్మూ కశ్మీర్‌.. గ్రూప్‌ దశ ఆఖరు మ్యాచ్‌లో మెరుపు విజయంతో నాకౌట్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్న కర్నాటక టైటిల్‌ పోరుకు చేరుకుంటాయని ఎవరూ ఊహించలేదు. నాకౌట్‌లో ఇటు జమ్మూ కశ్మీర్‌, అటు కర్నాటక సాధికారిక ప్రదర్శన కనబరిచాయి. దేశవాళీ సర్క్యూట్‌లో బలమైన జట్లు ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, బెంగాల్‌పై జమ్మూ కశ్మీర్‌ గెలుపొందగా.. కర్నాటక నాకౌట్‌లో ఎదురులేని విజయాలు సాధించింది. క్వార్టర్స్‌లో ముంబయిపై 4 వికెట్ల విజయంతో పాటు సెమీస్‌లో ఉత్తరాఖాండ్‌పై 1000 ప్లస్‌ పరుగులతో మోత మోగించింది. ఇప్పుడు ఈ రెండు జట్లు టైటిల్‌ పోరులో తలపడేందుకు సిద్ధమయ్యాయి. జమ్మూ కశ్మీర్‌ తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుని టైటిల్‌పై కన్నేయగా.. కర్నాటక రికార్డు తొమ్మిదో టైటిల్‌ వేటలో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. 14 సార్లు రంజీ ట్రోఫీ ఫైనల్లో ఆడిన కర్నాటక.. 8 సార్లు విజేతగా నిలిచింది. కర్నాటక, జమ్మూ కశ్మీర్‌ రంజీ ట్రోఫీ ఫైనల్‌ నేటి నుంచి ఆరంభం.

బౌలింగ్‌ వర్సెస్‌ బ్యాటింగ్‌! : రంజీ ట్రోఫీ ఫైనల్లో జమ్మూ కశ్మీర్‌ బౌలర్లు, కర్నాటక బ్యాటర్ల మధ్య పోటీ ఫలితాన్ని నిర్దేశించనుంది. పరుగుల సునామీతో కర్నాటక జోరుమీదుండగా.. వికెట్ల వేటలో జమ్మూ కశ్మీర్‌ కొత్త పుంతలు తొక్కుతోంది. జమ్మూ కశ్మీర్‌ బౌలర్లలో అకిబ్‌ నబి 9 మ్యాచ్‌ల్లో 55 వికెట్లు పడగొట్టగా..లెఫ్టార్మ్‌ పేసర్‌ సునీల్‌ కుమార్‌ 8 మ్యాచ్‌ల్లో 29 వికెట్లు తీసుకున్నాడు. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అబిడ్‌ ముస్తాక్‌ 9 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. కర్నాటక బ్యాటర్లలో రవిచంద్రన్‌ స్మరణ్‌ 13 ఇన్నింగ్స్‌ల్లో 95 సగటుతో 950 పరుగులు చేయగా, కరుణ్‌ నాయర్‌ 12 ఇన్నింగ్స్‌ల్లో 63.54 సగటుతో 699 పరుగులు, దేవదత్‌ పడిక్కల్‌ 9 ఇన్నింగ్స్‌ల్లో 66.50 సగటుతో 532 పరుగులు చేశారు. కెఎల్‌ రాహుల్‌ 6 ఇన్నింగ్స్‌ల్లో 457 పరుగులతో దంచికొట్టాడు. వీళ్లకు తోడు మయాంక్‌ అగర్వాల్‌ సైతం ఫామ్‌లో ఉన్నాడు. జమ్మూ కశ్మీర్‌ బౌలర్లు మరో అద్భుత ప్రదర్శనతో చారిత్రక రంజీ ట్రోఫీ సాధిస్తారా? బ్యాటర్ల మెరుపులతో కర్నాటక ఖాతాలో తొమ్మిదో టైటిల్‌ చేరుతుందా? ఆసక్తికరం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -